
సాక్షి, హైదారబాద్: సంచలనంగా మారిన గాంధీ ఆసుపత్రి అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్త్ జోన్ పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.
10 అంతస్తుల గాంధీ ఆస్పత్రిలోని 379 గదులతో పాటు డ్రైనేజితో మొదలుకొని అన్ని చోట్ల ఏదీ వదలకుండా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్‌లో గాంధీ ఆస్పత్రి సీసీ పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు... బాధితురాలు ఈ నెల 12న గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తిరిగిన దృశ్యాలు కనిపించాయి. చిరిగిన దుస్తులతో నీరసంగా కనిపించడంతో ఆస్పత్రి చుట్టుపక్కల నిర్మానుష్య ప్రాంతాల్ని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు.