Gandhi hospitals
-
గాంధీ ఆస్పత్రికి కోవిడ్ బాధితుల క్యూ
Covid Patients At Gandhi Hospital: గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్ బాధితులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. ఇన్‌పేషెంట్ వార్డుల్లో సుమారు 70 నుంచి 80 మంది మాత్రమే ఉండగా, తాజాగా ఈ సంఖ్య 111కు చేరింది. ఫలితంగా మెయిన్ బిల్డింగ్‌లోని సెకండ్ ఫ్లోర్ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిలో మరో ఎనిమిది మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు కూడా ఉన్నారు. తగ్గినట్లే తగ్గిన ఇన్‌పేషంట్ల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లోనూ ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వంద మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా ఒమిక్రాన్ బాధితులే. చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.. -
ఒమిక్రాన్ గుట్టు ‘గాంధీ’లో తేలుస్తారు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): ప్రపంచ దేశాలను వణికిసున్న ఒమిక్రాన్ వైరస్‌పై గాంధీ వైద్య నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. వైద్య పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్ (ద్రావకాలు) అందిన వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించి ఒమిక్రాన్ గుట్టు విప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి మైక్రోబయోలజీ విభాగంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బాధితుని నుంచి సేకరించిన నమూనాలను రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ (ఆర్టీ పీసీఆర్) టెస్ట్ చేసిన తర్వాత వైరస్ కణ నిర్మాణానికి సంబం ధించి ఆర్ఎన్ఏ, డీఎన్ఏలతో పాటు యమినో యాసిడ్స్ సీక్వెన్స్‌ను పరిశీలిస్తారు. కణ నిర్మాణంలో హెచ్చుతగ్గులు, అదనపు కణాల నిర్మాణం, వాటి సంఖ్య ఆధారంగా రూపాంతరం (మ్యుటేషన్ ) జరిగిన తీరుతెన్నులతో పాటు రూపాంతరం చెందిన వైరస్ మరింత బలపడి విజృంభిస్తుందా లేక బలహీనంగా మారిందా అనేది నిర్ధారిస్తారు. ప్రారంభదినాల్లో పుణేకి పంపి... గాంధీ మైక్రోబయోలజీ విభాగం ఆధ్వర్యంలో జీనో మ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టామని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. రీ ఏజెంట్స్ టెండరు ప్రక్రియ ముగిసిందని, సంబంధిత ద్రావకాలు అందిన వెంటనే మైక్రోబయోలజీ ల్యాబ్ ఇన్చార్జి ప్రొఫెసర్ నాగమణి నేతృత్వంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు ప్రారంభి స్తామని తెలిపారు. ప్రారంభదినాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలను తుది పరిశీలన కోసం పుణెలోని సెంట్రల్ ల్యాబ్ కు పంపించి నిర్ధారించుకుంటామని, పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన తర్వాత నివేదికలను నేరుగా వెల్లడిస్తామని వివరించారు. ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్తలు పాటించండి కరోనా వైరస్ ముప్పు తొలగిపోలేదని, ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు సూచించారు. రూపాంతరం చెందిన ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో నమోదైన నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని, అర్హులంతా రెండు డోసుల టీకా వేయించుకోవాలని కోరారు. ప్రస్థుతం గాంధీలో 9 బ్లాక్ ఫంగస్, 18 కేసులకు వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. -
Gandhi Hospital: ఆస్పత్రిలో ‘గుండె’ గోస
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలోని క్యాత్‌ల్యాబ్ గత పద్దెనిమిది నెలలుగా మూలనపడింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్డియాలజీ విభాగం ప్రభుత్వ, వైద్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి గురి కావడంతో గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందక హృద్రోగులు విలవిల్లాడుతున్నారు. 2010లో ఏర్పాటు.. ► గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో కార్డియాలజీ విభాగంలో 2010లో క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గాంధీ కార్డియాలజీ ఓపీ, ఐపీ విభాగంలో నిత్యం వందలాది మంది రోగులు సేవలు పొందుతుంటారు. ► గుండె సంబంధ వ్యాధులను నిర్ధారించేందుకు నాలుగైదు దశల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈసీజీ, టుడీఎకో, ట్రెడ్ మిల్ టెస్ట్ (టీఎంటీ) తదితర పరీక్షల్లో కొన్నిరకాల రుగ్మతలు, యాంజియోగ్రాం, పెర్యూటేనియస్ ట్రాన్సుమినల్ కొరునరీ యాంజియోఫ్లాస్ట్రీ (పీటీసీఏ), ప్రోటోన్ పంప్ ఇన్‌హేబిటర్ (పీపీఐ), ట్రెపోనిమా పల్లిడం ఇమ్మోబిలైజేషన్ (టీపీఐ) తదితర అత్యంత కీలకమైన వైద్యపరీక్షలు క్యాత్‌ల్యాబ్‌లోనే నిర్ధారణ అవుతాయి. ► క్యాత్‌ల్యాబ్ నివేదిక ప్రకారమే రోగికి స్టంట్ వేయాలా? శస్త్రచికిత్స నిర్వహించాలా? అనేది నిర్ణయిస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించక క్యాత్‌ల్యాబ్ మెషీన్ పలుమార్లు మొరాయించింది. కాలపరిమితి ముగిసిన క్యాత్‌ల్యాబ్ మెషీన్ మరమ్మతులకుæ లక్షలాది రూపాయల వ్యయమవుతుందని, కొత్తది సమకూర్చుకోవడం మేలని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య యంత్రాలు, పరికరాల కొనుగోలు, నిర్వహణ బాధ్యతల కేటాయింపులను తెలంగాణ వైద్యవిద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చూస్తోంది. గాంధీ ఆస్పత్రిలో నూతనంగా క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చక పోవడం గమనార్హం. ► వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన హరీష్‌రావు స్పందించి నూతన క్యాత్‌క్యాబ్ ఏర్పాటు చేసి నిరుపేద హృద్రోగుల గుండె చప్పుడు ఆగిపోకుండా చూడాలని పలువురు కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించాం గాంధీ ఆస్పత్రిలో క్యాత్‌ల్యాబ్ పని చేయని విషయాన్ని ప్రభుత్వంతో పాటు వైద్య ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించాం. కాలపరిమితి ముగిసిన గాంధీ క్యాత్‌ల్యాబ్ మరమ్మతులకు రూ. 45 లక్షలు, ఏడాది నిర్వహణకు మరో రూ. 30 లక్షలు అవసరం. రూ.75 లక్షలు వ్యయం చేసే బదులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న నూతన క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు. ఈ విషయాలన్ని నివేదిక రూపంలో అందించగా నూతన క్యాత్‌ల్యాబ్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే అందుబాటులోకి తెచ్చి నిరుపేద హృద్రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. – రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
Gandhi hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఈరోజు(బుధవారం) ఉదయం ఏడున్నర గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడో ఫ్లోర్లో ఉన్న.. విద్యుత్ ప్యానెల్ బోర్డు రూమ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో ఆరో ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. కేవలం 40 నిమిషాలలోనే మంటలను అదుపులోకి తీసుకోచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాదం తెలిసిన వెంటనే గాంధీ ఆసుపత్రి సూపరింటెండేంట్ రాజరావు ప్రమాదం జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. సాక్షి టీవీతో గాంధీ సూపరింటెండెంట్ రాజారావు: ఉదయం గాంధీ ఆస్పత్రి ఎలక్ట్రికల్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అన్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. కోవిడ్ సమయంలో కొంత మంది సిబ్బందికి ప్రమాదం జరగ్గానే స్పందించాల్సిన తీరుపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఆసుపత్రిలో ఫైర్‌సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయని అన్నారు. కరోనా పాండమిక్ సమయంలో ఫైర్ సేఫ్టీ పరికరాలన్ని ఇక్కడ అమర్చినట్లు తెలిపారు. నార్త్ బ్లాక్‌లో ప్రస్తుతం పెషేంట్లు లేరని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను పక్క వార్డులోకి షిఫ్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
Gandhi Hospital: అత్యాచారం కేసు.. పురోగతి సాధించిన పోలీసులు
సాక్షి, హైదారబాద్: సంచలనంగా మారిన గాంధీ ఆసుపత్రి అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్త్ జోన్ పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. 10 అంతస్తుల గాంధీ ఆస్పత్రిలోని 379 గదులతో పాటు డ్రైనేజితో మొదలుకొని అన్ని చోట్ల ఏదీ వదలకుండా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్‌లో గాంధీ ఆస్పత్రి సీసీ పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు... బాధితురాలు ఈ నెల 12న గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తిరిగిన దృశ్యాలు కనిపించాయి. చిరిగిన దుస్తులతో నీరసంగా కనిపించడంతో ఆస్పత్రి చుట్టుపక్కల నిర్మానుష్య ప్రాంతాల్ని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. -
Gandhi Hospital: గాంధీలో ‘ఫంగస్’ సర్జరీలు
సాక్షి, నెట్వర్క్/ హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు బ్లాక్ ఫంగస్ బాధితులకు చేపట్టిన శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 123 మంది బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో రోజూ 10 బ్లాక్‌ఫంగస్ సర్జరీలు చేసేందుకు మౌలిక వసతులు సమకూరినట్లు సర్జరీ కమిటీ చైర్మన్, ఈఎన్టీ హెచ్ఓడీ ప్రొఫెసర్ శోభన్‌బాబు పేర్కొన్నారు. బ్లాక్‌ఫంగస్ అంటువ్యాధి కాదని, స్టెరాయిడ్స్ ఎక్కువ వినియోగించినవారికి, మధుమేహ బాధితులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. బాధితులందరికీ సర్జరీలు అవసరం లేదని మందులతో నయం కాకుంటే సర్జరీ చేస్తామని వివరించారు. శస్త్రచికిత్సలు చేసిన ఐదుగురిలో ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను తొలగించామని, ఫంగస్ వ్యాప్తి నిలిచిపోయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ఆయా కృత్రిమ భాగాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులు రాష్ట్రంలో రోజురోజుకూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బ్లాక్ ఫంగస్ నోడల్ ఆస్పత్రి అయిన హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి సోమవారం ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలతో దాదాపు 358 మంది వచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు 31 మందినే చేర్చుకున్నారు. మిగతా వారికి ఆస్పత్రి ఆవరణే దిక్కయింది. ఈ ఆస్పత్రిలో 230 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఇప్పటికే 218 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. పదుల సంఖ్యలో మాత్రమే డిశ్చార్జి అవుతుండటం.. కేసులు మాత్రం వందల సంఖ్యల్లో వస్తుండటం ఈఎన్టీ వైద్యులకు తలనొప్పిగా మారింది. ప్రతి జిల్లాలో ఒక బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అయిలాపూర్ రోడ్డులో ఉండే 45 ఏళ్ల మహిళకు బ్లాక్‌ఫంగస్ నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడి, తగ్గాక కళ్లు ఎర్రబడి, వాపు రావడంతో స్థానిక వైద్యులను సంప్రదించగా, హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, బ్లాక్ ఫంగస్ అని తేలగా, చికిత్స అందిస్తున్నారు. కాగా, నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన బోడ వెంకటేశ్వర్లుకు కరోనా సోకి కోలుకున్న తర్వాత తీవ్ర జ్వరం వచి్చంది. దీంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, బ్లాక్‌ఫంగస్ సోకినట్లు నిర్ధారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి.. బ్లాక్ ఫంగస్ సోకడంతో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన వసంత్‌కుమార్ (42) మృతి చెందాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. నిర్మల్ జిల్లా భైంసాలోని రాహుల్‌నగర్‌లో నివాసముంటున్న గజ్జన్బాయి (63) బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందింది. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోగా, నయం కాదని చెప్పడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లగా, సోమవారం మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన తూలగుంట్ల సులోచన (57) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో బాధపడుతూ సోమవారం మృతి చెందింది. -
దిగొస్తున్న కరోనా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మంగళవారం మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రేటర్లో ఇప్పటి వరకు 562 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 150 మంది వరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 18 మందిమృతి చెందారు. ప్రస్తుతం 406 పాజిటివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నిలోఫర్ నవజాత శిశువుల కేంద్రంలో ఓ స్టాఫ్ నర్సు సహా మరో నవజాత శిశువుకు కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్య సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఆస్పత్రి ఐసో లేషన్‌లో 50 మంది పిల్లలు ఉన్నట్లు తెలిసింది. జ్వరం, జలుబు, దగ్గు, నిమోనియాతో బాధపడుతున్న పిల్లల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన నర్సుకు క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న మరో పది మందిని క్వారంటైన్లో ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం గాంధీలో 610 మంది ఉన్నారు. వీరిలో 90 మంది 14 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు పాజిటివ్ బాధితులు ఉండగా, మరో ఐదుగురు అనుమానితులు ఉన్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రి ఐసోలేషన్‌లో పది మంది ఉన్నట్లు తెలిసింది. యునానీ, ఆయుర్వేద, సరోజినీదేవి, టిమ్స్, నేచర్‌క్యూర్ ఆస్పత్రి ఐసోలేషన్ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి. 102 వాహన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ వివరాలు సేకరిస్తున్న అధికారులు మల్కాజిగిరి: మల్కాజిగిరి డివిజన్లో రెండు రోజుల్లోనే మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. హుజూరాబాద్‌కు చెందిన యువకుడు (25) భార్య, కొడుకుతో కలిసి రాంబ్రహ్మనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. జీవీకే 102 వాహన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5 నుంచి సెలవులో ఉన్న యువకుడు 14వ తేదీ నుంచి విధులకు హాజరవుతున్నాడు. ఆదివారం జ్వరం, దగ్గు ఉండటంతో సోమవారం ఉదయం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించి గాంధీకి తరలించారు. ఈ సంఘటనతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. సర్కిల్ డీసీ దశరథ్, ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి, జిల్లా వైద్యాధికారి వీరాంజనేయులు, ప్రాథమిక వైద్యాధికారి రెడ్డికుమారిలు యువకుడి ఇంటి పరిసరాలను పరిశీలించారు. అద్దె భవనంలో యువకుడు ఉండటంతో ఇంటిలో నివాసముంటున్న ఇతరులందరికీ హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తూ (హ్యాండ్ స్టాంప్) వేసి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సుమారు 15 రోజులు విధుల్లో ఉన్న ఆ యువకుడు ఎవరెవరితో కాంట్రాక్ట్ అయ్యాడు.. తన వాహనంలో ఎవరిని తరలించారో వివరాలు సేకరిస్తున్నారు. కరోనాతో వృద్ధురాలి మృతి యాకుత్‌పురా: కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మొఘల్‌పురా బోలీషా బాబా దర్గా ప్రాంతానికి చెందిన వృద్ధురాలు (70) కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ నెల 25న చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మృతి చెందింది. మలక్‌పేట్ గంజ్‌లో కొత్త కంటైన్మెంట్ జోన్ చాదర్‌ఘాట్: మలక్‌పేట గంజ్‌లోని దినేశ్ ట్రేడర్స్ సోదరులిద్దరికీ కరోనా పాజిటివ్ రావటంతో ఆ ఏరియాను కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. పాత అల్వాల్‌లో కేన్సర్ బాధితుడికి.. అల్వాల్: అల్వాల్ సర్కిల్ పరిధిలో మరో కరోనా వైరస్ పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. సర్కిల్ పరిధిలోని పాత అల్వాల్ ఈస్ట్ భవానీనగర్ కాలనీ సమీపంలో నివసించే కేన్సర్ బాధితుడికి మంగళవారం కోవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని భార్య, కొడుకు, కోడల్ని గాంధీకి తరలించారు. ఇంటి వద్దే సంబంధిత వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. కుషాయిగూడలో వృద్ధుడికి.. కుషాయిగూడ: చర్లపల్లి డివిజన్ పరిధిలోని వీఎన్‌రెడ్డినగర్ కాలనీలో నివసించే ఓ వృద్ధుడి(65)కి మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. హార్ట్ సర్జరీ అయిన ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ కోసం కింగ్ కోఠి ఆస్పత్రికి తరచు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్తతకు గురైన వృద్ధుడికి పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వృద్ధుడికి సంబంధించిన 10 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. వీఎన్‌రెడ్డినగర్ కాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. -
గాంధీ ఆస్పత్రి కరోనా వార్డులో
-
కరోనా అలర్ట్: ‘ఆ ఫ్లోర్‌కు ఇతరులు వెళ్లొద్దు’
-
కరోనా అలర్ట్: ‘ఆ ఫ్లోర్‌కు ఇతరులు వెళ్లొద్దు’
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆస్పత్రిలో శనివారం పర్యటించారు. కరోనా వార్డు (ఏడో ఫ్లోర్)లో పలు మార్పులు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏడో ఫ్లోర్‌కు కరోనా (కోవిడ్-19) బాధితులు తప్ప ఇతరులెవరూ వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. దాంతోపాటు విదేశాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరూ 14 రోజులు కరోనా వార్డులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వార్డును రెండు విభాగాలుగా చేయాలని, విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉంటే ఒకచోట.. కరోనా లక్షణాలు లేకపోతే మరో వార్డులో ఉంచాలని మంత్రి ఈటల స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో ఏడో ఫ్లోర్లో వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చారు. (చదవండి: రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు : సీఎం కేసీఆర్) (ఆస్పత్రి నుంచి పారిపోయిన పేషెంట్) -
శాంపిళ్ల సేకరణలో అవగాహనలేమి!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వందలాది మంది కరోనా బారినపడి మృత్యువాత పడుతున్నారు. దీంతో కరోనా పేరు వింటేనే జనం హడలిపోతున్నారు. అలాంటి భయంకరమైన వైరస్ నిర్ధారణలో ఏ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల గాంధీలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన నమూనాలను సరైన పరిమాణంలో సేకరించకపోవడంతో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇద్దరు చైనీయుల నుంచి నమూనాలు తీసుకున్నా.. సరైన పరిమాణంలో తీసుకోకపోవడంతో పాజిటివ్ లక్షణాలు కనిపించాయన్న ప్రచారం జరిగింది. దీంతో రెండోసారి పరీక్షలు చేసి కరోనా పాజిటివ్ లేదంటూ తాజాగా ప్రకటించారు. దీంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. నమూనాల సేకరణపై నిర్లక్ష్యమేల? గాంధీ ఆసుపత్రిలో ఇటీవలే కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. అందుకోసం కేంద్రం కరోనా కిట్లను పం పింది. అంతకు ముందు నమూనాలను పుణేకు పంపి నిర్ధారణ చేసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో మొదటి ట్రయల్ రన్లో, తర్వాత చేసిన నిర్ధారణ పరీక్షల్లో అంతా సవ్యంగానే జరిగింది. అయితే రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఇద్దరు చైనీయులు ఫీవర్ ఆసుపత్రికి వచ్చారు. వారి నుంచి నమూనాలను సేకరించి గాంధీ ఆసుపత్రికి పంపించారు. కరోనా పరీక్షకు పెద్దలకు గొంతు నుంచి, పిల్లలకు ముక్కు నుంచి నమూనాలను సేకరిస్తారు. దూది ద్వారా గొంతు లోపలి నుంచి ఈ నమూనాలు తీస్తారు. ఇదే కరోనా నిర్ధారణ పరీక్షకు అత్యంత కీలకమైనది. రక్త నమూనాలను కూడా తీస్తారు. ఎందుకంటే ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేదాని కోసం సేకరిస్తారు. అయితే ఇద్దరు చైనీయుల గొంతులోంచి తీసిన నమూనాలను పూర్తి పరిమా ణంలో తీయలేదు. వాటినే గాంధీ ఆసుపత్రికి పంపారు. అక్కడ కూడా వాటితోనే పరీక్షలు చేశారు. వాటి ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయని కొందరు ప్రచారం చేశారు. కొందరేమో ఎలాంటి ఫలితాలు రాలేదని, అస్పష్టంగా రిపోర్టు వచ్చిందని చెబుతున్నారు. ఇలా అధికారులు తలోమాట చెప్పడం, కొందరు వైద్యాధికారులు బయటకు వివరాలు వెల్లడించడంతో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. రిపోర్టు వివరాలు అస్పష్టంగా ఉన్నాయని, రెండోసారి సక్రమంగా నమూనాలను సేకరించారు. వాటి ఫలితాల్లో నెగిటివ్ రావడం గమనార్హం. ఇది టెక్నీషియన్ల వైఫల్యమా? వైద్యాధికారుల వైఫల్య మా? అనేదానిపై ఇప్పుడు అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. నమూనాల సేకరణపై వారికి శిక్షణ ఇచ్చారా లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. పైగా కరోనాపై పాజిటివ్ వస్తే కేంద్రమే అధికారికంగా ప్రకటించాలి. కానీ చైనీయులకు పాజిటివ్ వచ్చిందంటూ కొందరు కీలకమైన వైద్యాధికారులే ప్రచారం మొదలుపెట్టడంలో ఉద్దేశమేంటో అంతుబట్టట్లేదు. కరోనా పని మాకు అప్పగించకండి.. కరోనా అనుమానిత కేసులను గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందు కోసం వాటన్నింటిలో మొత్తం 100 పడకలను సిద్ధం చేసింది. పైగా కరోనా నిర్ధారణ పరీక్షలను గాంధీలోనే నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీలకు సంబంధించిన పరీక్షలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్ల పరిశీలన కోసం ఇటీవల కేంద్ర బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. ఆ సందర్భంగా గాంధీ ఆసుపత్రికి చెందిన కొందరు అధికారులు కరోనాకు సంబంధించి బాధ్యత తమకు వద్దని, తాము చేయలేమని చేతులెత్తేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బాధితులకు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో కనీస వసతులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో బాధితులు అక్కడ ఉండలేమంటూ వెళ్లిపోతున్నారు. ఓపీకి ‘కరోనా’ఫీవర్.. కరోనా దెబ్బకు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గాంధీ, నల్లకుంట ఫీవర్ సహా ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసిన విషయం తెలి సిందే. చైనా, సమీప దేశాల నుంచి వచ్చిన వారిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు పంపుతున్నారు. కరోనా అనుమానితులను గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకే తీసుకొస్తుండటంతో ఎక్కడ తమకు వైరస్ సోకుతుందోనని ఇతర రోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇన్‌పేషంట్లుగా చేరిన రోగులు కూడా భయంతో ఆస్పత్రిని వదిలి పోతున్నారు. ఎయిర్‌పోర్టులో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టు వైద్యాధికారుల బృందం కొద్దిరోజులుగా సింగపూర్, మలేసియా, థాయిలాండ్, హాంగ్‌కాంగ్ నుంచి వస్తున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌లైన్స్‌లు కూడా ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులను ఎక్కడి నుంచి తమ ప్రయాణం ప్రారంభించారో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నాయి. రోజూ 800 మందికి పైగా ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నేరుగా విమానాల రాకపోకల్లేవు. హాంగ్‌కాంగ్ రోజూ ఒక విమానం రాకపోకలు సాగిస్తుంటుంది. సింగపూర్ నుంచి 5, కౌలాంలంపూర్ నుంచి 4, బ్యాంకాక్ నుంచి ఒక విమానం ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయి. -
నగరంలో ఇద్దరికి కరోనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోకి కరోనా వైరస్ ప్రవేశించిందా..? హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసే ఇద్దరు చైనీయులకు కరోనా లక్షణాలున్నాయా అంటే..? గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి చూస్తుంటే ఔననే అం టున్నాయి అక్కడి వర్గాలు. కానీ అధికారి కంగా ధ్రువీకరించడంలేదు. దేశంలో ఇప్పటి వరకు కేరళలో ముగ్గురికి కరోనా వైరస్ సోకగా, ఇప్పుడు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు చైనీయులకు లక్ష ణాలు ఉన్నాయన్న ప్రచా రంతో ఒక్కసారిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉలిక్కిపడింది. అయితే గాంధీ ఆస్పత్రిలో అధికారులు మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి పాజిటివ్ కేసులు లేవంటూనే, శుక్రవారం ఆ చైనీయు లను వైద్య పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాదు కరోనా అనుమానితులు ఎవరైనా వస్తే వారిని ఒకే ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ఒకే చోట చికిత్స చేస్తుంటారు. కానీ ఈ ఇద్దరు చైనీయులను మాత్రం రెండు ప్రత్యేక గదుల్లో విడివిడిగా చికిత్స చేస్తుండటం కరోనా ప్రవేశించిందనే వాదనలకు బలం చేకూరుస్తోంది. అంతేకాదు వారికి ఒకసారి వైద్య పరీక్ష చేయగా, పాజిటివ్ లక్షణాలు, అనుమానాలు రావడంతో రెండోసారి పరీక్షలకు పంపించారు. ఫలితాలు శుక్రవారం వచ్చాక ప్రకటిస్తామని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అన్నీ నిర్ధారించుకున్నాకే ప్రకటిస్తారని అంటున్నారు. గత నెల 31న చైనా నుంచి రాక... ఆ ఇద్దరు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 31న వారు చైనాలోని షాంఘై నగరం నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. కరోనా వైరస్ చైనాలో విజృంభించిన నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వైరస్ లేదని నివేదిక తీసుకొస్తేనే విధుల్లో చేర్చుకుంటామని వారు పనిచేసే సాఫ్ట్వేర్ కార్యాలయ వర్గాలు ఆదేశించాయి. దీంతో ఆ ఇద్దరు చైనీయులు బుధవారం ఫీవర్ ఆస్పత్రికి వెళ్లి అవసరమైన శాంపిళ్లను ఇచ్చారు. అయితే వారు ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి అందిన నివేదికలో ఇరువురికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్లు ప్రాథమికంగా వైద్యులు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన చైనీయుల కోసం ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వైలెన్స్ ప్రోగ్రాం (ఐడీఎస్పీ) అధికారులకు సమాచారం అందించారు. ఐడీఎస్పీ అధికారి సదరు చైనీయులు ఉంటున్న అడ్రస్‌లకు వెళ్లి వారిని గురువారం ఉదయం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేసి మరోమారు రక్త నమూనాలు సేకరించి గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో నిర్ధారణ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో వీరికి కరోనా పాజిటివ్ వచ్చినా తక్షణమే ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన నివేదికతోపాటు మరోమారు రక్తనమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబోరేటరీకి పంపాల్సి ఉంటుందంటున్నారు. అక్కడ కూడా కరోనా పాజిటివ్ అని తేలితే ల్యాబ్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తారు. అప్పుడు మాత్రమే తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటిస్తుందని వైద్యాధికారులు అంటున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు ఎటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ స్పష్టంచేశారు. నిర్ధారణ పరీక్ష నివేదికలు వచ్చాక ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. మీడియా సంయమనం పాటించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. గాంధీతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి వచ్చిన 20 రక్త నమూనాలకు గురువారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అర్ధరాత్రి దాటిన తర్వాత నివేదిక వెలువడే అవకాశం ఉందని మరో అధికారి తెలిపారు. అయితే గత నెలలో చైనా నుంచి వచ్చిన ఈ ఇద్దరు ఈ వారం రోజులపాటు హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ తిరిగారోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. పెరుగుతున్న అనుమానిత కేసులు.. కరోనా అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతోంది. చైనా దాని సమీప దేశాల నుంచి వచ్చిన వారు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే కరోనా నోడల్ కేంద్రాలకు చేరుకుని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలా ఇప్పటికే 37 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరందరికీ నెగిటివ్ రావడంతో ఆయా బాధితులందరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గురువారం గాంధీలో మరో 11 మంది.. ఫీవర్ ఆస్పత్రిలో 9 మంది చొప్పున కొత్తగా 20 మంది అనుమానితులు చేరారు. చైనా నుంచి ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు (తల్లి (37), తండ్రి (52), ముగ్గురు కుమారులు 20, 19, 17)తో పాటు షాంఘై నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు (35, 29), హాంకాంగ్ నుంచి వచ్చిన మరో ఇద్దరు అనుమానితులు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వీరి నుంచి నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. బాధితుల రిపోర్ట్లు ఇంకా రావాల్సి ఉంది. ఇటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని కరోనా నోడల్ కేంద్రానికి గురువారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు సహా మరో ముగ్గురు యువకులు (మహిళలు (25), (31), పురుషులు (25), (30), (33)) నిర్ధారణ పరీక్షలకు వచ్చారు. వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ఇటీవల చైనా నుంచి వచ్చిన బడంగ్‌పేటకు చెందిన యువతి (27)తో పాటు టోలిచౌకికి చెందిన మరో ఇద్దరి నుంచి నమూనాలు సేకరించారు. అనుమానిత బాధితుల్లో బంజారాహిల్స్‌కు చెందిన వారు ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరించడంతో వారి నుంచి నమూనాలు సేకరించి, హోమ్ ఐసోలేషన్‌కు పంపినట్లు తెలిసింది. ఇక ఎల్బీనగర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆరు నెలల్లోపు శిశువుకు కరోనా లక్షణాలున్నాయంటూ ఆ ఆసుపత్రి యాజమాన్యం గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసింది. అయితే దీనిపై గాంధీ ఆస్పత్రి వర్గాలు మండిపడటంతో సంబంధిత యాజమాన్యం ఆ శిశువును డిశ్చార్జి చేసినట్లు తెలిసింది. సీఎస్ సమీక్ష.. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కంట్రోల్ రూంకు వచ్చిన కాల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమందికి ఇప్పటివరకు వైద్య పరీక్షలు చేశారో కూడా తెలుసుకున్నారు. కరోనా వైరస్ రాకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాల్లోనూ కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. -
కరోనా వైరస్‌పై తెలంగాణ హై అలర్ట్..!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న పల్మోనాలజిస్ట్‌లు అందరూ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో కరోనా వైరస్ అనుమానితులు వస్తే చికిత్స చేయడం కోసం ఏర్పాట్లు చేసినట్లు సూచించారు. రేపటి నుంచి గాంధీ మెడికల్ కాలేజ్‌లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు 30 మందికి కరోనా వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఒక్కొక్క పరీక్షకు 10 గంటల సమయం పడుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా పాజిటివ్‌గా నమోదు కాలేదన్నారు. (భారత్‌లో రెండో కరోనా కేసు..!) ఈ సందర్భంగా చైనా నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఈటల రాజేందర్ కోరారు. ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్స అందించేందుకు అన్నివసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. మాస్క్‌లు, సానిటైజర్లు అదేవిధంగా సరిపోయేంత మంది సిబ్బందిని సిద్ధం చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను అమలుచేస్తున్నామని తెలిపారు. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ప్రజలు ఎంత మాత్రం భయపడొద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. (జీజీహెచ్‌లో కరోనా కలకలం) -
ప్రజారోగ్యానికి ‘త్రీడీ’ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు రాష్ట్రస్థాయిలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వరకు అన్ని ఆసుపత్రుల్లోనూ ప్రజారోగ్యమే ప్రధానంగా ముందుకు వెళ్లాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన డయాగ్నస్టిక్ (వైద్య పరీక్షలు), డ్రగ్స్ (మందులు), డాక్టర్లు (వైద్యులు).. ఈ మూడింటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించింది. ఈ మూడింటి మొదటి అక్షరాలు ఇంగ్లిషు అక్షర మాలలో ‘డి’తో ఉన్నందున ‘త్రీడీ’ వ్యవస్థగా నామకరణం చేశారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం త్రీడీపై దృష్టి కేంద్రీకరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ పరిస్థితి... రాష్ట్రంలో సుమారు 740 పీహెచ్‌సీలు ఉన్నాయి. మరో 5 వేల వరకు ఉప కేంద్రాలు ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాలు 115, ఏరియా ఆసుపత్రులు 42, జిల్లా ఆసుపత్రులు 10, బోధనాసుపత్రులు 18, మెటర్నిటీ ఆసుపత్రులు 5 ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ప్రజారోగ్యం సక్రమంగా లేదు. అన్ని చోట్లా వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు.. పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నది సర్కారు అంచనా. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో రోజుకు 2 వేల మందికిపైగా రోగులు ఓపీలో చికిత్స పొందుతుంటారు. రోజూ 250 మంది వరకు ఆసుపత్రిలో చేరుతుంటారు. ప్రతీ రోజూ 200 వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. అయితే ఆపరేషన్ కోసం వారాల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉంది. ఇక ఎంఆర్ఐ, సిటీస్కాన్, అల్ట్రాసౌండ్ తదితర రోగ నిర్ధారణ పరీక్షల కోసమైతే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఇలా కింది నుంచి పై స్థాయి ఆసుపత్రి వరకూ దారుణమైన పరిస్థితి ఉంది. ఇక మందుల కొరత సరేసరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏవీ పూర్తిస్థాయిలో దొరకడంలేదు. ఇదిలావుంటే పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు వైద్యులుండాల్సి ఉండగా... ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. నిమ్స్‌లో 172 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే నర్సింగ్ పోస్టులు 158 వరకు ఖాళీ ఉన్నాయి. మరో 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌లో 385 వైద్యులు, 429 నర్సింగ్, 765 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉున్నాయి. ప్రజారోగ్యంలో 298 వైద్యులు, నర్సింగ్‌లో 205, పారామెడికల్ విభాగంలో 765 ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకే త్రీడీ వ్యవస్థ... వైద్య పరీక్షలు, మందులు, డాక్టర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేం దుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇక వైద్య పరీక్షలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఔట్సోర్సింగ్ వ్యవస్థకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నుంచి నిధులు వస్తాయి. ప్రతీ పరీక్షకు కొంత చొప్పున ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఇస్తుంది. రోగులకు ఉచితంగా అన్ని పరీక్షలు చేస్తారు. ఇక సాధారణ మందులు, అత్యవసర మందులకూ ఎన్హెచ్ఎం నిధులు కేటాయిస్తుంది. ఆ ప్రకారం మందులను అందుబాటులో ఉంచుతారు. మరోవైపు వైద్య సిబ్బంది కొరత తీర్చేందుకు ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో ప్రయత్నం మొదలైంది. ఇలా త్రీడీ వ్యవస్థను మెరుగుపరిచి వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయనున్నారు. ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
రోగులకు ‘పరీక్ష’!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు.. పేదోడికి పెద్దరోగం వస్తే ఆదుకొనే వైద్యాలయాలు. కానీ, ఇప్పుడు వాటికే పెద్ద జబ్బు చేసింది. నిపుణులైన డాక్టర్లు ఉన్నా.. సుశిక్షుతులైన సిబ్బంది ఉన్నా.. సరైన సదుపాయాలు లేక విలవిలలాడుతున్నాయి. నిరుపేద నిండుప్రాణాలు తన ప్రాంగణంలోనే పోతున్నా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నాయి. తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రుల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపగా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లమైంది. ఎంఆర్ఐ, సీటీస్కాన్, వెంటిలేటర్స్, ఈసీజీ, టూడీఎకో, డయాలసిస్, కలర్‌డాప్లర్, ఎక్స్‌రే, ఎండోస్కోపి, కొలనోస్కోపి మిషన్లు ఈ రెండు ఆసుపత్రుల్లో తగినన్ని లేవు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. గాంధీలో ఎంఆర్ఐ కోసం ఇప్పటికే 250 మందికిపైగా ఎదురు చూస్తుంటే, ఉస్మానియాలో 180 మందికిపైగా నిరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల కోసం 15 నుంచి 30 రోజులు వేచి ఉండాల్సివస్తోంది. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే స్తోమత లేక సర్కారు ఆసుపత్రిల్లోనే రోజులు వెళ్లదీస్తున్న రోగులు చివరకు రోగం ముదిరి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. గాంధీలో రోజూ 250 మంది వెయిటింగ్ గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 200 నుంచి 300 రోగులు వస్తుండగా, వీరిలో చాలా మందికి ఎంఆర్ఐ, సీటీ స్కాన్ అవసరం. ఒక్కో సీటీ స్కాన్‌కు 20 నిమిషాలు పడుతుంది. ఇలా గంటకు ముగ్గురి చొప్పున రోజుకు సగటున 30 నుంచి 35 మందికి మాత్రమే టెస్టులు చేయగలరు. కానీ రోగుల సంఖ్య రోజు వందల్లో ఉండడంతో ఇక్కడి సిబ్బంది ప్రతిరోజు 50కిపైగా సీటీ, ఎంఆర్ఐ టెస్టులు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రస్తుతం 250 మందికిపైగా రోగులు ఇక్కడ తమ రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎక్స్‌రే తీయించుకుంటే మరుసటి ఉదయం 11 గంటలకు గానీ ఈ ఆసుపత్రిలో రిపోర్టులు రోగుల చేతికి అందవు. ఇక పనిభారం ఎక్కువగా ఉండడం వల్ల యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. రేడియాలజీ విభాగానికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు(ఏఎంసీ) లేకపోవడం వల్ల రిపేరు చేయడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. రక్తప్రసరణ తీరును గుర్తించే కలర్‌డాప్లర్ టెస్ట్‌కు రెండు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక నెఫ్రాలజీ విభాగంలో ఐదు డయాలసిస్ యంత్రాలు ఉంటే కేవలం మూడే పనిచేస్తున్నాయి. అదనంగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సమకూర్చాల్సిందిగా ఆస్పత్రి యాజమాన్యం డీఎంఈకి లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందనే లేదు. ఉస్మానియాలో ఇలా... ఉస్మానియా ఆసుపత్రికి రోజూ రెండు వేలకుపైగా రోగులు వస్తుంటారు. ఇక్కడి క్యాజువాల్టీలో వెంటిలేటరే లేదు. ఇక ఏఎంసీ వార్డులో ఒకే వెంటిలేటర్ పని చేస్తుంది. రికార్డుల్లో 40కిపైగా వెంటిలేటర్లు ఉన్నా పనిచేస్తున్నవి మాత్రం 25కి మించి లేవు. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఒకే ఒక్క ఎంఆర్ఐ మిషన్ ఉంది. దీంతో పరీక్ష చేయాలంటే ఒక్కో రోగికి సగటున 30 నిమిషాలు పడుతోంది. దీంతో ఇక్కడ పేరు నమోదు చేయించుకున్న రోగులకు 12 రోజుల తర్వాతే టెస్టుల కోసం సమయం ఇస్తున్నారు. ప్రస్తుతం 180 మంది ఇక్కడ వెయింటింగ్ లిస్టులో ఉన్నారు. సీటీస్కాన్దీ అదే పరిస్థితి. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ మిషన్ల కాలపరిమితి ముగియడంతో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. నెబులైజర్స్ లేక ఆస్తమా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. రోగుల గుండెను రీయాక్టివ్ చేయడానికి ఉపయోగించే డి ప్రీవిలేటరూ అందుబాటులో లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని పరికరాలు సమకూర్చాలని ఆస్పత్రి అధికారులు ఏడాది క్రితం ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదు. ఇక్కడ డిజిటల్ ఎక్స్‌రే సర్వీసులు అందుబాటులో ఉన్నా సాధారణ ప్రింట్లనే చేతికిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఎక్స్‌రే తీయించుకుంటే సాయంత్రం ఐదు గంటలకు రిపోర్టు చేతికందుతుంది.