యాంటీబయో‘కిల్స్’ | 71 percent of the antibiotics usage increased in joint state | Sakshi
Sakshi News home page

యాంటీబయో‘కిల్స్’

Published Mon, Nov 3 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

యాంటీబయో‘కిల్స్’

యాంటీబయో‘కిల్స్’

ఐదేళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో 71 శాతం పెరిగిన యాంటీ బయోటిక్స్ వినియోగం
ఏటా రూ. 5 వేల కోట్ల అమ్మకాలు
ప్రభుత్వాసుపత్రులు వాటా రూ.123 కోట్లు
ఈ మందుల వినియోగం పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాంటీబయోటిక్స్ మందుల వినియోగం తీవ్రమైంది. చిన్నపాటి జలుబు చేసినా ఈ తరహా మందులు వాడటం ఎక్కువైంది. వీటితో ప్రమాదం పొంచి ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 71 శాతం యాంటీబయోటిక్స్ మందుల వినియోగం పెరిగినట్టు తేలింది. రాష్ట్రంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధుల బాధితులకు మధుమేహం ఒక కారణమైతే.. రెండో కారణం యాంటీబయోటిక్స్ మందులేనని వైద్యులు చెప్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) ఒక్కొక్కరు ఏడాదికి సగటున 13 నుంచి 16 యాంటీబయోటిక్స్ మాత్రలు (ఇంజక్షన్లు కాకుండా) వినియోగిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మందుల వినియోగం దేశవ్యాప్తంగా కూడా గత ఐదేళ్లలో 62 శాతం పెరిగినట్టు ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం తాజాగా తమ పరిశోధనలో తేల్చింది. దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ కంటే తెలుగురాష్ట్రాల్లోనే ఈ మందుల వినియోగం ఎక్కువని తేలింది. ఇటీవలే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ యాంటీబయోటిక్స్ మందుల వినియోగం పెరుగుదల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఈ మందుల వినియోగం వల్ల దుష్ఫలితాలు ఏటికేడాదిపెరుగుతున్నాయి. సూక్ష్మక్రిములు (మైక్రోబ్యాక్టీరియా) నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. దీంతో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఏటా 30 శాతం యాంటీబయోటిక్ మందులు పనిచేయకపోతుండటంతో కొత్త మందులను వాడుతున్నట్టు తేలింది. మోతాదు పెంచడం వల్ల అది మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాకుండా నరాలు, ఎముకల సంబంధిత వ్యాధులూ వస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. మైక్రోబ్యాక్టీరియా సామర్థ్యం పెంచుకునే కొద్దీ కొత్తరకాల వ్యాధులు వస్తున్నట్టు కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
రూ. 5 వేల కోట్లకు పైనే వ్యాపారం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటా ఒక్క యాంటీబయోటిక్స్ మందులుపై రూ. 5,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఔషధ నియంత్రణ మండలి ఇచ్చిన లెసైన్సులను బట్టి రెండు రాష్ట్రాల్లో 50 వేల మందుల షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో రోజూ 10 నుంచి 15 శాతం యాంటీబయోటిక్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆర్‌ఎంపీలు, ఫార్మసిస్ట్‌లు కూడా స్పెషలిస్ట్ డాక్టర్ అనుమతి లేకుండా హైడోస్ (మోతాదుకు మించిన) యాంటీబయోటిక్స్ మందులను  రోగులకు ఇస్తున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాస్పత్రులకు ఏటా రూ. 130 కోట్ల యాంటీబయోటిక్స్ మందులు కొనుగోలు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యాంటీబయోటిక్స్‌పై అవగాహన లేకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది.
 
బలం పెంచుకుంటున్న బ్యాక్టీరియా
యాంటీబయోటిక్స్ పదే పదే వాడటం వల్ల క్రిములు ఆ మందును తట్టుకునేలా బలాన్ని పెంచుకుంటున్నాయి. దీనివల్ల ఏటా కొత్త జబ్బులు వస్తున్నాయి. పైగా అర్హతలేని వైద్యులు కూడా ఈ మందులను ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నారు. యాంటీబయోటిక్స్ వల్ల కిడ్నీలపై ఎక్కువ ప్రభావం పడుతోంది. దీనివల్ల కిడ్నీరోగుల సంఖ్య పెరుగుతోంది. కఠినమైన నిబంధనలు విధిస్తే తప్ప వీటిని నివారించడం కష్టమైన పని.
 -డాక్టర్ జె.రంగనాథ్, మూత్రపిండాల వైద్య నిపుణులు, మల్లిక కిడ్నీసెంటర్, హైదరాబాద్
 
 
భవిష్యత్‌లో దొరక్కపోవచ్చు..
 చిన్నచిన్న జబ్బులకు కూడా అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడుతున్నాం. వీటిని వాడటం వల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకోవడమే కాకుండా, సూక్ష్మక్రిములు మరింత రాటుదేలి పోతున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఈ స్థాయిలో బలమైన యాంటీబయోటిక్స్‌ను మనం తయారు చేసుకోలేక పోవడం గానీ, దొరక్కపోవడం గానీ జరగవచ్చు.

-డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్,సిటీ న్యూరో సెంటర్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement