మెడికల్‌షాపుల బంద్ విజయవంతం
మెడికల్‌షాపుల బంద్ విజయవంతం
Published Tue, May 30 2017 10:44 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
–జిల్లా వ్యాప్తంగా మూతపడిన దుకాణాలు
–మందులు లభించక ఇబ్బంది పడ్డ రోగులు
–కర్నూలులో డ్రగ్ డీలర్స్ బైక్ ర్యాలీ
–మద్దతుగా మెడికల్‌రెప్స్ ధర్నా
కర్నూలు(హాస్పిటల్): ఆన్‌లైన్‌లో ఔషధాల(మందులు) విక్రయాలకు నిరసనగా మంగళవారం జిల్లాలో నిర్వహించిన మెడికల్‌షాపుల బంద్ విజయవంతమైంది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే చాలా చోట్ల మందుల దుకాణాలు మూతపడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు బంద్ కొనసాగించాలని సంఘం నాయకులు నిర్ణయించారు. అయితే కార్పొరేట్ మెడికల్‌షాపులు సాయంత్రం 5 గంటల వరకే మూసి ఉంచుతామని చెప్పడంతో, అర్ధరాత్రి 12 గంటల వరకు బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి మెడికల్‌షాపులు తెరుచుకోవడం ప్రారంభించాయి. బంద్ కారణంగా ఉదయం రోగులు మందులు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మంగళవారం ఓపీ అధికంగా ఉంటుంది. అన్ని రకాల మందులు ఆసుపత్రిలో ఇవ్వరు, ఆసుపత్రిలోని జీవనధార మెడికల్‌షాపులోనూ లభించవు. ఈ మేరకు ఆసుపత్రి ఎదురుగా ఉన్న మందుల దుకాణాల్లో రోగులు కొనాల్సిందే. బంద్ నేపథ్యంలో రోగులు అత్యవసర మందుల కోసం ఇబ్బంది పడ్డారు. ఆయా మందుల దుకాణాల వద్ద పలువురి సూచన మేరకు ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు, ఆసుపత్రుల్లో తెరిచి ఉన్న మెడికల్‌షాపులకు వెళ్లి మందులు తెచ్చుకున్నారు.
డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ బైక్ ర్యాలీ
ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను ఆపాలని కోరుతూ మంగళవారం కర్నూలు నగరంలో సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమిస్ట్‌లు, డ్రగ్గిస్ట్‌లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు వారు ర్యాలీ నిర్వహిస్తూనే బంద్‌ను పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిషేధించాలని, ఈ మేరకు కఠిన చట్టాలు తీసుకురావాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రామకృష్ణారావు, కార్యదర్శి వై. పుల్లయ్య, కోశాధికారి మధుసూదన్‌రావు, సభ్యులు లోకేష్, బలరామ్, శ్రీధర్, రవి, శ్రీరామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
బంద్‌కు మద్దతుగా మెడికల్‌రెప్స్ ధర్నా
ఔషధ విక్రయదారులు చేపట్టిన దేశవ్యాప్త మెడికల్‌షాపుల బంద్‌కు మద్దతుగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్‌రెప్స్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వెంకట్ మాట్లాడుతూ ఆన్‌లైన్ ద్వారా ఔషధ విక్రయాలు జరపడంతో నిషేధిత మందులపై నియంత్రణ లేకుండా పోతుందన్నారు. జిల్లా అధ్యక్షుడు పెద్దస్వామి, జిల్లా కార్యదర్శి షేక్షావలి మాట్లాడుతూ 967 రకాల మందులపై జీఎస్‌టీ పేరుతో మూడు రకాల పన్ను స్లాబ్‌లను తీసివేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మెయిన్, రవీంద్రారెడ్డి, శివగంగ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement