వినుకొండ మండలం బొల్లాపల్లికి చెందిన నరసింహారావు కాలులో మేకు గుచ్చుకుంది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ను ఆశ్రయిస్తే యమికాసిన్ అనే యాంటిబయోటిక్ ఇంజక్షన్ చేశారు. దీంతో ఒళ్లంతా వాపు రావడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు చేరాడు. అధిక మోతాదులో యాంటిబయోటిక్ వాడడం వల్ల కిడ్నీ పాడైనట్లుగా వైద్యులు గుర్తించారు.
క్రోసూరు మండలానికి చెందిన సామ్రాజ్యం అనే మహిళ 20 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లింది. ఆయన లివర్ ఫ్లాక్స్, డైక్లోఫినాక్ ఇంజక్షన్లు రెండు కలిపి ఇవ్వడంతో రెండు రోజులకే లివర్, కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో బంధువులు గుంటూరు ఆసుపత్రిలో చేర్పించారు.
సాక్షి, గుంటూరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆర్‌ఎంపీలే వైద్యులే దిక్కవుతున్నారు. కొందరు ఆర్‌ఎంపీలకు కనీస అవగాహన లేకపోవడంతో ఇష్టానుసారంగా యాంటిబయోటిక్‌లు ఉపయోగిస్తున్నారు. చిన్న జబ్బుకు కూడా అధిక మోతాదులో యాంటిబయోటిక్స్ వాడుతూ లేనిపోని రోగాలు తీసుకొస్తున్నారు. జబ్బు రావడానికి కారణం ఏమిటి? వీరికి బీపీ, షుగర్ వంటి ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా? అనే విషయాన్ని సైతం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా యాంబయోటిక్‌లు వాడడంతో కిడ్నీ, లివర్‌లు దెబ్బతింటున్నాయి. ప్రాంతమైన వినుకొండ, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వంటి నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వీరు చిన్న జ్వరం వచ్చినా, పొలం పనులు చేసి వచ్చి ఒళ్లు నొప్పులని చెప్పినా జంటామైసిన్, యమికాసిన్, డైక్లోఫినాల్, లివర్ ఫ్లాక్స్ వంటి యాంబయోటిక్స్‌ను వాడుతున్నారు. బీపీ, షుగర్ ఉన్నవారికి అధిక డోసులో యాంటిబయోటిక్‌లు వాడకూడదని తెలిసినప్పటికీ అవేమీ పట్టించుకోవడం లేదు.
ప్రిస్కిప్షన్ లేకుండానే..
వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా యాంటిబయోటిక్‌లు అమ్ముతున్నారు. పల్లెల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఔషధ నియంత్రణ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వైద్యులు, మెడికల్ దుకాణదారుల ఇష్టారాజ్యమైపోయింది. జిల్లాలో వినియోగించే మందుల్లో సుమారుగా 50 శాతం యాంటిబయోటిక్‌లే ఉన్నట్లు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి వాడకం ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని వెల్లడిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరో 12 శాతం అధికంగా యాంటిబయోటిక్‌ల వియోగం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఆర్‌ఎంపీ, పీఎంపీల అసోసియేషన్‌లో 3 వేల మంది ఆర్‌ఎంపీలు రిజిస్ట్రేషన్‌లు చేయించుకోగా, వీరిలో సుమారు 2 వేల మంది ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక శిక్షణను పొందారు. ఇదిలా ఉంటే అసోసియేషన్‌లో ఎటువంటి రిజిస్ట్రేషన్‌గానీ, శిక్షణగానీ పొందని వారు జిల్లా వ్యాప్తంగా 1500 మంది ఉన్నట్లు ఆర్‌ఎంపీ, పీఎంపీల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అచ్చిరెడ్డి తెలిపారు. ఇలాంటి వారు చేస్తున్న తప్పు వల్ల మిగిలిన వారికీ చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యాంటిబయోటిక్‌అమ్మకాలపై దృష్టి సారిస్తాం
జిల్లాలో యాంటిబయోటిక్‌ల వినియోగం పెరిగిన మాట వాస్తవమే. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటిబయోటిక్‌ల అమ్మకాలు చేయకూడదని మెడికల్ షాపులకు స్పష్టమైన ఆదేశాలి అయినా కొందరు అమ్ముతూనే ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. యాంటిబయోటిక్‌ల అమ్మకాలపై ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయించాం. – విజయకుమార్, ఔషధ యంత్రణ, పరిపాలన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment