వృషణం చిన్నదైపోయింది... ఎందుకిలా? | Urology issues.. solutions | Sakshi
Sakshi News home page

వృషణం చిన్నదైపోయింది... ఎందుకిలా?

Published Thu, Sep 19 2013 11:42 PM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

వృషణం చిన్నదైపోయింది... ఎందుకిలా?

వృషణం చిన్నదైపోయింది... ఎందుకిలా?

 నాకు 25 ఏళ్లు. ఐదేళ్ల కిందట కుడి వృషణంలో అకస్మాత్తుగా నొప్పి వచ్చి, ఆ తరవాత వాచింది. అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాను. ఆ తర్వాత ఆర్నెల్లకు కుడివైపు వృషణం బఠాణీ గింజంత అయిపోయింది. ఎడమవైపు వృషణం మాత్రం మామూలుగానే ఉంది. పెళ్లయిన తర్వాత ఇది దాంపత్య జీవితానికి ఏమైనా అడ్డంకా?
 - ఎస్.ఎస్., యలమంచిలి

 
 మీరు మొదటిసారి నొప్పి వచ్చినప్పుడు డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ పరీక్ష చేయించి ఉంటే అది వృషణంలో ఇన్ఫెక్షనా (ఎపిడైడమో ఆర్కయిటిస్) లేకపోతే వృషణం మడతపడటమా (టెస్టిక్యులార్ టార్షన్) అనే విషయం తెలిసి ఉండేది. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే... మడత పడినప్పుడు ఆరుగంటల్లోపు ఆపరేషన్ చేసి వృషణాన్ని నార్మల్ పొజిషన్‌కి ఉంచితే అది సక్రమంగా పనిచేసేది. అలా చేయకపోతే వృషణానికి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయి తర్వాత చిన్నదైపోతుంది. అప్పుడు వీర్యకణాలను ఉత్పత్తి చేయలేదు. కేవలం సెక్స్ హార్మోన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటివారిలో నొప్పి ఉన్నా, లేకపోయినా రెండో వైపు వృషణాన్ని ఫిక్స్ చేసుకోవడం (ఆర్కిడోపెక్సీ) మంచిది. అప్పుడు రెండోవైపు మడత పడే సమస్య రాదు. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను కలిసి ఆర్కిడోపెక్సీ గురించి వివరాలను తెలుసుకోండి.
 
 మా బాబుకు ఇటీవల కడుపునొప్పిగా ఉందంటే స్కానింగ్ చేయించాం. అందులో ఒక కిడ్నీలో వాపు ఉందని చెప్పారు. దీనివల్ల కిడ్నీకి ప్రమాదమని, సర్జరీ ద్వారా మూత్రవిసర్జన జరిగే దారి వెడల్పు చేయించుకోవాలని, అలా చేయకపోతే కిడ్నీ దెబ్బతినే అవకాశముందని డాక్టర్ చెప్పారు. మాది మేనరిక వివాహం. దాని వల్లనే ఇలాంటి సమస్య వచ్చిందా?         
 - కె.ఎస్.పి.ఆర్., నెల్లూరు

 
 చిన్నపిల్లల్లో కిడ్నీలో వాపునకు చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది మూత్రనాళంలో, రీనల్ పెల్విస్ జంక్షన్‌లో అడ్డంకి ఉండటం. దీన్ని పెల్వి-యూరెటరిక్ జంక్షన్ అబ్‌స్ట్రక్షన్ అంటారు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మూత్రం కిందికి సరిగా వెళ్లక, కిడ్నీలో నిలిచిపోతుంది. ఈ కండిషన్‌ను హైడ్రోనెఫ్రోసిస్ (కిడ్నీ వాపు) అంటారు. ఇలా మూత్రం కిడ్నీలో నిలిచిపోవడం వల్ల కిడ్నీ మీద భారంపడి దాని కండ రోజురోజూ కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. కొద్దిసంవత్సరాల పాటు ఇలాగే కొనసాగుతూ ఉంటే, మూత్రపిండం కాస్తా క్రమేపీ పేపర్‌లాగా అయిపోయి పనిచేయడం మానేస్తుంది.
 
 అందువల్ల కిడ్నీలో వాపు ఉంటే ‘ఐవీపీ’ వంటి పరీక్ష చేయించుకుని, నిజంగానే మూత్ర ప్రవాహానికి ఏదైనా అడ్డుపడుతుంటే పైలోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేయించాలి. దీన్ని ఆపరేషన్ ద్వారా కాకుండా ‘కీ-హోల్’ (లాపరోస్కోపిక్) ప్రక్రియ ద్వారా కూడా చేయవచ్చు.
 
 ఇలాంటి సమస్య మేనరికం కారణంగానే రావాలని లేదు. మీరు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.


 డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement