మాటిమాటికీ ఇద్దరికీ ఇన్ఫెక్షన్స్? | Both recurrent infections? | Sakshi
Sakshi News home page

మాటిమాటికీ ఇద్దరికీ ఇన్ఫెక్షన్స్?

Published Wed, Oct 14 2015 12:15 AM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

మాటిమాటికీ ఇద్దరికీ ఇన్ఫెక్షన్స్? - Sakshi

మాటిమాటికీ ఇద్దరికీ ఇన్ఫెక్షన్స్?

ప్రైవేట్ కౌన్సెలింగ్
 
 నాకు 32 ఏళ్లు. సెక్స్ చేసిన ప్రతిసారీ మూత్రంలో మంట వస్తోంది. నాకంటే కూడా నా భార్యకు విపరీతమైన మంట, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, పొత్తికడుపులో నొప్పిగా ఉండటం జరుగుతోంది. యాంటీబయాటిక్స్ వాడినప్పుడల్లా సమస్య కొద్దిగా తగ్గినా రెండు మూడు నెలల తర్వాత మళ్లీ వస్తోంది. దాంతో సెక్స్ అంటేనే భయంగా ఉంది. దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపండి.
 - జి.ఎస్.ఆర్., సూళ్లూరుపేట

మీరు చెబుతున్న లక్షణాలు బట్టి మీరిద్దరూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. సెక్సువల్ ఇంటర్‌కోర్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత మరింత ఎక్కువవుతోంది. చాలామంది మహిళల్లో వాళ్ల యోని బ్యాక్టీరియాతో కంటామినేట్ కావడం వల్ల, లేదా ఈ బ్యాక్టీరియాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి (రెసిస్టెన్స్) తక్కువగా ఉండటం వల్ల యోని నుంచి బ్లాడర్‌కు తఈ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మీరిద్దరూ యూరిన్ కల్చర్, బ్లడ్ షుగర్ వంటి పరీక్షలు చేయించుకొని,  పూర్తి కోర్సు యాంటీబయాటిక్స్ మధ్యలో ఆపకుండా వాడండి. అప్పటికీ తగ్గకపోతే ఇద్దరూ యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
   
నా వయస్సు 74 ఏళ్లు. ప్రోస్టేట్ గ్లాండ్‌ను పూర్తిగా తొలగించారు. అయితే  అంగస్తంభనలు మాత్రం బాగానే ఉంటున్నాయి. అప్పుడప్పుడు హస్తప్రయోగం చేస్తున్నాను. కానీ వీర్యం మాత్రం అస్సలు రావడం లేదు. నాకు వీర్యం ఎందుకు కావడం లేదు? ఈ ఆపరేషన్ తర్వాత సెక్స్ చేయవచ్చా?
 - ఆర్.ఆర్.డి., గుంటూరు

ప్రోస్టేట్ గ్లాండ్ తొలగించిన తర్వాత వీర్యం ఎక్కువగా రాదు. ఎందుకంటే వీర్యంలో ఎక్కువభాగం ఈ గ్రంథి నుంచే తయారవుతుంది. అంగస్తంభనలు బాగా ఉండి మీరు సెక్స్ చేయగలుగుతుంటే నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఇందువల్ల ఎలాంటి ప్రమాదం, ఇబ్బంది ఉండదు. ఈ వయస్సులో వీర్యం వచ్చినా, రాకపోయినా దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు సెక్స్‌లో సంతృప్తి ఉంటే చాలు.
 
   
నాకు 35 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ఇక పిల్లలు పుట్టకుండా నేను వాసెక్టమీ చేయించుకోవాలనుకుంటున్నాను. అయితే మగతనానికి ఏదైనా లోపం వస్తుందేమోనని నాకు ఆందోళన కలుగుతోంది. ఒక్కోసారి మా ఆవిడకు ట్యూబెక్టమీ చేయిద్దామని కూడా అనుకుంటున్నాను. మా ఇద్దర్లో ఎవరు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది? వాసెక్టమీ చేసిన తర్వాత మగతనం తగ్గుతుందని మా ఫ్రెండ్స్ అంటున్నారు. ఇది వాస్తవమేనా?
 - వి.ఆర్.కె., తల్లాడ
మహిళలకు ట్యూబెక్టమీ చేయించడం కంటే మగవారిలో వాసెక్టమీ చేయడం సర్జికల్‌గా చాలా సులభమైన ప్రక్రియ. వాసెక్టమీ చేసిన తర్వాత ఒక్కరోజు కూడా ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. ఈమధ్య కాలంలో ఒక్క కుట్టు కూడా లేకుండా, బ్లేడ్ ఉపయోగించకుండా కూడా ఈ ఆపరేషన్ చేయడం సాధ్యమవుతుంది. దీన్ని ‘నో స్కాల్‌పెల్ వ్యాసెక్టమీ’ అంటారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఇది పూర్తవుతుంది. ఆ మర్నాటి నుంచి అన్ని పనులూ మామూలుగానే చేసుకోవచ్చు. ఈ సర్జరీ వల్ల అంగస్తంభనల్లోగాని, సెక్స్ కోరికల విషయంలోగాని, పురుషత్వపు సామర్థ్యంలోగాని ఎలాంటి తేడాలు ఉండవు. శరీర దారుఢ్యంలోగాని, బరువులు ఎత్తడంలోగాని, ఫిట్‌నెస్‌లోగాని ఎలాంటి మార్పులు రావు. ఇంత తేలికైన ఆపరేషన్ కాబట్టే సాధారణంగా మగవారే వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తారు.
 
   
నాకు 60 ఏళ్లు. రోజూ ఒక పాకెట్‌కు పైగా సిగరెట్లు తాగుతాను. గత 15 రోజుల నుంచి నాకు మూత్రంలో రక్తం పడుతోంది. అయితే మంట, నొప్పి ఏమీ లేవు. ఈ వయస్సులో మూత్రంలో రక్తం పడటం మంచిది కాదని తెలిసినవాళ్లు అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - ఎం.వి.పి.ఆర్., కందుకూరు

 నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడటాన్ని ‘పెయిన్‌లెస్ హిమచ్యూరియా’ అంటారు. యాభై ఏళ్లు పైబడిన వారిలో ఇలా రక్తం పడే లక్షణం కనిపిస్తున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకంగా పొగ తాగేవాళ్లలో వాళ్ల స్మోకింగ్ అలవాటు వల్ల బ్లాడర్‌లో చిన్న చిన్న గడ్డల వల్ల కూడా ఇది రావచ్చు. ఇదిగాక ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జిమెంట్ వల్ల లేదా ఇతరత్రా మూత్రంలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా మూత్రంలో రక్తం రావచ్చు. కారణం ఏమైనా ఇలా నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిస్టోస్కోపీ, మూత్రపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ముందు మీరు మీ స్మోకింగ్ అలవాటును పూర్తిగా ఆపేయండి. అయితే తక్కువ వయస్సున్న వారిలో ఇలా మూత్రంలో రక్తం పడితే అది ఎక్కువశాతం ఇన్ఫెక్షన్ల వల్లనే కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు వీలైనంత త్వరగా యూరాలజిస్ట్‌ను కలవండి.
 
   
నా వయస్సు 28 ఏళ్లు. నాకు ఎడమవైపున ఉన్న వృషణం కుడివైపు దానికంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంటుంది. దాంతో నా పురుషాంగం కొంచెం ఎడమవైపునకు ఒంగినట్లుగా ఉంది. దాంతో అంగం స్తంభించినప్పుడల్లా నా పురుషాంగం ఎడమవైపునకు ఒంగుతోంది. వృషణాలు ఒకే లెవెల్‌లో లేకపోవడం వల్లనే పురుషాంగం ఇలా పక్కుకు వంగుతోందా? దీనివల్ల నేను పెళ్లి చేసుకొని సెక్స్‌లో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయా? దీనికి చికిత్స ఉంటుందా?
 - కె.ఎస్.ఆర్., తెనాలి

 వృషణాలు సమానమైన లెవెల్‌లో ఉండకపోవడం చాలా సాధారణం. అంగం కూడా కొంచెం ఎడమవైపునకో, కుడివైపునకో పక్కకు తిరిగి ఉండటం కూడా సహజమే. పురుషాంగం ఇలా పక్కకు తిరిగి ఉండటానికీ, వృషణాల లెవెల్ సమానంగా లేకపోవడానికీ సంబంధం లేదు. మీకు సెక్స్ కోరికలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభనలు నార్మల్‌గా ఉండి, వృషణాల్లో నొప్పి లేకపోతే మీరు నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చు. మీరు అందరిలాగే దాంపత్యసుఖం అనుభవించగలరు. వైద్యపరంగా మీకు ఎలాంటి సమస్యా లేదు. ఈ అంశం మీ దాంపత్య సుఖానికి ఏ విధంగానూ అడ్డు కాదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement