కమీషన్ల కొనుగోళ్లు! | Functional areas of purchasing drugs | Sakshi
Sakshi News home page

కమీషన్ల కొనుగోళ్లు!

Published Thu, Apr 23 2015 1:11 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

కమీషన్ల కొనుగోళ్లు! - Sakshi

కమీషన్ల కొనుగోళ్లు!

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో కమీషన్ల కొద్దీ మందుల కొనుగోలు
ఫార్మసిస్ట్‌లు, సరఫరాదారుల కుమ్మక్కు..
లాభం ఎక్కువ ఉన్న మందులు కుప్పలు తెప్పలుగా కొంటున్న వైనం
కమీషన్లకు కక్కుర్తిపడి ఆ మందులకే ఆర్డర్ పెడుతున్న ఫార్మసిస్ట్‌లు

 
హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులను డాక్టర్లే ఇవ్వాలి. కానీ మన రాష్ట్రంలో ఆ పనిని మందుల సరఫరాదారులే చేసేస్తున్నారు. అత్యవసర మందులులేక రోగులు ఇక్కట్లు పడుతుంటే.. ఫార్మసిస్ట్‌ల అండతో మందుల కాంట్రాక్టర్లు మాత్రం కోట్లు గడిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మౌలిక వైద్య సేవలు, సదుపాయాల సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)లో అవసరం కొద్దీ మందుల కొనుగోళ్లు కాకుండా.. ‘కమీషన్ల కొద్దీ మందుల సరఫరా’ అనే పద్ధతిలో కొనుగోళ్లు సాగుతున్నాయి. దీంతో ఏ ప్రభుత్వాసుపత్రిలో చూసినా అవసరం లేని మందులు కుప్పలు తెప్పలుగా కొంటున్నారు. ఇవి ఎక్స్‌పెయిరీకి వచ్చినా పట్టించుకోరు. అత్యవసర మందులు మాత్రం ఎక్కడా కనిపించవు. మందుల కాంట్రాక్టర్లు, ఫార్మసిస్ట్‌లు కుమ్మక్కవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి ప్రస్తుతం ఎండీ లేరు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందాకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన దీనిపై దృష్టి సారించేంత సమయం చిక్కడం లేదు. దీంతో ఇక్కడ ఫార్మసిస్టులే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇవీ లుకలుకలు..

 ► దగ్గు, జలుబుకు వాడే అమాక్సిక్ క్లావ్‌లిక్ యాసిడ్ మందును ఒకే ఏడాది రూ.7 కోట్లకు కొన్నారు. అవసరం లేకున్నా ఎక్కువగా కొన్నట్టు తేలింది.

 ►  సరోజినీదేవి ఆస్పత్రిలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మల్కాజిగిరి పీహెచ్‌సీకి 5 వేల ఇన్సులిన్ వయెల్స్ ఇచ్చారు. జిల్లాకు సరిపడా మందుల మోతాదు ఇది. కానీ ఒక్క పీహెచ్‌సీకే ఇచ్చారు. అయినా ఫార్మసిస్ట్‌లపై చర్యలు లేవు.

 ఏ మందులైనా నాసిరకమని తేలినా కాంట్రాక్టరు నుంచి కమిషన్లు తీసుకుని ఆయా మందులను అనాలసిస్ విభాగంలో పనిచేసే ఫార్మసిస్ట్ కొనసాగిస్తూన్నారు.

  సరోజిని ఆస్పత్రిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో భారీగా కమీషన్ పద్ధతిలో మందులు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు.
  జిల్లాకొక సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఉంది. ఈ స్టోర్లలో పనిచేసే ఫార్మసిస్ట్‌లందరికీ కలిపి మందుల సరఫరాదారులు ఒక్కో త్రైమాసికానికి రూ.5 లక్షలు ఇస్తున్నట్టు సమాచారం.

  మహబూబ్‌నగర్ జిల్లా పీహెచ్‌సీల్లో ఫార్మసిస్ట్‌లే లేరు. అదేజిల్లా ఫార్మసిస్టులు నలుగురు హైదరాబాద్ మందుల కొనుగోళ్ల విభాగం లో ఐదేళ్లుగా డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు.

  యాంటీబయోటిక్స్ కొనుగోలు ఆర్డర్లు ఇస్తే సదరు కాంట్రాక్టర్లు ఒక శాతం కమిషన్ ఇస్తేనే ఆర్డర్లు ఇస్తానని ఫార్మసిస్ట్ రేటు నిర్ణయించినా చర్యలు లేవు.
 
ఇవి మాత్రం కుప్పలు తెప్పలు..
 
కొన్ని మందులతో అవసరం లేకపోయినా క మీషన్ల కోసం కొన్నారు. జెంటామైసిన్, హాలోథిన్ ఐపీ, శాలిక్లిక్ యాసిడ్ క్రీం, ఆంపొటెరిసిన్, సిఫ్రాక్సిమ్ ఇంజక్షన్, ఆక్సిక్‌లోవర్ 10 జీఎం, ఆల్బెండజోల్, సినారిజైన్ టాబ్‌లెట్స్, హెపరిన్ సోడియం, పిరాక్టిమ్ ఇంజక్షన్‌లలో చాలా ఎక్స్‌పెయిరీకి దగ్గరలో ఉన్నాయి. అయినా వీటిని కొన్నారు.
 
ఈ అత్యవసర మందులు లేనే లేవు..
 
ప్రభుత్వ  ఆసుపత్రుల్లో వినియోగించే కొన్ని అత్యవసర మందులకు జిల్లాల్లో తీవ్ర కొరత ఉంది. ఎడ్రెనలైన్ టెర్‌ట్రేట్ ఇంజెక్షన్, అలూమియం హైడ్రాక్సైడ్, క్లోట్రిమొజోల్,    డోగోక్సిన్ ట్యాబ్‌లెట్స్, డెరిపైలిన్ ట్యాబ్‌లెట్స్, ఫ్యూరోక్సిన్ సిరప్, ఇబ్రూఫిన్ ట్యాబ్‌లెట్స్, మిథేల్ ఎర్గొమెట్రిన్ ఇంజక్షన్, నియోమైసిన్ క్రీం, పారాసిట్మాల్ మొదలైన మందులు అసలు లేనే లేవు. దీంతో జిల్లాల్లోరోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
బడ్జెట్‌లో కేటాయించిన విధంగా అవసరమైన మేరకు మందులు కొనాలని నిర్ణయించాం. ఆ ప్రకారమే జరుగుతోంది. ఫార్మసిస్టులు, కాంట్రాక్టర్లు, సరఫరాదారుల కుమ్మక్కుపై ఫిర్యాదులు అందలేదు. దీనిపై పరిశీలించి తగు చర్యలు చేపడతాం.
 - సురేష్‌చందా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement