
సాక్షి, అమరావతి బ్యూరో: జనం గమ్యం చేరడానికి రహదారులే కీలకం. పలు రాష్ట్రాలను అనుసంధానం చేయడంలో జాతీయ రహదారులది మరింత కీలక పాత్ర. ప్రయాణం సజావుగా సాగడానికి వీలుగా ఈ నేషనల్ హైవేలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తాయి. వీటి నిర్వహణ బాధ్యతను ఈ శాఖ చూస్తుంది. ఈ జాతీయ రహదారులపై పయనించే వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తుంది. ఆ సొమ్ముతో రోడ్ల అభివృద్ధి, నిర్వహణ వ్యయం వంటి వాటికి ఖర్చుచేస్తుంది. ఇందుకోసం అవసరమైన టోల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తుంది. ఇలా విజయవాడ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో ఐదు టోల్ ప్లాజాలున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారుల తీరుతెన్నులు, హైవేపై ప్రయాణించే వారికి అత్యవసర సేవలు, ఆపదలో అవసరమైతే ఎవరిని సంప్రదించాలి? అందుబాటులో ఉన్న అంబులెన్సులు, పెట్రోలింగ్ వాహనాలు, వాహనాదారులు తెలుసుకోవలసిన విషయాలు, టోల్‌ఫీజులు, ఫాస్టాగ్ వంటి సమగ్ర సమాచార సమాహారమే ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
జాతీయ రహదారులు (ఎన్‌హెచ్) పలు రాష్ట్రాలను కలుపుతూ రాకపోకలను సులువు చేస్తాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (రోడ్ వింగ్) జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు చూస్తుంది.
♦నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పార్లమెంట్ చట్టం, ఎన్‌హెచ్‌ఏఐ చట్టం–1988ను అమలులోకి వచ్చింది. ఇది జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం ఏర్పాటైంది.
♦జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఆర్థిక సాయం చేస్తూ నిర్వహణ చూస్తుంది. రాష్ట్ర రహదారులను ఆయా రాష్ట్రాల
ప్రజా పనుల శాఖ అభివృద్ధి చేస్తుంది.
♦ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న అన్ని జాతీయ రహదారులకు
సంఖ్యలు కూడా ఉపయోగిస్తారు. ఆరోహణ క్రమంలో తూర్పు నుంచి పడమర వరకు కేటాయిస్తారు.
♦తూర్పు నుంచి పడమరకు ఉన్న జాతీయ రహదారులు బేసి సంఖ్యలను ఆరోహణా క్రమంలో కేటాయిస్తారు. అన్ని ముఖ్య రహదారుల కోసం ఒకటి లేదా రెండు అంకెల సంఖ్యలు ఉపయోగిస్తారు. మూడంకెల సంఖ్యతో సూచించే రహదారులను అనుబంధ రోడ్లుగా పేర్కొంటారు.
టోల్ ఫీజు నుంచి వీటికి మినహాయింపు
భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, లోక్‌సభ స్పీకరు, కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నరు, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, లోక్‌సభ సభ్యులు, ఆర్మీ కమాండర్, భారత ప్రభుత్వ కార్యదర్శి, ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పరమవీరచక్ర, అశోకచక్ర, మహావీర్‌చక్ర, కీర్తి చక్ర, వీర్‌చక్ర, శౌర్యచక్ర అవార్డు గ్రహీతలు, రక్షణరంగ వాహనాలు, ఉద్యోగులకు, పోలీసులకు, ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్లు, అగి్నమాపక వాహనాలు, అంబులెన్సులు, అంత్యక్రియల వాహనాలు వంటి వాటికి టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇంకా ఫాస్టాగ్ కలిగి ఉన్న వారు నేరుగా టోల్‌ప్లాజా నుంచి వెళ్లవచ్చు.
విశ్రాంతి కోసం లే బేలు..
♦జాతీయ రహదారికి ఆనుకుని లేబేలు ఏర్పాటు చేస్తారు. వాటిని జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వాహనాలను నిలపడానికి, ఎమర్జెన్సీ పార్కింగ్‌కు, లేదా డ్రైవర్ల విశ్రాంతి కోసం వినియోగిస్తారు. అక్కడ పెద్ద లేబేలుంటే ఆహార విక్రేతలూ ఉంటారు. ఆహార పదార్థాలు, విశ్రాంతి, తాగునీరు, మరుగుదొడ్లు, టెలిఫోన్ సదుపాయం ఉంటాయి.
♦హైవేలపై మూడు రకాల రహదారి చిహ్నాలు ఉంటాయి. వాటిలో తప్పనిసరి/నియంత్రణ, జాగ్రత్త/హెచ్చరిక, సమాచార సంకేతాలు తెలిపేవి ఉంటాయి. ప్రధాన క్యారేజీ వే, సరీ్వసు, స్లిప్‌రోడ్లు, టోల్‌ప్లాజా ఇతర ప్రాజెక్టు హైవే సౌకర్యాలకు సరైన సంకేతాలు అందిస్తాయి.
♦హైవేలపై ఉండే లైన్లపై రంగులు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. తెలుపు రంగు రోడ్లపై దృష్టి స్పష్టతకు, పసుపు రంగు ట్రాకింగ్ నియంత్రణకు, మార్కింగ్, పార్కింగ్ అనుమతులు లేని చోట సూచనలకు ఉపయోగపడుతుంది. ప్రమాదకర ప్రదేశాన్ని సూచించడానికి ఎరుపు రంగు, రోడ్డుపై సైకిళ్లు వంటి మోటారు లేని వాహనాలు వెళ్లడానికి ఆకుపచ్చ రంగు, బస్సుల వేగవంత రవాణా కోసం నీలం రంగులు ఏర్పాటు చేస్తారు.
ఫాస్టాగ్ ఎందుకంటే..
♦టోల్ ఫీజు చెల్లింపుల్లో జాప్యం నివారణ, డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేయడం, ప్లాజాల్లో రద్దీని, ఇంధన వినియోగం, వాయు కాలుష్యం, నిరీక్షణా సమయాన్ని తగ్గించడం వంటి వాటి కోసం ఫాస్టాగ్‌ను అమలులోకి తెచ్చారు.
♦ఫాస్టాగ్ లేని వాహనాలు నగదు చెల్లింపు వరసలో వెళ్లేందుకు అనుమతిస్తారు.
♦అన్ని టోల్‌ప్లాజాలు, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకుల పీఓసీ కౌంటర్లు,
అమెజాన్ వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఫాస్టాగ్ కార్డులు కొనుగోలు, రీచార్జి చేసుకోవచ్చు.
♦దీనికి వాహనం ఆర్‌సీ కాపీ, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, చిరునామా కోసం కేవైసీ పత్రాలు, ఫాస్టాగ్ కోసం గుర్తింపు పత్రాలు అవసరమవుతాయి.
♦జిల్లాలో హైవేలకు సమీపంలో ఉన్న పట్టణాలు, నగరాలు, ఆస్పత్రుల వివరాలను సూచించే సమాచార బోర్డులు హైవే వెంబడి ఉన్నాయి.
లోకల్ పాస్ పొందాలంటే..
♦టోల్ ప్లాజా వద్ద ఫీజు నుంచి స్థానికులకు మినహాయింపు, రాయితీలు ఉంటాయి. వాటికి సంబంధించి కొన్ని నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సూచించింది.
♦లోకల్ పాస్ పొందాలంటే ఆ వాహనం ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలోనిదై ఉండాలి.
♦నిబంధనలు అతిక్రమించిన వారి నుంచి జరిమానా వసూలు చేస్తారు.
♦టోల్‌ప్లాజా సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తే సంబంధిత ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌కు లేదా 1033 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలి.
♦ఒకవేళ ఏదైనా వాహనం టోల్‌ప్లాజా ఫీజు చెల్లించకుండా వెళ్లిపోయినా, ప్లాజా ఆస్తులకు నష్టం కలిగినా, దౌర్జన్యానికి పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
టోల్ ప్లాజాల వివరాలు
♦విజయవాడ ఎన్‌హెచ్ డివిజన్ పరిధిలో ఐదు టోల్‌ప్లాజాలున్నాయి. పొట్టిపాడు, కీసర, బాడవ, దవులూరు, కలపర్రు (పశి్చమ గోదావరి)
♦ఈ ఐదు ప్లాజాల నుంచి రోజుకు సగటున రూ.50 లక్షల వరకు టోల్ ఫీజు వసూలవుతోంది.
♦ఈ ప్లాజాల మీదుగా రోజుకు దాదాపు 54,700 వాహనాలు ప్రయాణిస్తాయి. వీటిలో ఎన్‌హెచ్–16 మీదుగా 34 వేలు, ఎన్‌హెచ్–65 మీదుగా 13 వేలు, ఎన్‌హెచ్–30 మీదుగా 7,700 వాహనాలు రాకపోకలు సాగిస్తాయి.
♦హైవేపై 24 గంటలూ ఐదు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
♦ఈ టోల్‌ప్లాజాల పరిధిలో ఐదు పెట్రోలింగ్ వాహనాలు, ఐదు క్రేన్లు ఉన్నాయి. నాలుగు ట్రక్ లే బేలు ఉన్నాయి.
సేవలు, ఫిర్యాదులు
♦ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టిన నిర్మాణం/నిర్వహణ పనులపై 1033 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు.
♦జాతీయ రహదారిపై ఏదైనా ప్రమాదం
జరిగితే 1033 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఫోన్ నంబర్లు హైవేపై ఏర్పాటు చేసిన సైన్‌బోర్డుల్లోనూ ఉంటాయి. 100తో పాటు 8688831459 నంబర్లలోనూ సంప్రదించొచ్చు.
♦హైవేలపై ప్రతి 50 కిలోమీటర్లకు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి.
♦జాతీయ రహదారులపై పెట్రోలింగ్ సేవలు 24 గంటలూ లభిస్తాయి. రూట్ పెట్రోలింగ్ సమాచారం కోసం సైన్ బోర్డులూ ఉంటాయి.
♦హైవేలపై డ్రైవర్లు, రవాణా వాహనదారులు ఫిర్యాదు చేయడానికి లేదా సమాచారానికి 1033 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించవచ్చు.
♦ఐఆర్‌సీఎస్‌పీ: 84–2014 ప్రకారం డివైడర్ల వెడల్పు పెంచవచ్చు, తగ్గించవచ్చు. డివైడర్ల వెడల్పు కనీసం 1.50 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు ఉంటుంది. సాధ్యమైనంత వరకు డివైడర్ల తొలగింపు సాధ్యపడదు. ♦ఎవరైనా అనధికారికంగా తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తొలగించాల్సి వస్తే ఎన్‌హెచ్‌ఏఐ అనుమతితో అత్యవసరమైతేనే తొలగించే వీలుంటుంది. ఆ తర్వాత డివైడర్‌ను విధిగా పునరుద్ధరించాలి.
టోల్‌ప్లాజాలు ఎందుకంటే..
♦జాతీయ రహదారుల రుసుము 2008 ప్రకారం నిర్దిష్ట రోడ్డుపై వినియోగం/ప్రయాణించడం కోసం టోల్‌ఫీజు వసూలు చేస్తారు.
♦యూజర్ చార్జీల వసూలు కోసం ఈ–బిడ్డింగులు నిర్వహిస్తారు. ఈ–బిడ్డింగులో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తారు.
టోల్ ఫీజుల్లో వ్యత్యాసం ఎందుకు?
♦ఒక్కో టోల్‌ప్లాజాలో టోల్ ఫీజు ఒక్కోలా ఉంటుంది. ఎందుకంటే.. ఆ ప్లాజా పరిధిలో రోడ్ల పొడవు, వెడల్పు, వంతెనలు, బైపాస్‌లు వంటి నిర్మాణాలకు అనుగుణంగా టోల్ ఫీజు నిర్ణయించి వసూలు చేస్తారు. అందువల్ల ప్లాజాల మధ్య టోల్ ఫీజు వసూలులో వ్యత్యాసం ఉంటుంది.
♦మున్సిపల్/స్థానిక పట్టణ ప్రాంత పరిమితుల నుంచి పది కిలోమీటర్ల దూరంలో టోల్ ప్లాజాను గుర్తించడానికి అథారిటీకి అధికారం ఉంటుంది. కానీ ఏ సందర్భంలోనైనా ఐదు కిలోమీటర్ల లోపు జాతీయ రహదారి, శాశ్వత వంతెన, బైపాస్, టన్నెల్ (సొరంగం) వంటి వాటిలో ఒక భాగం, మున్సిపల్ లేదా పట్టణ ప్రాంత పరిమితుల్లో నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో నిర్మిస్తే నివాసితుల ఉపయోగం కోసం ఆ ఏరియాల్లోనూ ప్లాజాను ఏర్పాటు చేయవచ్చు.
♦హైవేలో ఒక ప్లాజాకు మరో ప్లాజాకు 60 కిలోమీటర్ల దూరం ఉండాలి. 60 కిలోమీటర్ల లోపు మరొకటి ఏర్పాటు చేయకూడదు.
♦హైవేపై ప్రయాణించే వాహనాలకు వసూలు చేసే చార్జీలు ప్లాజా పరిధిలో దూరం, రోడ్లు, బైపాస్‌లు, వంతెనలు వంటివి ఆధారంగా నిర్ణయిస్తారు.
విజయవాడ డివిజన్‌లో ఇలా..
♦విజయవాడ డివిజన్ పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్ 16, ఎన్‌హెచ్–30 జాతీయ రహదార్లు వెళ్తున్నాయి.
♦ఎన్‌హెచ్–65: నందిగామ–ఇబ్రహీంపట్నం–విజయవాడ సెక్షన్, విజయవాడ–మచిలీపట్నం సెక్షన్ మీదుగా 112.611 కిలోమీటర్ల పొడవున ఇది విస్తరించింది.
♦ఎన్‌హెచ్–16: గుండుగొలను–చిన్నఅవుటపల్లి సెక్షన్, చిన్న అవుటపల్లి–కనకదుర్గమ్మ వారధి వరకు ఇది జిల్లాలో విస్తరించింది. దీని పొడవు 78.20 కిలో మీటర్లు.
♦ఎన్‌హెచ్–30: చంద్రగూడెం–ఏపీ/తెలంగాణ బోర్డర్ సెక్షన్ మీదుగా 37.80 కిలోమీటర్ల పొడవున ఇది ఉంది.
♦జాతీయ రహదారులపై రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ అజమాయిషీ ఉండదు.
♦జాతీయ రహదారులపై పచ్చదనం, లైటింగ్, మరమ్మతులు వంటి నిర్వహణకు సంబంధించిన పనులు కాంట్రాక్టు ఒప్పందం నిబంధనల ప్రకారం ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులను సంబంధిత కాంట్రాక్టుల ద్వారా చేయిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment