న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్) లబ్ధిదారులు ఇకపై ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ తేలిగ్గా వైద్య సేవలు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా ఎటువంటి రెఫరల్ గానీ, అనుమతి గానీ అవసరం లేదని పేర్కొంది. ఈ పథకం కింద గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే విధానాన్ని మరింత సరళీకృతం చేయాలంటూ పలు అభ్యర్థనలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
పింఛనుదారులు, మాజీ ఎంపీలు, సమరయోధులు, సాధారణ ఉద్యోగులు నగదు రహిత విధానంలో వైద్యం పొందవచ్చని వివరించింది. ఉద్యోగులు, వారి సంబంధీకులు చికిత్స పూర్తయిన అనంతరం సీజీహెచ్‌ఎస్ వైద్యాధికారి లేదా ప్రభుత్వ వైద్య నిపుణుడు జారీ చేసిన ప్రిస్క్రిప్షన్‌ను ఆస్పత్రి బిల్లుకు జత చేసి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటిదాకా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలనుకునే ఉద్యోగులు ముందుగా ప్రభుత్వ వైద్యాధికారుల రెఫరల్ లేదా అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉండేది. ఇకపై చికిత్స పూర్తయిన అనంతరమే దీనిని అందజేయవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment