సాక్షి, తెనాలి: ఏ రాష్ట్రమూ కనీవినీ ఎరుగని రీతిలో ఆరోగ్య సంరక్షణా పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటిచ్చారు. పేదలు ఎవరైనా.. దేశంలోని ఏ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని, ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని అన్నారు. మహానేత వైఎస్సార్ పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే, ఆయన తనయుడిగా జగన్ రెండు అడుగులు వేస్తాడని, నవరత్నాల్లో ఒకటైన వైఎస్సార్ ఆరోగ్య పథకాన్ని ఈ మేరకు అత్యున్నతంగా తీర్చిదిద్దామని, ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రభుత్వంలో ఇవన్నీ అమలవుతాయని జననేత పేర్కొన్నారు. 130వ రోజు ప్రజాసంకల్పయాత్రలో శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.
ఏ ఊరికి వెళ్లినా, ఎంత ఖర్చైనా నాదీ బాధ్యత: ‘‘పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడో, కుటుంబీకులకు పెద్ద జబ్బు వచ్చినప్పుడో పేదలు అప్పులపాలవుతారని మహానేత వైఎస్సార్ అనేవారు. వాళ్ల జీవితాలు చెదిరిపోవద్దనే ఉద్దేశంతోనే ఆయన ‘ఆరోగ్య శ్రీ’ ప్రారంభించారు. కొన్ని వేల మంది ఆ పథకం ద్వారా ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ గత నాలుగేళ్లుగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆరోగ్య శ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌కు పోతే.. ఏపీ కార్డులు అక్కడ చెల్లవని అంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసింది మరెవరోకాదు చంద్రబాబు నాయుడే. ఆ దుర్మార్గపు పాలన ముగిసి, మంచి రోజులు వచ్చి, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘ఆరోగ్య శ్రీ’ని సమున్నతంగా అమలుచేస్తాం. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల్లో ఈ విషయాన్ని పేర్కొన్నాం. ఈ సందర్భంగా ఇంకొన్ని అంశాలు హామీ ఇస్తున్నాను..
►ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
►వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం.
►దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మందుల కోసం నెలనెలా రూ.10 వేలు సాయంగా ఇస్తాం.
►మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం.
►ప్రతి మండల కేంద్రంలో కిడ్నీ పేషెంట్ల కోసం డయాలసిస్ సెంటర్లు, క్యాన్సర్ పేషెంట్ల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాట్లు చేస్తాం
►ఆపరేషన్ పూర్తయిన తర్వాత వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరుకాబట్టి వారికీ నెల నెలా ఆర్థిక సాయం అందిస్తాం.
పెన్షన్ అర్హత వయసు 60 ఏళ్లే: వృత్తి కూలీలకు 45 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని ఇదివరకే చెప్పాం. సాధారణ వృధ్ధాప్య పెన్షన్ల విషయంలోనూ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని మాటిస్తున్నా. వయసు పెరిగే కొద్దీ వైద్యం కోసం ఖర్చులు పెరుగుతాయి కాబట్టే ప్రతి అవ్వకు, తాతకు 60 ఏళ్ల నుంచే నెలకు రూ.2 వేలు పెన్షన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద మహిళలకు 45 ఏళ్లకే రూ.2 వేలు పెన్షన్ అందిస్తాం. ఇప్పుడు చెప్పినవే కాకుండా నవరత్నాల పథకాల్లో ఏవైనా మార్పులు, చేర్పులు సూచించాలనుకుంటే నేరుగా నన్నే కలవొచ్చు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment