
ఆరోగ్యంపై బాగా అవగాహన పెరిగింది.. ప్రజలు సొంత ప్రయోగాలు చేస్తున్నారు.. శరీరంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మందుల షాపునకు వెళ్తున్నారు.. వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు.. కొందరు ఓ వారం వాడితే బాగుంటుందని ఉచిత సలహా.. దీంతో అలా వాడేస్తున్నారు.. ఇవే కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నాయి.. వీటిపై అవగాహన కోసం ప్రతి ఏడాదీ 13వ తేదీ వరల్డ్ సెప్సిస్ డే నిర్వహిస్తున్నారు.
గుంటూరు మెడికల్: విచ్చల విడిగా యాంటీబయాటిక్స్ వినియోగించడంతో పాటు వ్యాధి నివారణకు వాడాల్సినవి కాకుండా ఇతర యాంటీబయాటిక్స్ వాడడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అనేక మంది ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇన్ఫెక్షన్‌ల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి ఏడాది 7 నుంచి పది కోట్ల మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి మృతి చెందుతున్నట్లు అంచనా. ప్రతి 3.5 సెకన్లకు ఒకరు ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది 2.70 కోట్ల నుంచి 3 కోట్ల మంది ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలుకొని, ఐదేళ్లలోపు పిల్లలు 60 లక్షల మంది ప్రతిఏడాది ఇన్ఫెక్షన్‌లతో చనిపోతున్నారు.
లక్షణాలు..
సెప్సిస్ అనేది ఒక ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. ఇది సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులుగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, విపరీతమైన నీరసం, తీవ్రమైన చలి, ఆయాసం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, బీపీ తగ్గడం, పెరగడం, రోగి తికమక పడడం తదితర లక్షణాలు వ్యాధి బాధితుల్లో కనిపిస్తాయి.
వ్యాధి నిర్ధారణ..
బ్లడ్ కల్చర్, కార్బాఆర్, బయోఫయర్ టెస్ట్‌ల ద్వారా సెప్సిస్ వ్యాధిని నిర్ధారిస్తారు. అంటు వ్యాధి కారకాలు, వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి, వాటి స్థానం నుంచి రక్త ప్రవాహంలో కలవడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన జబ్బు. తక్షణమే గుర్తించి చికిత్స చేయని పక్షంలో శరీరంలోని పలు అవయవాలు ఇన్ఫెక్షన్‌ల వలన పనిచేయడం మానివేసి రోగి ప్రాణాలు కోల్పోతాడు.
రాజధాని జిల్లాల్లో బాధితులు
గుంటూరు జిల్లాలో ఫిజీషియన్లు 120 మంది, కృష్ణా జిల్లాలో వంద మంది వైద్యనిపుణులు ఉండగా, ప్రతిరోజూ ఒక వైద్యుడి వద్దకు 20 మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి చికిత్స కోసం వస్తున్నారు. వీరికి సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించని పక్షంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌గా (సెప్సిస్) మారి రోగులను ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది.
వ్యాధి సోకే భాగాలు
ఇన్ఫెక్షన్లు నూటికి 50 శాతం ఊపిరితిత్తుల్లో వస్తాయి. తదుపరి కిడ్నీలు, బ్రెయిన్, యూరినరి ట్రాక్ట్, చర్మం, ఇతర భాగాల్లో వ్యాధి ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. కడుపులో ఇన్ఫెక్షన్లు రావడం ద్వారా అల్సర్లు ఏర్పడతాయి. క్యాన్సర్ బాధితులు, షుగర్ బాధితులు, కాలిన గాయాల వారిలో, మేజర్ ట్రామా బాధితుల్లో, హెచ్‌ఐవీ బాధితుల్లో సూక్ష్మ క్రిముల ద్వారా ఈ వ్యాధి త్వరితగతిన ఎక్కువ మందిలో వ్యాప్తి చెందుతుంది. కాళ్లల్లో పుండ్లు ఏర్పడి చీము పట్టి పరిస్థితి ప్రమాదంగా మారి కొన్ని సార్లు ఆపరేషన్‌ల ద్వారా ఆగాయాలను తొలగించాల్సి వస్తుంది.
పౌష్టికాహారం తీసుకోవాలి
శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఖనిజ లవణాలు, విటమిన్లు, కార్బోహైడ్రేడ్‌లు, అన్ని సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి. మరుగుదొడ్లు వినియోగించిన పిదప, భోజనానికి ముందు తప్పనిసరిగా కాళ్లు, చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రమైన వ్రస్తాలు ధరించడం, నిద్రించే పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. యాంటీబయాటిక్స్ వైద్యుల సలహాలు మేరకు మాత్రమే వాడాలి.
–డాక్టర్ కోగంటి కల్యాణ చక్రవర్తి, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment