కిడ్నీలో రాయి తొలగించినప్పటినుంచీ ఆ టైమ్‌లో నొప్పి...?
నాకు కిడ్నీలో రాళ్లు ఉన్నందున లిథోట్రిప్సీ (ఈఎస్‌డబ్ల్యూఎల్) అనే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించారు. అప్నట్నుంచి మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడూ, సెక్స్ చేసేప్పుడూ మంట విపరీతంగా వస్తోంది. చికిత్స తర్వాత కూడా రాళ్లు పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి నా సమస్యలకు తగిన పరిష్కారం సూచించండి.
- వి.ఎస్.ఆర్., నాయుడుపేట
మూత్ర విసర్జన సమయంలో మంట మాత్రమే కాకుండా... సెక్స్ చేసినప్పుడు కూడా ఇలా మంట రావడం అనే సాధారణ లక్షణాలు మూత్రంలో ఇన్ఫెక్షన్‌ను సూచిస్తున్నాయి. కాబట్టి మీరు మొదట యూరిన్ కల్చర్ పరీక్షలు చేయించండి. వాటి ఆధారంగా మీ డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్‌ను పూర్తి కోర్సు వాడండి. దాంతో మీరు చెబుతున్న లక్షణాలు తగ్గిపోతాయి. ఇక మిగిలిపోయిన స్టోన్స్ విషయానికి వస్తే వాటిని లేజర్ చికిత్స ద్వారా తొలగించుకోవచ్చు.
నాకు 38 ఏళ్లు. ఇటీవలే వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పట్నుంచి ఏమాత్రం పనిచేసినా చాలా ఎక్కువగా అలసట వస్తోంది. సెక్స్‌లో కూడా మునుపటిలా కాకుండా కాస్త వీక్‌గా అనిపిస్తోంది. ఇవన్నీ వ్యాసెక్టమీ వల్లనేమో అని అనుమానంగా ఉంది. నా సందేహాలకు సమాధానం చెప్పండి.
- ఎస్.వి.కె.ఎమ్., ఒంగోలు
వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైనది. దానివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలూ రావు. వ్యాసెక్టమీ అంటే... వీర్యకణాలు వచ్చే మార్గాన్ని బ్లాక్ చేయడం మాత్రమే. అంతేతప్ప... ఇక శరీరంలోని ఏ భాగాన్నీ ముట్టుకోరు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు చెప్పిన సమస్యలన్నీ మీ వయసు వారిలో దాదాపు అందరిలోనూ కనిపించేవే. కాకపోతే చాలామంది వాటిని వ్యాసెక్టమీకి ఆపాదిస్తూ, అవన్నీ దానివల్లనే అని అపోహ పడుతుంటారు. నిజానికి వ్యాసెక్టమీకి మీ బలహీనతలకూ ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒకసారి మీ ఫ్యామిలీ ఫిజీషియన్‌ను లేదా మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకుని నిర్భయంగా ఉండండి.
నాకు 29 ఏళ్లు. రెండు నెలల కిందట వివాహమయ్యింది. నా మొదటిరాత్రి పురుషాంగం బాగానే గట్టిపడింది. అయితే అంగప్రవేశం చేస్తున్న సమయంలో టెన్షన్ వల్ల అంగస్తంభన తగ్గింది. దాంతో సెక్స్ చేయాలేకపోయాను. అప్పట్నుంచి సెక్స్ చేయాలంటేనే భయం వేస్తోంది. మళ్లీ నెల రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనాలని ప్రయత్నించినా జంకుతో సెక్స్ చేయలేకపోతున్నాను. ఒకప్పుడు హస్తప్రయోగం బాగా చేసేవాణ్ణి. దాని వల్ల ఇలా జరుగుతోందా? ఇప్పుడు నా భార్య కూడా నాతో సహకరించడం లేదు. నేను సంసారానికి పనికిరానివాడినంటూ ఈసడిస్తోంది. దాంతో ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్తున్నాను. నేను ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- ఎస్.కె.ఎమ్., ఖమ్మం
మీరు యాంగ్జైటీ న్యూరోసిస్‌తో బాధపడుతున్నారు. కొత్తగా పెళ్లయినవారికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం, దాంతో ఆశాభంగం చెందడం చాలా సాధారణంగా జరిగేదే. సెక్స్ అనేది మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు చాలా స్వాభావికంగా జరిగిపోయే ప్రక్రియ. మీలాంటి స్థితి మీ ఒక్కరికేనని ఆందోళన చెందకండి. జంకు వల్ల మీలా బాధపడేవారెందరో ఉంటారు. ఆ పరిస్థితిని భార్య సహాకారంతో అధిగమిస్తే మీరూ అందరిలా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయగలరు. పరిస్థితిని అధిగమించడానికి ప్రస్తుతం మీ భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ చాలా ముఖ్యం. మీరు గతంలో చేసిన హస్తప్రయోగం వల్ల మీకు ఈ సమస్య రాలేదు. మీ భార్యతో సెక్స్ చేయబోయినప్పుడు... పెర్‌ఫార్మెన్స్ యాంగ్జైటీకి లోనవ్వడం వల్ల ఇలా జరిగింది. మీరూ, మీ భార్య డాక్టర్‌ను కలిసి సెక్సువల్ కౌన్సెలింగ్ చేయించుకోండి. మీకు తాత్కాలికంగా కలిగిన అంగస్తంభన లోపాన్ని అధిగమించడానికి యూరాలజిస్ట్‌ను సంప్రదించి మందులు తీసుకోండి. ఈలోపే మీలో ఆత్మవిశ్వాసం పెరిగితే ఎలాంటి మందులూ అవసరం లేకుండానే మీ అంతట మీరే సెక్స్‌లో సమర్థంగా పాల్గొనగలరు.
నాకు 42 ఏళ్లు. పెళ్లరుు పద్దెనిమిదేళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. నాకు సెక్స్ కోరికలు చాలా ఎక్కువ. అయితే నా భార్య సెక్స్ పట్ల ఆసక్తి చూపడం లేదు. బలవంతంగా సెక్స్ చేస్తే యూంత్రికంగా పాల్గొంటోంది. దాంతో నాకు వూనసికంగా సంతృప్తి కలగడం లేదు. ఎప్పుడూ చికాకుగా ఉంటున్నాను. దయచేసి ఈ విషయంలో నాకు తగిన సలహా చెప్పండి.
- సి.వి.ఆర్., చెన్నై
సాధారణంగా పెళ్లయిన పదిహేను ఇరవై ఏళ్ల తర్వాత జీవిత భాగస్వావుుల్లో ఒకరికి సెక్స్‌లో ఆసక్తి తగ్గిపోరుు ఇలా యాంత్రికంగా పాల్గొనడం సాధారణంగా జరిగేదే. దీనికి ప్రధాన కారణం వూనసిక, శారీరక ఒత్తిళ్లు కావచ్చు. ఆమె ఇంట్లో ఏ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్నారో, ఎందుకు అలసిపోతున్నారో గుర్తించండి. ఆ కండిషన్‌ను చక్కదిద్దితే అంతా సర్దుకుపోవచ్చు. ఇక మీరు కూడా మీ వైపు నుంచి కాస్తంత రొమాంటిక్‌గా ఉంటూ ఆమెకు కూడా సెక్స్‌లో ఆసక్తి కలిగేలా ప్రయత్నించవచ్చు. అయితే ఆమెకు ఆసక్తిగా లేనప్పుడు మాత్రం మీరు సెక్స్ కావాల్సిందే అంటూ పట్టుబట్టకండి. మీరే సర్దుకుపోండి. ఇక మీకు వీలైతే ఒకసారి ఇద్దరూ కలిసి దగ్గర్లోని యాండ్రాలజిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి.
డాక్టర్ వి.చంద్రమోహన్
యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్,
కెపిహెచ్‌బి, హైదరాబాద్