ప్రజారోగ్యానికి ‘త్రీడీ’ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) మొదలు రాష్ట్రస్థాయిలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వరకు అన్ని ఆసుపత్రుల్లోనూ ప్రజారోగ్యమే ప్రధానంగా ముందుకు వెళ్లాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన డయాగ్నస్టిక్ (వైద్య పరీక్షలు), డ్రగ్స్ (మందులు), డాక్టర్లు (వైద్యులు).. ఈ మూడింటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించింది. ఈ మూడింటి మొదటి అక్షరాలు ఇంగ్లిషు అక్షర మాలలో ‘డి’తో ఉన్నందున ‘త్రీడీ’ వ్యవస్థగా నామకరణం చేశారు.
కొత్త సంవత్సరంలో ప్రభుత్వం త్రీడీపై దృష్టి కేంద్రీకరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ పరిస్థితి...
రాష్ట్రంలో సుమారు 740 పీహెచ్‌సీలు ఉన్నాయి. మరో 5 వేల వరకు ఉప కేంద్రాలు ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాలు 115, ఏరియా ఆసుపత్రులు 42, జిల్లా ఆసుపత్రులు 10, బోధనాసుపత్రులు 18, మెటర్నిటీ ఆసుపత్రులు 5 ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ప్రజారోగ్యం సక్రమంగా లేదు. అన్ని చోట్లా వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు.. పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నది సర్కారు అంచనా.
ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో రోజుకు 2 వేల మందికిపైగా రోగులు ఓపీలో చికిత్స పొందుతుంటారు. రోజూ 250 మంది వరకు ఆసుపత్రిలో చేరుతుంటారు. ప్రతీ రోజూ 200 వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. అయితే ఆపరేషన్ కోసం వారాల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉంది. ఇక ఎంఆర్‌ఐ, సిటీస్కాన్, అల్ట్రాసౌండ్ తదితర రోగ నిర్ధారణ పరీక్షల కోసమైతే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఇలా కింది నుంచి పై స్థాయి ఆసుపత్రి వరకూ దారుణమైన పరిస్థితి ఉంది. ఇక మందుల కొరత సరేసరి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏవీ పూర్తిస్థాయిలో దొరకడంలేదు. ఇదిలావుంటే పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు వైద్యులుండాల్సి ఉండగా... ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. నిమ్స్‌లో 172 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే నర్సింగ్ పోస్టులు 158 వరకు ఖాళీ ఉన్నాయి. మరో 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌లో 385 వైద్యులు, 429 నర్సింగ్, 765 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉున్నాయి. ప్రజారోగ్యంలో 298 వైద్యులు, నర్సింగ్‌లో 205, పారామెడికల్ విభాగంలో 765 ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అందుకే త్రీడీ వ్యవస్థ...
వైద్య పరీక్షలు, మందులు, డాక్టర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేం దుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇక వైద్య పరీక్షలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఔట్‌సోర్సింగ్ వ్యవస్థకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నుంచి నిధులు వస్తాయి.
ప్రతీ పరీక్షకు కొంత చొప్పున ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఇస్తుంది. రోగులకు ఉచితంగా అన్ని పరీక్షలు చేస్తారు. ఇక సాధారణ మందులు, అత్యవసర మందులకూ ఎన్‌హెచ్‌ఎం నిధులు కేటాయిస్తుంది. ఆ ప్రకారం మందులను అందుబాటులో ఉంచుతారు. మరోవైపు వైద్య సిబ్బంది కొరత తీర్చేందుకు ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో ప్రయత్నం మొదలైంది.
ఇలా త్రీడీ వ్యవస్థను మెరుగుపరిచి వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయనున్నారు. ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.