సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వందలాది మంది కరోనా బారినపడి మృత్యువాత పడుతున్నారు. దీంతో కరోనా పేరు వింటేనే జనం హడలిపోతున్నారు. అలాంటి భయంకరమైన వైరస్ నిర్ధారణలో ఏ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల గాంధీలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన నమూనాలను సరైన పరిమాణంలో సేకరించకపోవడంతో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇద్దరు చైనీయుల నుంచి నమూనాలు తీసుకున్నా.. సరైన పరిమాణంలో తీసుకోకపోవడంతో పాజిటివ్ లక్షణాలు కనిపించాయన్న ప్రచారం జరిగింది. దీంతో రెండోసారి పరీక్షలు చేసి కరోనా పాజిటివ్ లేదంటూ తాజాగా ప్రకటించారు. దీంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.
నమూనాల సేకరణపై నిర్లక్ష్యమేల?
గాంధీ ఆసుపత్రిలో ఇటీవలే కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. అందుకోసం కేంద్రం కరోనా కిట్లను పం పింది. అంతకు ముందు నమూనాలను పుణేకు పంపి నిర్ధారణ చేసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో మొదటి ట్రయల్ రన్‌లో, తర్వాత చేసిన నిర్ధారణ పరీక్షల్లో అంతా సవ్యంగానే జరిగింది. అయితే రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఇద్దరు చైనీయులు ఫీవర్ ఆసుపత్రికి వచ్చారు. వారి నుంచి నమూనాలను సేకరించి గాంధీ ఆసుపత్రికి పంపించారు. కరోనా పరీక్షకు పెద్దలకు గొంతు నుంచి, పిల్లలకు ముక్కు నుంచి నమూనాలను సేకరిస్తారు. దూది ద్వారా గొంతు లోపలి నుంచి ఈ నమూనాలు తీస్తారు. ఇదే కరోనా నిర్ధారణ పరీక్షకు అత్యంత కీలకమైనది. రక్త నమూనాలను కూడా తీస్తారు. ఎందుకంటే ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేదాని కోసం సేకరిస్తారు. అయితే ఇద్దరు చైనీయుల గొంతులోంచి తీసిన నమూనాలను పూర్తి పరిమా ణంలో తీయలేదు. వాటినే గాంధీ ఆసుపత్రికి పంపారు. అక్కడ కూడా వాటితోనే పరీక్షలు చేశారు. వాటి ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయని కొందరు ప్రచారం చేశారు. కొందరేమో ఎలాంటి ఫలితాలు రాలేదని, అస్పష్టంగా రిపోర్టు వచ్చిందని చెబుతున్నారు. ఇలా అధికారులు తలోమాట చెప్పడం, కొందరు వైద్యాధికారులు బయటకు వివరాలు వెల్లడించడంతో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. రిపోర్టు వివరాలు అస్పష్టంగా ఉన్నాయని, రెండోసారి సక్రమంగా నమూనాలను సేకరించారు. వాటి ఫలితాల్లో నెగిటివ్ రావడం గమనార్హం. ఇది టెక్నీషియన్ల వైఫల్యమా? వైద్యాధికారుల వైఫల్య మా? అనేదానిపై ఇప్పుడు అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. నమూనాల సేకరణపై వారికి శిక్షణ ఇచ్చారా లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. పైగా కరోనాపై పాజిటివ్ వస్తే కేంద్రమే అధికారికంగా ప్రకటించాలి. కానీ చైనీయులకు పాజిటివ్ వచ్చిందంటూ కొందరు కీలకమైన వైద్యాధికారులే ప్రచారం మొదలుపెట్టడంలో ఉద్దేశమేంటో అంతుబట్టట్లేదు.
కరోనా పని మాకు అప్పగించకండి..
కరోనా అనుమానిత కేసులను గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందు కోసం వాటన్నింటిలో మొత్తం 100 పడకలను సిద్ధం చేసింది. పైగా కరోనా నిర్ధారణ పరీక్షలను గాంధీలోనే నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీలకు సంబంధించిన పరీక్షలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్ల పరిశీలన కోసం ఇటీవల కేంద్ర బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. ఆ సందర్భంగా గాంధీ ఆసుపత్రికి చెందిన కొందరు అధికారులు కరోనాకు సంబంధించి బాధ్యత తమకు వద్దని, తాము చేయలేమని చేతులెత్తేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బాధితులకు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో కనీస వసతులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో బాధితులు అక్కడ ఉండలేమంటూ వెళ్లిపోతున్నారు.
ఓపీకి ‘కరోనా’ఫీవర్..
కరోనా దెబ్బకు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గాంధీ, నల్లకుంట ఫీవర్ సహా ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసిన విషయం తెలి సిందే. చైనా, సమీప దేశాల నుంచి వచ్చిన వారిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు పంపుతున్నారు. కరోనా అనుమానితులను గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకే తీసుకొస్తుండటంతో ఎక్కడ తమకు వైరస్ సోకుతుందోనని ఇతర రోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇన్‌పేషంట్లుగా చేరిన రోగులు కూడా భయంతో ఆస్పత్రిని వదిలి పోతున్నారు.
ఎయిర్‌పోర్టులో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టు వైద్యాధికారుల బృందం కొద్దిరోజులుగా సింగపూర్, మలేసియా, థాయిలాండ్, హాంగ్‌కాంగ్ నుంచి వస్తున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌లైన్స్‌లు కూడా ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులను ఎక్కడి నుంచి తమ ప్రయాణం ప్రారంభించారో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నాయి. రోజూ 800 మందికి పైగా ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నేరుగా విమానాల రాకపోకల్లేవు. హాంగ్‌కాంగ్ రోజూ ఒక విమానం రాకపోకలు సాగిస్తుంటుంది. సింగపూర్ నుంచి 5, కౌలాంలంపూర్ నుంచి 4, బ్యాంకాక్ నుంచి ఒక విమానం ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment