Health Care Service Transition Centers Increasing Across Country - Sakshi
Sakshi News home page

డిశ్చార్జికి.. రీచార్జికి మధ్య.. ‘ట్రాన్సిషనల్‌ కేర్‌’.. ఊపందుకుంటున్న  సరికొత్త వైద్య సేవలు

Published Tue, May 16 2023 8:09 AM | Last Updated on Tue, May 16 2023 10:24 AM

New Health Care Service Transition Centers Increasing Across Country - Sakshi

నాగేందర్‌ (55) దిల్‌సుఖ్‌నగర్‌ నివాసి. తీవ్రమైన నరాల వ్యాధికి గురై ఖైరతాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వెళ్లారు. కానీ నాలుగైదు రోజుల్లోనే సమస్యలు తిరగబెట్టి ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేవల లోపం దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యుల సూచనలను కచ్చితంగా అమలు చేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ‘ట్రాన్సిషనల్‌ కేర్‌’అవసరమని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌:  తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు రోగులు చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనో.. అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటున్నారు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్‌ కేర్‌ సేవలు పుట్టుకొచ్చాయి.

ఆస్పత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేవరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్‌ కేర్‌. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్‌ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. వ్యాధి సమస్యల కారణంగా ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేందుకు మానసిక పర్యవేక్షణ కావాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరోసైన్స్,  కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతర సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్‌ కేర్‌ మంచి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. 

ఎలాంటి వారికి? ఎప్పుడు? 
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ప్రతి లక్ష మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌ రోగుల్లో 120కిపైగా మళ్లీ స్ట్రోక్‌ బారిన పడే చాన్స్‌ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాతా ఆస్పత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆస్పత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్‌ కేర్‌ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మారి్పడి వంటివాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే రెండు–మూడు వారాల వ్యవధి­లో ప్రత్యేక ట్రాన్సిషనల్‌ కేర్‌ అవసరమని వివరిస్తున్నారు.

డిశ్చార్జ్‌ అనంతరం కొందరికి ఫిజియోథెరపీ, మానసిక కౌన్సెలింగ్‌ వంటివి సుదీర్ఘకాలం చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా కేర్‌ సెంటర్‌ను ఎంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్‌ సమస్య ఉన్నవారికీ ట్రాన్సిషనల్‌ కేర్‌ అవసరమని అంటున్నారు. ఇక స్వాలో, స్పీచ్‌ థెరపిస్ట్, మసు్క్యలోస్కెలెటల్‌ ఫిజియోథెరపిస్ట్‌ సేవలు, ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషీన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. 

కేర్‌ సెంటర్లు ఏం చేస్తాయి? 
ట్రాన్సిషనల్‌ కేర్‌ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లు, డైటీíÙయన్లు, సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు, న్యూరో, కార్డియాక్‌ ఫిజియో థెరపిస్టులు, సైకోథెరపిస్టులు, రోగి పూర్తిగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజు్ఞలైన, మల్టీడిసిప్లినరీ రీహ్యాబ్‌ కేర్‌ టీమ్‌ రోగులను పూర్వస్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది.

రోగి డిశ్చార్జి సమ్మరీని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి అవగాహన ఏర్పరుచుకుని, అవసరమైన సేవలను అందిస్తారు. రోగుల పొజిషన్లను మార్చే బెడ్‌సైడ్‌ అసిస్టెంట్లు, ఆహారాన్ని అందించే నర్సులు కేర్‌ సెంటర్‌లో అందుబాటులో ఉంటారు. ఇంటర్నల్‌ మెడిసిన్‌కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. 

వ్యయ ప్రయాసలు తగ్గించే క్రమంలో.. 

దేశంలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్సిషనల్‌ కేర్‌ సెంటర్ల అవసరం ఏర్పడింది. సర్జరీ/ ప్రధాన చికిత్స వంటివి జరిగాక.. పూర్తిగా కోలుకోవడానికి ఆస్పత్రిలోనే ఉండటం తీవ్ర వ్యయ భారంతో కూడుకున్నది. అంతేగాకుండా ఇతర రోగులకు చికిత్స అందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఈ సపోర్టివ్‌ కేర్‌ సేవలు అందిస్తుంది. 
– డాక్టర్‌ రామ్‌ పాపారావు, చైర్మన్, ఉచ్ఛా్వస్‌ ట్రాన్సిషనల్‌ కేర్‌ 

చదవండి: డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement