మరో ఇద్దరికి పాజిటివ్‌? | Two More People Were Recently Diagnosed With COVID 19 Virus In Hyderabad | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరికి పాజిటివ్‌?

Published Thu, Mar 5 2020 1:32 AM | Last Updated on Thu, Mar 5 2020 9:27 AM

Two More People Were Recently Diagnosed With COVID 19 Virus In Hyderabad - Sakshi

రాష్ట్రంలో కోవిడ్‌ కల్లోలం కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో మరో ఇద్దరికి ఈ వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ ఇద్దరూ మహిళలే. అపోలో ఆస్పత్రిలో పనిచేసే హౌస్‌ కీపింగ్‌ వర్కర్‌తోపాటు ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన టెకీకి పాజిటివ్‌ అని తేలింది. అయితే, ఈ విషయంలో మరింత స్పష్టత కోసం వారి నమూనాలను పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో 47 మంది అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా.. 45 మందికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. కోవిడ్‌ సోకిందనే అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించిన నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డిపల్లి వాసి బాలరాజ్‌కు కూడా వైరస్‌ సోకలేదని వెల్లడైంది. బుధవారం మరో 36 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నారు.

రాష్ట్రంలో తొలి కోవిడ్‌ కేసు బాధితుడు, మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఇక కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. వైరస్‌ అనుమానం ఉన్న వ్యక్తులు కార్పొరేట్‌ ఆస్పత్రులతోపాటు మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉండే హాస్పటల్స్‌లో చికిత్స చేయించుకోవచ్చని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కోవిడ్‌ కలకలం సృష్టించింది. ఏపీలోని ఐదు జిల్లాల్లో పదిమందికి ఈ లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 29 మందికి ఈ మహమ్మారి సోకినట్టు తేలింది. కోవిడ్‌పై ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) రంగంలోకి దిగింది. ఇది ఎలా వ్యాపిస్తుంది? దీని లక్షణాలు ఏమిటి? ఈ వైరస్‌ను నియంత్రించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంచేసింది.  

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో 47 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా, వీరిలో 45 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు అనుమానిత బాధితులకు పాజిటివ్‌ వచ్చినట్లు తేలిందని వెల్లడించింది. మరింత స్పష్టత కోసం వారి నుంచి రెండోసారి నమూనాలు సేకరించి, పరీక్ష కోసం పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. కాగా, బుధవారం మరో 36 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. 

ఇటీవలే ఇటలీ వెళ్లొచ్చి.. 
తాజాగా కోవిడ్‌ సోకిన వారిలో ఒకరు అపోలో ఆస్పత్రికి చెందిన హౌస్‌ కీపింగ్‌ వర్కర్‌(మహిళ 40) కాగా, మరొకరు ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని (32)ఉన్నారు. ఇటలీ నుంచి వచ్చిన టెకీ గత నెల 28న కొంపెల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ హోటల్లో బస చేసి, ఆ తర్వాత మరో హోటల్‌కు మారినట్లు తెలిసింది. ఆమెకు పాజిటివ్‌ రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై, ఆమె పర్యటించిన ప్రాంతాలను, కలిసిన వ్యక్తులను కనిపెట్టే పనిలో పడ్డారు. 

క్యూ కడుతున్న టెకీలు.. 
ఇటలీ వెళ్లివచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీలో పని చేస్తున్న టెకీలు గాంధీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఐసోలేషన్‌ వార్డులో 24 మంది అనుమానితులు చేరినట్లు తెలిసింది. గాంధీ ఐసోలేషన్‌ వార్డుల్లో 27 పడకలు మాత్రమే అందుబాటులో ఉండటంతో చెకప్‌ కోసం వస్తున్న ఇంకొందరిని ఫీవర్, చెస్ట్‌ ఆస్పత్రులకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. కాగా, తమ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలియడంతో మైండ్‌ స్పెస్‌లోని డీఎస్‌ఎం సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఆ కార్యాలయ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసేలా (వర్క్‌ ఫ్రం హోమ్‌) వెసులుబాటు కల్పించింది.  

గాంధీకి తగ్గిన ఓపీ.. 
ఓపీ విభాగానికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజూ 3 వేల వరకు వచ్చే ఓపీ రోగులు వచ్చేవారు. కానీ బుధవారం మాత్రం 1,236 మందే వచ్చారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.  

నిలకడగా సాఫ్ట్‌వేర్‌ ఆరోగ్యం 
ప్రస్తుతం కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయి గత రెండు రోజుల నుంచి గాంధీ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న మహేంద్రహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ (24) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. జ్వరం తగ్గిందని, ఊపిరితిత్తులు, గుండె ఇతర శరీర భాగాలు సక్రమంగా పనిచేస్తున్నాయని వివరించారు. కాగా, బాధితుడి తల్లిదండ్రులతో పాటు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి పరీక్షలు నిర్వహించగా, కోవిడ్‌ లేదని నిర్ధారణ కావడంతో బుధవారం వారిని గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే వారు ఇళ్లకు చేరుకోగా, కాలనీవాసులు అభ్యంతరం చెప్పారు. వైరస్‌ పూర్తిగా నియం త్రణ కాకుండా అనుమానితులను అప్పుడే జనావాసాలకు ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో మాస్క్‌లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఎన్‌–95 మాస్క్‌లు అందుబాటులో లేవని మెడికల్‌ షాపుల యజమానులు చెబుతున్నారు.

ఫీవర్‌లో మరో రెండు.. 
నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో బుధవారం మరో రెండు అనుమానిత కోవిడ్‌ వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఎర్రగడ్డకు చెందిన ఓ యువకుడు(28), మియాపూర్‌కు చెందిన మరో వ్యక్తి(33) ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వీరు ఫీవర్‌ ఆసుపత్రికి వచ్చారు. వీరిద్దరినీ ఐసోలేషన్‌ వార్డులో చేర్చుకుని పర్యవేక్షించారు. వారి నుంచి సేకరించిన నమూనాలను కోవిడ్‌ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపారు. కాగా, షాహినాత్‌నగర్‌కు చెందిన ఓ వైద్యుడు (53) ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారు. కోవిడ్‌ అనుమానంతో బుధవారం ఫీవర్‌ ఆసుపత్రికి వచ్చారు. అయితే పరీక్షల కోసం ఐసోలేషన్‌ వార్డులో చేరాలని వైద్యులు సూచించగా, చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి ఆ వైద్యుడు వెళ్లిపోయారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.

గాంధీ ఆస్పత్రిలో మాస్కులు ధరించి విధులకు హాజరవుతున్న జూనియర్‌ డాక్టర్లు

కోవిడ్‌.. డబ్ల్యూహెచ్‌ఓ ‘గైడ్‌’
ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ‘కోవిడ్‌–19’పైనే చర్చ.. వైరస్‌ ఇలా వ్యాపిస్తుందని.. అలా సోకుతుందని.. ఫలానా జాగ్రత్తలు తీసుకోవాలని బయట వినిపిస్తున్న సలహా సూచనలెన్నో.. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మాత్రం ఇలాంటివి నమ్మొద్దని చెబుతోంది. వైరస్‌ వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై స్పష్టమైన వివరణ ఇచ్చింది.

గాలి ద్వారా సోకుతుందా?
సోకదు. వ్యాధి సోకిన వారి శ్వాస లేదా తుమ్ము కారణంగా వెలువడే చిన్న నీటి కణాల ద్వారా మాత్రమే కోవిడ్‌ ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. మలమూత్రాదుల ద్వారా ఇతరులకు సోకే అవకాశాలు తక్కువ. కోవిడ్‌ మలంలోనూ ఉన్నట్లు ప్రాథమిక పరిశీలనలు చెబుతున్నా ఈ మార్గంలో ఇతరులకు వ్యాపించడం ప్రస్తుత విస్తృతికి ప్రధాన కారణం కాదు.

ఉపరితలంపై వైరస్‌ జీవితకాలం ఎంత?
కొన్ని గంటల నుంచి రోజులపాటు బతికి ఉండవచ్చునని ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ రకమైన ఉపరితలం?, ఉష్ణోగ్రత, గాల్లో తేమశాతం, వాతావరణం వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.

చేతుల శుభ్రం ఎందుకు?
సోప్, ద్రవం, శానిటైజర్‌ వంటి వాటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చేతి ఉపరితలంపై వైరస్‌ ఉంటే నశించిపోతుంది.

జలుబు, దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండాలా?
దగ్గు, తుమ్ములతో బాధపడుతున్న వారికి కనీసం మూడడుగుల దూరంలో ఉండాలి. దగ్గు లేదా తుమ్ముల ద్వారా నోరు, ముక్కు నుంచి బయటకొచ్చే అతిసూక్ష్మ ద్రవకణాల్లో వైరస్‌ ఉండొచ్చు. దగ్గరగా ఉంటే ఆ ద్రవాలను పక్కనున్న వారూ పీల్చే అవకాశాలు ఎక్కువ.

కళ్లు, ముక్కు, నోరు ముట్టరాదా?
వైరస్‌ ఉన్న ఉపరితలాన్ని ముట్టుకున్న చేతులతో ఇతర శరీర భాగాలను ముట్టుకుంటే మనకూ వైరస్‌ సోకే అవకాశం ఉంటుంది.

తుమ్ములొస్తే ఏం చేయాలి?
తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా అరచేతులతో కాకుండా, మోచేతిని ముఖానికి అడ్డుగా పెట్టుకోవాలి. లేదంటే టిష్యూ పేపర్‌ను ఉపయోగించి, వెంటనే దాన్ని చెత్తబుట్టలో పడేయాలి. ఇలా చేయడం వల్ల కోవిడ్‌–19 నుంచే కాదు.. సాధారణ జలుబు నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

మందు, వైద్యం ఉన్నాయా?
ప్రస్తుతానికి లేవు. యాంటీ వైరల్‌ మందులు కూడా అభివృద్ధి చేయలేదు. అయితే కోవిడ్‌ బాధితులకు ఉన్న రోగ లక్షణాలను తగ్గించేందుకు కొన్ని మందులు వాడతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ మరణాల రేటు 3.4% మాత్రమే. అంటే వంద మందికి వ్యాధి సోకితే 97 మంది చికిత్సతో స్వస్థత పొందుతారు. కోవిడ్‌ కు విరుగుడుగా కొన్ని వ్యాక్సిన్లను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు.

మాస్క్‌లు అందరికీ అక్కర్లేదు..

  • దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధ సమస్యలు లేనివారికి మాస్కులతో పనిలేదు. కోవిడ్‌–19 లక్షణాలు (జ్వరం, దగ్గు) ఉన్న వారే మాస్కులు తొడుక్కోవాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తోంది. కోవిడ్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది మాత్రం మాస్కులు తప్పనిసరిగా వాడాలి. తద్వారా నిజంగా అవసరమున్న వారికి మాస్కులు అందుబాటులో ఉంటాయని చెబుతోంది.
  • సోపు, శానిటైజర్‌లతో చేతుల్ని శుభ్రం చేసుకున్నాకే మాస్కులు ముట్టుకోవాలి.
  • లోహపు పట్టీ ఉన్న భాగం ముక్కు వద్ద ఉండాలి. ముక్కు, నోరు పూర్తిగా కప్పి ఉండేలా చూడాలి.
  • వాడేశాక మాస్క్‌ ఉపరితలాన్ని తాకకుండానే చెత్తబుట్టలో వేయాలి. చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే ఇతర పనులు చేపట్టాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

  • కోవిడ్‌–19 లక్షణాలు బయటపడేందుకు ఒకటి నుంచి 14 రోజులు పడుతుంది. శరీరంలోకి వైరస్‌ ప్రవేశించాక ఐదు రోజులకల్లా లక్షణాలు కనిపిస్తాయి.
  • ధూమపానాన్ని మానేయాలి. నాటువైద్యం జోలికి వెళ్లొద్దు.
  • ఒకటికి రెండు మాస్కులు ధరిస్తే రక్షణ లభిస్తుందనుకోవడం సరికాదు. సొంత వైద్యం, యాంటీబయాటిక్‌లు వద్దు.
  • అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండిపోవాలి. జ్వరం, దగ్గు లేదా ఊపిరిపీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వైద్య సహాయం తీసుకోవాలి.
  • అంతర్జాతీయంగా కోవిడ్‌ సమాచారం ఎప్పటికప్పుడు వైద్యవ్యవస్థకు అందుబాటులో ఉంటుంది కాబట్టి.. ప్రభుత్వ వైద్యుల సలహా సూచనలు పాటించడం మేలు. కోవిడ్‌కు ఎక్కడ చికిత్స అందిస్తున్నారో కూడా ప్రభుత్వ వైద్యులకే తెలిసి ఉంటుంది.

యాంటీబయాటిక్స్‌తో తగ్గుతుందా?
కోవిడ్‌–19.. వైరస్‌ కారణంగా వచ్చే జబ్బు. కాబట్టి యాంటీబయాటిక్‌లు పనిచేయవు. వ్యాధి నివారణకు, చికిత్సకు యాంటీబయాటిక్‌లు వాడటం వల్ల ప్రయోజనం లేదు. – డబ్ల్యూహెచ్‌ఓ

భయమేల! పరిశుభ్రతతో పారదోలుదాం...
కోవిడ్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌. ఈ పేరు వింటేనే జనం గజగజా వణికిపోతున్నారు. కోవిడ్‌ లక్షణాలు కనిపించిన వ్యక్తిని విలన్‌లా చూస్తున్నారు. తమకు ఎక్కడ సోకుతుందో అని బెంబేలెత్తుతున్నారు. అయితే, ఈ వైరస్‌ని చూసి అస్సలు  భయపడాల్సిన అవసరమే లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో వైరస్‌లు మానవాళిని ఇబ్బంది పెట్టాయని.. ఇంతకంటే శక్తివంతమైన మహమ్మారులనే ఎదుర్కొన్న చరిత్ర మనకు ఉందనే విషయాన్ని మరచిపోవద్దని గుర్తు చేస్తున్నారు.సార్స్, మెర్స్‌ వంటి వైరస్‌లతో పోలిస్తే కోవిడ్‌ వల్ల సంభవించే మరణాల రేటు చాలా తక్కువని పేర్కొంటున్నారు. అందువల్లకోవిడ్‌ను చూసి భయపడకుండా ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. 

  • నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే  సంభవించిన మరణాల సంఖ్య చాలా తక్కువ  
  • సార్స్‌ మరణాల రేటు 9.5 శాతం,మెర్స్‌ మరణాల రేటు 34 శాతంఉండగా.. కోవిడ్‌ మరణాల రేటు 3.4 శాతం
  • రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 80 ఏళ్ల పైబడినవారిపైనే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది
  • వ్యాధి నిరోధక శక్తిఎక్కువగా ఉండే పిల్లల్లో కోవిడ్‌ ప్రభావంఅత్యంత స్వల్పం 
  • మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈమహమ్మారిని సమర్థంగా దుర్కొంటుందనడానికి ఇదే నిదర్శనం 
  • వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటిస్తూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని తరిమేయడం చాలా సులభం

ఫేస్‌ మాస్కులతో పరీక్షలకు రావొచ్చు  
ఇంటర్‌ వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు ఫేస్‌ మాస్కులతో పరీక్షలకు హాజరుకావొచ్చు. వాటర్‌ బాటిల్స్‌ కూడా తెచ్చుకోవచ్చు. విద్యాశాఖ ఈ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షా కేంద్రం గేటు తెరిచే వరకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో గూమికూడతారని, అలా జరగకుండా ముందే గేట్లు తెరిచి విద్యార్థులను వారికి కేటాయించిన స్థానాల్లో వెళ్లి కూర్చునేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది. పరీక్షలు ప్రారంభం కావడానికి ముందు పరీక్షా కేంద్రం గదుల్లోని అన్ని బల్లలు, కుర్చీలు, తలుపులు, స్విచ్‌ బోర్డు లను ‘ఇన్‌ఫెక్షన్ల నివారిణి మందు’లో ముంచిన తడిగుడ్డతో శుభ్రపరచాలని సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement