సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో మంగళవారం మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రేటర్‌లో ఇప్పటి వరకు 562 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 150 మంది వరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 18 మందిమృతి చెందారు. ప్రస్తుతం 406 పాజిటివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నిలోఫర్ నవజాత శిశువుల కేంద్రంలో ఓ స్టాఫ్ నర్సు సహా మరో నవజాత శిశువుకు కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్య సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఆస్పత్రి ఐసో లేషన్‌లో 50 మంది పిల్లలు ఉన్నట్లు తెలిసింది. జ్వరం, జలుబు, దగ్గు, నిమోనియాతో బాధపడుతున్న పిల్లల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన నర్సుకు క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న మరో పది మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం గాంధీలో 610 మంది ఉన్నారు. వీరిలో 90 మంది 14 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు పాజిటివ్ బాధితులు ఉండగా, మరో ఐదుగురు అనుమానితులు ఉన్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రి ఐసోలేషన్‌లో పది మంది ఉన్నట్లు తెలిసింది. యునానీ, ఆయుర్వేద, సరోజినీదేవి, టిమ్స్, నేచర్‌క్యూర్ ఆస్పత్రి ఐసోలేషన్ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి.
102 వాహన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ వివరాలు సేకరిస్తున్న అధికారులు
మల్కాజిగిరి: మల్కాజిగిరి డివిజన్‌లో రెండు రోజుల్లోనే మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. హుజూరాబాద్‌కు చెందిన యువకుడు (25) భార్య, కొడుకుతో కలిసి రాంబ్రహ్మనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. జీవీకే 102 వాహన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5 నుంచి సెలవులో ఉన్న యువకుడు 14వ తేదీ నుంచి విధులకు హాజరవుతున్నాడు. ఆదివారం జ్వరం, దగ్గు ఉండటంతో సోమవారం ఉదయం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించి గాంధీకి తరలించారు. ఈ సంఘటనతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. సర్కిల్ డీసీ దశరథ్, ఏసీపీ శివకుమార్, ఇన్‌స్పెక్టర్ నర్సింహస్వామి, జిల్లా వైద్యాధికారి వీరాంజనేయులు, ప్రాథమిక వైద్యాధికారి రెడ్డికుమారిలు యువకుడి ఇంటి పరిసరాలను పరిశీలించారు. అద్దె భవనంలో యువకుడు ఉండటంతో ఇంటిలో నివాసముంటున్న ఇతరులందరికీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తూ (హ్యాండ్ స్టాంప్) వేసి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సుమారు 15 రోజులు విధుల్లో ఉన్న ఆ యువకుడు ఎవరెవరితో కాంట్రాక్ట్ అయ్యాడు.. తన వాహనంలో ఎవరిని తరలించారో వివరాలు సేకరిస్తున్నారు.
కరోనాతో వృద్ధురాలి మృతి
యాకుత్‌పురా: కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మొఘల్‌పురా బోలీషా బాబా దర్గా ప్రాంతానికి చెందిన వృద్ధురాలు (70) కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ నెల 25న చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మృతి చెందింది.
మలక్‌పేట్ గంజ్‌లో కొత్త కంటైన్మెంట్ జోన్
చాదర్‌ఘాట్: మలక్‌పేట గంజ్‌లోని దినేశ్ ట్రేడర్స్ సోదరులిద్దరికీ కరోనా పాజిటివ్ రావటంతో ఆ ఏరియాను కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు.
పాత అల్వాల్‌లో కేన్సర్ బాధితుడికి..
అల్వాల్: అల్వాల్ సర్కిల్ పరిధిలో మరో కరోనా వైరస్ పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. సర్కిల్ పరిధిలోని పాత అల్వాల్ ఈస్ట్ భవానీనగర్ కాలనీ సమీపంలో నివసించే కేన్సర్ బాధితుడికి మంగళవారం కోవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని భార్య, కొడుకు, కోడల్ని గాంధీకి తరలించారు. ఇంటి వద్దే సంబంధిత వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు.
కుషాయిగూడలో వృద్ధుడికి..
కుషాయిగూడ: చర్లపల్లి డివిజన్ పరిధిలోని వీఎన్‌రెడ్డినగర్ కాలనీలో నివసించే ఓ వృద్ధుడి(65)కి మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. హార్ట్ సర్జరీ అయిన ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ కోసం కింగ్ కోఠి ఆస్పత్రికి తరచు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్తతకు గురైన వృద్ధుడికి పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వృద్ధుడికి సంబంధించిన 10 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. వీఎన్‌రెడ్డినగర్ కాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment