Medical Care
-
పిండం వయసును నిర్ధారించే ఏఐ.. ఎవరు తయారు చేశారంటే..
గర్భంలోని పిండం వయసును అత్యంత కచ్చితత్వంతో లెక్కింటే ఒక కృత్రిమ మేధ (ఏఐ) పరికరాన్ని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇది నిర్దిష్టంగా భారతీయ అవసరాలకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఇది మూడు నెలలు పైబడిన పిండం వయసును లెక్కించడానికి సాయపడుతుంది. పరిశోధనలో ఫరీదాబాద్‌లోని ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్(టీహెచ్ఎస్టీఐ) పరిశోధకులు కూడా భాగస్వాములయ్యారు. పిండం వయసును కచ్చితత్వంతో నిర్ధారించడం చాలా అవసరం. దానివల్ల గర్భిణికి సరైన సంరక్షణ అందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే కాన్పు తేదీని కూడా నిర్దిష్టంగా అంచనా వేయవచ్చు. తాజా ఏఐ పరికరానికి ‘గర్భిణి-జీఏ2’ అని పేరు పెట్టారు. భారతీయ జనాభా డేటాను ఉపయోగించి రూపొందిన తొలి ఏఐ సాధనం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం పశ్చిమ దేశాల జనాభా కోసం రూపొందించిన ఒక సూత్రం ఆధారంగా పిండం వయసును లెక్కిస్తున్నారు. ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు మూడు నెలలు నిండాక దీన్ని వర్తింపజేస్తే.. ఫలితంలో తప్పు రావొచ్చు. భారతీయ జనాభాలో పిండం ఎదుగుదలలో ఉన్న వైరుధ్యాలే ఇందుకు కారణం. ‘గర్భిణి-జీఏ2’తో ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. తద్వారా భారత్‌లో మాతా శిశు మరణాల రేటు తగ్గుతుందని చెప్పారు. -
డిశ్చార్జికి.. రీచార్జికి మధ్య ‘ట్రాన్సిషనల్ కేర్’.. కొత్త వైద్యసేవలకు డిమాండ్
నాగేందర్ (55) దిల్సుఖ్నగర్ నివాసి. తీవ్రమైన నరాల వ్యాధికి గురై ఖైరతాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వెళ్లారు. కానీ నాలుగైదు రోజుల్లోనే సమస్యలు తిరగబెట్టి ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేవల లోపం దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యుల సూచనలను కచ్చితంగా అమలు చేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ‘ట్రాన్సిషనల్ కేర్’అవసరమని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు రోగులు చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనో.. అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటున్నారు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్ కేర్ సేవలు పుట్టుకొచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేవరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్ కేర్. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. వ్యాధి సమస్యల కారణంగా ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేందుకు మానసిక పర్యవేక్షణ కావాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరోసైన్స్, కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతర సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్ కేర్ మంచి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి వారికి? ఎప్పుడు? ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ప్రతి లక్ష మంది బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 120కిపైగా మళ్లీ స్ట్రోక్ బారిన పడే చాన్స్ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాతా ఆస్పత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆస్పత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మారి్పడి వంటివాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే రెండు–మూడు వారాల వ్యవధిలో ప్రత్యేక ట్రాన్సిషనల్ కేర్ అవసరమని వివరిస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కొందరికి ఫిజియోథెరపీ, మానసిక కౌన్సెలింగ్ వంటివి సుదీర్ఘకాలం చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా కేర్ సెంటర్‌ను ఎంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్ సమస్య ఉన్నవారికీ ట్రాన్సిషనల్ కేర్ అవసరమని అంటున్నారు. ఇక స్వాలో, స్పీచ్ థెరపిస్ట్, మసు్క్యలోస్కెలెటల్ ఫిజియోథెరపిస్ట్ సేవలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషీన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. కేర్ సెంటర్లు ఏం చేస్తాయి? ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లు, డైటీíÙయన్లు, సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు, న్యూరో, కార్డియాక్ ఫిజియో థెరపిస్టులు, సైకోథెరపిస్టులు, రోగి పూర్తిగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజు్ఞలైన, మల్టీడిసిప్లినరీ రీహ్యాబ్ కేర్ టీమ్ రోగులను పూర్వస్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది. రోగి డిశ్చార్జి సమ్మరీని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి అవగాహన ఏర్పరుచుకుని, అవసరమైన సేవలను అందిస్తారు. రోగుల పొజిషన్లను మార్చే బెడ్‌సైడ్ అసిస్టెంట్లు, ఆహారాన్ని అందించే నర్సులు కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ఇంటర్నల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వ్యయ ప్రయాసలు తగ్గించే క్రమంలో.. దేశంలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ల అవసరం ఏర్పడింది. సర్జరీ/ ప్రధాన చికిత్స వంటివి జరిగాక.. పూర్తిగా కోలుకోవడానికి ఆస్పత్రిలోనే ఉండటం తీవ్ర వ్యయ భారంతో కూడుకున్నది. అంతేగాకుండా ఇతర రోగులకు చికిత్స అందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఈ సపోర్టివ్ కేర్ సేవలు అందిస్తుంది. – డాక్టర్ రామ్ పాపారావు, చైర్మన్, ఉచ్ఛా్వస్ ట్రాన్సిషనల్ కేర్ చదవండి: డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం! -
పట్టణ పేదలకు ఆరోగ్య ధీమా
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలే కాదు.. పట్టణ పేదలకూ సర్కారు ఆరోగ్య ధీమా ఇచ్చింది. పట్టణాల్లో పేదలు, మధ్యతరగతి వారు ఆస్పత్రుల ఖర్చు భరించలేనంతగా పెరగడంతో వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తూ 560 పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 1.60 కోట్ల మంది పట్టణాల్లో ఉన్నారు. అందులో 37 శాతంమంది మురికివాడల్లో ఉంటున్నారు. వైద్యం అవసరమైనవారు పెద్దాస్పత్రులకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. ప్రైవేటు డాక్టరు దగ్గరికి వెళితే ఫీజు, వ్యాధి నిర్ధారణ పరీక్షల బిల్లులు భరించలేనంతగా ఉంటున్నాయి. దీంతో వారు ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను మరింత చితికిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పట్టణాల్లో ఉన్న పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 260 పట్టణ ఆరోగ్యకేంద్రాలను, 71 కుటుంబ ఆరోగ్యకేంద్రాలను (మొత్తం 331) ఉన్నతీకరిస్తూ, కొత్తగా 229 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భవనాల నిర్మాణం, మరమ్మతులు, పరికరాలు, ఫర్నిచర్ కోసం రూ.416.50 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వైద్యులు, ల్యాబ్టెక్నీషియన్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, సహాయక సిబ్బంది 560 మంది వంతున, స్టాఫ్ నర్సులు 1,120 మంది ఉంటారు. దేశంలోనే మొదటిసారిగా.. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్యంపై ఇంత భారీస్థాయిలో ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. తొలిసారిగా 111 మున్సిపాలిటీల్లో 560 ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది మన రాష్ట్రంలోనే. స్పెషాలిటీ వైద్యానికి ఎలాగూ బోధనాస్పత్రులున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం అంటే.. చిన్న జ్వరాలు, గాయాలు వంటి వాటికి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించకుండా భారీవ్యయంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 8,600కుపైగా వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలు ఇలా ► పట్టణాల్లో ఉన్న వారికి 15 నిమిషాల నడక దూరంలో ఆస్పత్రి ఉంటుంది. ► డాక్టరు, స్టాఫ్ నర్సుతో పాటు అత్యవసర వైద్యసేవలకోసం ఆరు పడకలుంటాయి. ► 63 రకాల రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులో.. ► ప్రస్తుతం 260 వరకు పట్టణ ఆరోగ్యకేంద్రాలు పీపీపీ పద్ధతిలో నడుస్తున్నాయి. ► వీటికోసం ఏటా రూ.150 కోట్లు ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారు. ► ఇదే రూ.150 కోట్లతో అంతకంటే మెరుగ్గా 560 కేంద్రాల్లో సేవలు అందిస్తారు. ► తాజా పట్టణ జనాభా ప్రకారం 26,500 మందికి ఒక ఆరోగ్యకేంద్రం ఉంటుంది. ► గతంలో పీపీపీ కింద అమలవుతున్న ఆరోగ్యకేంద్రాలు 79 పట్టణాల్లో మాత్రమే ఉండేవి. ► ఇప్పుడు 111 పట్టణాల్లోనూ ఆరోగ్యకేంద్రాల సేవలు అందుతాయి. -
వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ‘ఆరోగ్య శ్రీ’
-
దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా ఉచిత వైద్యం
సాక్షి, తెనాలి: ఏ రాష్ట్రమూ కనీవినీ ఎరుగని రీతిలో ఆరోగ్య సంరక్షణా పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటిచ్చారు. పేదలు ఎవరైనా.. దేశంలోని ఏ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని, ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని అన్నారు. మహానేత వైఎస్సార్ పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే, ఆయన తనయుడిగా జగన్ రెండు అడుగులు వేస్తాడని, నవరత్నాల్లో ఒకటైన వైఎస్సార్ ఆరోగ్య పథకాన్ని ఈ మేరకు అత్యున్నతంగా తీర్చిదిద్దామని, ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రభుత్వంలో ఇవన్నీ అమలవుతాయని జననేత పేర్కొన్నారు. 130వ రోజు ప్రజాసంకల్పయాత్రలో శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఏ ఊరికి వెళ్లినా, ఎంత ఖర్చైనా నాదీ బాధ్యత: ‘‘పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడో, కుటుంబీకులకు పెద్ద జబ్బు వచ్చినప్పుడో పేదలు అప్పులపాలవుతారని మహానేత వైఎస్సార్ అనేవారు. వాళ్ల జీవితాలు చెదిరిపోవద్దనే ఉద్దేశంతోనే ఆయన ‘ఆరోగ్య శ్రీ’ ప్రారంభించారు. కొన్ని వేల మంది ఆ పథకం ద్వారా ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ గత నాలుగేళ్లుగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆరోగ్య శ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌కు పోతే.. ఏపీ కార్డులు అక్కడ చెల్లవని అంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసింది మరెవరోకాదు చంద్రబాబు నాయుడే. ఆ దుర్మార్గపు పాలన ముగిసి, మంచి రోజులు వచ్చి, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘ఆరోగ్య శ్రీ’ని సమున్నతంగా అమలుచేస్తాం. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల్లో ఈ విషయాన్ని పేర్కొన్నాం. ఈ సందర్భంగా ఇంకొన్ని అంశాలు హామీ ఇస్తున్నాను.. ►ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ►వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ►దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మందుల కోసం నెలనెలా రూ.10 వేలు సాయంగా ఇస్తాం. ►మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం. ►ప్రతి మండల కేంద్రంలో కిడ్నీ పేషెంట్ల కోసం డయాలసిస్ సెంటర్లు, క్యాన్సర్ పేషెంట్ల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాట్లు చేస్తాం ►ఆపరేషన్ పూర్తయిన తర్వాత వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరుకాబట్టి వారికీ నెల నెలా ఆర్థిక సాయం అందిస్తాం. పెన్షన్ అర్హత వయసు 60 ఏళ్లే: వృత్తి కూలీలకు 45 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని ఇదివరకే చెప్పాం. సాధారణ వృధ్ధాప్య పెన్షన్ల విషయంలోనూ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని మాటిస్తున్నా. వయసు పెరిగే కొద్దీ వైద్యం కోసం ఖర్చులు పెరుగుతాయి కాబట్టే ప్రతి అవ్వకు, తాతకు 60 ఏళ్ల నుంచే నెలకు రూ.2 వేలు పెన్షన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద మహిళలకు 45 ఏళ్లకే రూ.2 వేలు పెన్షన్ అందిస్తాం. ఇప్పుడు చెప్పినవే కాకుండా నవరత్నాల పథకాల్లో ఏవైనా మార్పులు, చేర్పులు సూచించాలనుకుంటే నేరుగా నన్నే కలవొచ్చు’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
కేంద్ర ఉద్యోగులకు సులువుగా ప్రైవేట్ వైద్యం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) లబ్ధిదారులు ఇకపై ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ తేలిగ్గా వైద్య సేవలు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా ఎటువంటి రెఫరల్ గానీ, అనుమతి గానీ అవసరం లేదని పేర్కొంది. ఈ పథకం కింద గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే విధానాన్ని మరింత సరళీకృతం చేయాలంటూ పలు అభ్యర్థనలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పింఛనుదారులు, మాజీ ఎంపీలు, సమరయోధులు, సాధారణ ఉద్యోగులు నగదు రహిత విధానంలో వైద్యం పొందవచ్చని వివరించింది. ఉద్యోగులు, వారి సంబంధీకులు చికిత్స పూర్తయిన అనంతరం సీజీహెచ్ఎస్ వైద్యాధికారి లేదా ప్రభుత్వ వైద్య నిపుణుడు జారీ చేసిన ప్రిస్క్రిప్షన్‌ను ఆస్పత్రి బిల్లుకు జత చేసి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటిదాకా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలనుకునే ఉద్యోగులు ముందుగా ప్రభుత్వ వైద్యాధికారుల రెఫరల్ లేదా అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉండేది. ఇకపై చికిత్స పూర్తయిన అనంతరమే దీనిని అందజేయవచ్చని పేర్కొంది. -
మందుల ‘చీటింగ్
ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు వైద్యులుగా చలామణి అవుతున్న ఫార్మసిస్ట్‌లు విచ్చలవిడిగా గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బాధితులు సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్‌కు చెందిన మహిళ ఇటీవల గర్భస్రావం కోసం దగ్గర్లోని మెడికల్ షాపునకు వెళ్లింది. వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకుండానే సదరు దుకాణదారుడు కొన్ని టాబ్లెట్లు ఇచ్చాడు. వాటిని తీసుకున్న రెండోరోజే మహిళకు గర్భస్రావం కావడంతోపాటు ప్రాణాలను కోల్పోయింది. కడుపులోని పిండం మెరుగుదల కోసం విద్యానగర్‌లోని ఓ ఆస్పత్రి వైద్యురాలు మందు పేరును అర్థం కాకుండా కలిపి రాయడం వల్ల సదరు ఆస్పత్రిలోని ఫార్మసిస్ట్ ‘మైప్రోజిస్ట్’కు బదులు‘మిసోప్రెస్ట్’ఇవ్వడంతో బాధిత మహిళ గర్భాన్ని కోల్పోయింది. దీనిపై సుప్రీకోర్టులో కేసు నడుస్తోంది. ఇవి ఉదాహరణలు మాత్రమే. అనేక హానికారక మందులను మెడికల్ షాపుల్లో ప్రిస్కిప్షన్లు లేకుండానే ఇచ్చేస్తున్నారు. ఇవి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. రోగుల అవగాహన రాహిత్యం మెడికల్ షాపుల గిరాకీని పెంచుతోంది. వైద్యుల సలహా లేకుండా ఇష్టానుసారం రోగులు యాంటీబయోటిక్స్ వాడటం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గి అకాల మృత్యువాత పడుతున్నారు. 1940 డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్మడం నేరం. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి తదితర 25 రకాల నాన్‌షెడ్యూల్ మందులనే ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించాలి. మరో వెయ్యి రకాల మందులను ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్కిప్షిన్ లేకుండా విక్రయించరాదు. అధికారుల ఉదాసీనత, చట్టాల్లోని లొసుగులతో కొందరు ఫార్మసిస్ట్‌లు వైద్యులు రాసిన మందుల చీటీతో సంబంధం లేకుండానే రోగులకు మందులు ఇచ్చేస్తున్నారు. నగరంలో 30 శాతం అమ్మకాలు ప్రిస్కిప్షిన్ లేకుండానే జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు రెండో రకం నాణ్యత కలవే కావడం గమనార్హం. జలుబు, జ్వరం, తలనొప్పి మాత్రలే కాదు, గర్భస్రావానికి ఉపయోగించే ప్రమాదకరమైన మెఫఫిన్, జొటాటెక్, ఐపిల్స్తో పాటు పలు రకాల స్లీపింగ్ మాత్రలను సైతం యథేచ్ఛగా అమ్ముతుండటం విశేషం. మెడికల్ షాపుల్లో తనిఖీలేవీ? గ్రేటర్లో పదివేలకుపైగా మందుల దుకాణాలున్నాయి. ఇవి రోజూ రూ.పది కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు అంచనా. అయితే 50 శాతం దుకాణాల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్‌లు లేరు. చాలామంది సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని షాపులు నడుపుతున్నారు. ఫార్మారంగంపై కనీస అవగాహన లేని వారు మందులు విక్రయిస్తుండటంతో పరిస్థితి వికటిస్తోంది. నిషేధిత మందులపై సరైన ప్రచారం లేకపోవడంతో వాటినీ యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. అనివార్యమైతే తప్ప పసిపిల్లలకు డబ్బాపాలను సూచించడం, అమ్మడం చేయరాదు. కానీ అన్ని మెడికల్‌షాపుల్లోనూ ఈ ఉత్పత్తులు కొల్లలుగా కనిపిస్తున్నాయి. ఔషధ దుకాణాల్లో కనీసం ఆరు నెలలకోసారి తనిఖీలు చేయాల్సి ఉండగా, డ్రగ్ఇన్స్పెక్టర్లు అటువైపు చూడట్లేదు. హయత్‌నగర్, ఖైరతాబాద్, పంజగుట్ట, దిల్సుఖ్నగర్, అఫ్జల్‌గంజ్, కోఠి, ఎల్బీనగర్, ఉప్పల్, రామంతాపూర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, చాంద్రాయణగుట్ట, పాతబస్తీల్లోని మందుల దుకాణాల్లో నాణ్యతలేని, అనుమతిలేని, గడువు ముగిసిన మందులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.. నేరుగా మెడికల్ షాపు యజమానులు ఇచ్చే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఒక్కోసారి ప్రాణాలకూ ముప్పే. వైద్యంపై కనీస అవగాహన లేని వారిచ్చే మందులు వాడటం శ్రేయస్కరం కాదు. డాక్టర్ సిఫార్సు చేసినవే వాడాలి - ప్రొ.నాగేందర్, ఉస్మానియా మెడికల్‌కాలేజీ వైద్యుల రాతలపై ‘సుప్రీం’లో కేసు పలువురు వైద్యులు అర్థం కాని విధంగా మందుల పేర్లు రాస్తున్నారు. తొలి, చివరి అక్షరం తప్ప మరేమి రాయట్లేదు. దీంతో అనుభవం లేని ఫార్మసిస్టులు ఒకటి బదులు మరొకటి ఇస్తున్నారు. మందుల పేర్లు సామాన్యులకూ అర్థమయ్యేలా ఉండాలి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. - సీహెచ్.పరమాత్మ, తెలంగాణ ఫార్మసిస్టుల సంఘం కార్యదర్శి