ఆక్వా ఎగుమతులపైయాంటీ బయోటిక్స్ దెబ్బ! | effect of antibiotics on aqua exports | Sakshi
Sakshi News home page

ఆక్వా ఎగుమతులపైయాంటీ బయోటిక్స్ దెబ్బ!

Published Mon, Aug 18 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

effect of antibiotics on aqua exports

యాంటీ బయోటిక్స్ అంటే..
 కొన్ని జాతుల సూక్ష్మ జీవుల జీవన ప్రక్రియలో భాగంగా తయారయ్యే రసాయనిక పదార్థాలే యాంటీ బయోటిక్స్. ఈ రసాయానాలు మిగిలిన సూక్ష్మ జీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. యాంటీ బయోటిక్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్న వారికి అలర్జీ, విష లక్షణాలు కనిపిస్తాయి. ఆహార నాళంలోని సూక్ష్మజీవుల్లో మార్పులు వచ్చి యాంటీ బయోటిక్స్ నిరోధక శక్తి కలిగిన కొత్త సూక్ష్మ జీవుల జాతులుగా మారే ప్రమాదం ఉంది.

మనం తీసుకునే సముద్ర  ఆహార ఉత్పత్తుల కణజాలంలో క్లోరాం ఫెనికాల్ అవశేషాలు ఎముక మూలుగ(బోన్‌మారో)కు హాని చేస్తాయి. రక్త హీనత కూడా ఏర్పడుతుంది. నైట్రో ఫ్యూరాన్ అవశేషాలు కేన్సర్‌కు దారితీస్తాయని పశోధనల్లో తేలింది. ఈ కారణాల నేపథ్యంలో సముద్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలు జల జీవుల పెంపకంలో యాంటీ బయోటిక్స్‌ను నిషేధించాయి.

 సురక్షితమైన రొయ్యల సాగుకు జాగ్రత్తలు
 యాంటీ బయోటిక్స్ అవశేషాలు కలిగిన రొయ్యల ఎగుమతిలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆక్వా రైతులు, హేచరీల యజమానులు, మందుల తయారీ సంస్థలు ఆక్వా పెంపక రంగంతో అనుబంధం ఉన్న వారు యాంటీ బయోటిక్స్‌ను నిబద్ధతతో వాడాలి.

హేచరీల్లో రొయ్యల పెంపకంలో యాంటీ బయోటిక్స్ అన్ని జాతుల పెరుగుదలను సమర్థవంతంగా నియంత్రించి వాటిని పూర్తిగా నిర్మూలిస్తాయి. కొన్ని జాతుల సూక్ష్మ జీవుల యాంటీ బయోటిక్స్‌ని తరచుగా వాడే సందర్భాల్లో వ్యాధికారక జీవుల జన్యువులు బయోటిక్స్‌ను నిరోధించే శక్తిని సంతరించుకుని తర్వాత సంతతులకు అందజేస్తాయి. ఈ ప్రక్రియలో ఏర్పడే కొత్త రకాల సూక్ష్మ జీవులను యాంటీ బయోటిక్స్ వాడినా నిర్మూలించలేం. చెరువుల్లో ప్రోబయోటిక్స్ వాడకం ద్వారా యాంటీ బయోటిక్స్ వాడే అవసరం ఉండదు.

 ఆక్వా రైతులు ఇవి అనుసరిస్తే మేలు..  
 చెరువుల్లో రోగ నిరోధానికి, రోగ నిర్మూలనకు ఆహారంతో పాటు అందజేసే యాంటీ బయోటిక్స్ రొయ్యల శరీరంలో నిల్వ ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందువల్ల యంటీబయోటిక్స వాడకంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను రైతులు తప్పనిసరిగా పాటించాలి.

యాంటీ బయోటిక్స్ వాడిన చెరువుల్లో రొయ్యలను ఆహారంగా తీసుకునే వారికి కలిగే హానిని గుర్తించాలి.

యాంటీ బయోటిక్స్ వాడకంలో నిర్ధేశించిన గరిష్ట పరిమితులు, విత్‌డ్రా సమయం గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి.
 
హేచరీ/రొయ్యల పెంపకంలో వాడే మందులో యాంటీ బయాటిక్స్ లేవనే విషయాన్ని నిర్ధారించుకోవాలి.

రైతులు వాడే మందులను అసలైన ప్యాకింగ్‌లోనే లేబుల్స్‌తో సహా ఉంచాలి.

సాంకేతిక సలహాదారు ద్వారా చెరువుల్లో ఉపయోగించే మందుల ఉపయోగాలను తెలుసుకోవాలి.

హేచరీల్లో/ఫారంలో వాడే మందుల వివరాలు, ఉపయోగించిన కారణాన్ని సాంకేతిక సలహాదారుతో నమోదు చేయించాలి.

 హేచరీ నుంచి తెచ్చిన పిల్లలను, వాటి పెంపకంలో వాడే ఆహారాన్ని తరచూ పరీక్ష చేయించి యాంటీ బయోటిక్స్ అవశేషాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి.

పశువైద్యంలో వాడే మందులు విదేశాల నుంచి తెప్పించినప్పుడు అవి ఆక్వా కల్చర్‌లో వాడటానికి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని తె లుసుకోవాలి. అవి ఏ దేశం నుంచి దిగమతి చేశారో గుర్తించి శానిటరీ సర్టిఫికెట్ తప్పనిసరిగా గమనించాలి.

యాంటీ బయోటిక్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై తోటి రైతులకు కూడా అవగాహన కలిగించి వాడకాన్ని నియంత్రించాలి.

రొయ్యల పెంపకం సమయంలో ఆక్వా కల్చర్ గ్రేడ్ మందులు, అనుమతించిన మందులును మాత్రమే పంపిణీ చేయాలని సదరు సంస్థలను రైతులు అడగాలి.

యాంటీ బయోటిక్స్ వాడకం ఆపేసిన తర్వాత చెరువుల్లో నీటి ఉష్ణోగ్రత 22 సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు 15 రోజులు, ఇంకా ఎక్కువగా ఉంటే 20 నుంచి 25 రోజుల తర్వాత  పట్టుకోవాలి.

శాస్త్రీయ సాంకేతిక సలహాల కోసం మత్స్యశాఖ అధికారులను తరచూ కలిసి వారి ఆదేశాలను పాటించాలి.       - చినగంజాం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement