టంగుటూరు: వ్యాపారుల మాయాజాలంలో ఆక్వా రైతులు నలిగిపోతున్నారు. వ్యాపారులు కూటమికట్టి ధరలను నియంత్రిస్తున్నారు. మండలంలో సుమారు 5 వేల హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నారు. వ్యాపారులు ఏడాదికి ఒకసారి ధరలపై సీలింగ్ పెట్టి రైతులను దోచుకుంటున్నారు.
ఇది ధరల సీజన్: అక్టోబర్, నవంబర్ నుంచి జనవరి వరకూ రొయ్యలకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంటుంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, ముస్లిం పండుగలు ఇదే రోజుల్లో ఉండటంతో విదేశాలకు కంటైనర్ల కొద్దీ రొయ్యలు ఎగుమతవుతాయి. ఎగుమతి చేసేందుకు, కొత్తగా స్టాకు చేసుకునేందుకు వ్యాపారులు పోటీపడి రొయ్యలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారుల్లో పోటీతో సీలింగ్‌కు బ్రేక్ పడుతుంది. ఈ సీజన్‌లో రొయ్యల అమ్మకానికి వచ్చిన రైతులకు లాభాలపంట పండుతుంది. అయితే ఈసారి అందుకు విరుద్ధంగా ధరలున్నాయి. రెండు నెలల క్రితం వరకూ 30 కౌంట్ రూ.650 ఉన్న ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 30 కౌంట్ ప్రస్తుతం రూ.500 ఉండగా, 40 కౌంట్ రూ.400, 50 కౌంట్ రూ.360 ఉంది. ఈ ధరలూ ఒకప్పుడు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాయి. పెరిగిన సీడ్, ఫీడ్, విద్యుత్, ఇతర ఖర్చులతో ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు నష్టాలు మిగులుస్తున్నాయి. 30 కౌంట్ రొయ్యలు పెంచాలంటే రైతుకు రూ.500 వరకు, 40 కౌంట్ పెంచేందుకు రూ.400 వరకు ఖర్చవుతుంది.
సగానికి పడిపోయిన రొయ్యల సర్వేయల్ (చెరువులో బతికిన రొయ్యలు):
సీడ్‌లో లోపం కారణంగా చెరువులో వేసిన రొయ్యల సీడ్‌లో సగం కూడా బతకడం లేదు. 40 నుంచి 50 శాతం లోపే రొయ్యల సీడ్ బతికి ఉంటుంది. హేచరీల యాజమాన్యాలు లాభాపేక్షతో రైతులను మోసం చేస్తున్నారు. బ్లూడర్స్(తల్లిరొయ్య)సేకరణలో లోపంతో నాణ్యమైన సీడ్ రావడం లేదు. సీడ్‌లో నాణ్యత లేదని తెలిసీ రైతులకు అంటగడుతున్నారు.
ఒకప్పుడు కేవలం 30 పైసలున్న సీడ్ ధరను నేడు 60 నుంచి 80 పైసలకు పెంచారు. వెనామిలో హెక్టారు చెరువుకు 2 నుంచి 5 లక్షల వరకూ సీడ్ పోస్తున్నారు. రైతులు సీడ్‌కే లక్షలో వ్యయం చేస్తున్నారు. వాతావరణంలో మార్పు, సీడ్ లోపం కారణంగా నెల రోజులకే కొన్ని చోట్ల చెరువులు దెబ్బతింటున్నాయి. దీంతో హెక్టారు చెరువులో రూ.7 నుంచి రూ.10 లక్షల వరకూ నష్టపోతున్నారు.
యాంటీ బయాటిక్స్ వల్లే ధరలు పతనం:
రైతులు యాంటీబయాటిక్స్ వాడకం వలన అంతర్జాతీయంగా మన రొయ్యలకు గిరాకీ తగ్గిందని, దీంతో రొయ్యల ధరలు పతనమవుతున్నాయని వ్యాపారి అల్లూరి వెంకట సత్యనారాయణరాజు అన్నారు. ఇతర దేశాలకు వెళ్లిన కొన్ని రొయ్యల లోడు కంటైనర్లు యాంటీ బయాటిక్స్ అవశేషాలున్నాయన్న కారణంగా తిరస్కరణకు గురై వెనక్కి వచ్చాయని ఆయన అన్నారు. రైతులు యాంటీ బయాటిక్స్ స్వయం నియంత్రణ ద్వారా సాధించాలని ఆయన సూచించారు.
రొయ్యో.. మొర్రో
Published Sun, Nov 9 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement