
పెద్ద సమస్య అయితే తప్ప యాంటిబయాటిక్స్ వద్దు!
పరిపరి శోధన
పిల్లలకు దగ్గు వస్తున్నా లేదా జలుబు కనిపించినా తల్లిదండ్రులు తమంతట తామే వారికి యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. పిల్లలకు వచ్చే సమస్యతో తల్లడిల్లిపోయి తక్షణం తగ్గడానికి యాంటీబయాటిక్స్ రాయమంటూ డాక్టర్‌లను అడుగుతుంటారు. అయితే చిన్న చిన్న సమస్యల కోసం ఆన్ కౌంటర్ మెడిసిన్‌గా లేదా డాక్టర్‌ను ఒత్తిడి చేసైనా పిల్లలకు యాంటీబయాటిక్స్ వాడటం సరికాదని తాజా పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇలా చిన్న వయసులోనే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పెద్దయ్యాక వారిలో డయాబెటిస్ వచ్చేలా చేసేందుకు అవకాశాలు ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక్కోసారి చిన్న వయసులోనే కనిపించే టైప్-1 డయాబెటిస్ కూడా వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. పిల్లలందరిలోనూ ఈ అవకాశం ఎక్కువే అయినా మగపిల్లల్లో ఇలా జరిగే అవకాశాలు మరింత ఎక్కువని ‘జర్నల్ నేచర్ మైక్రోబయాలజీ’ అనే మెడికల్ జర్నల్ వివరిస్తోంది.