
మనం ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనకు తెలిసిన యాంటీబయాటిక్స్ వాడటం ఇటీవల మామూలైపోయింది. సాధారణ జలుబు, దగ్గుకు అజిథ్రోమైసిన్, నీళ్లవిరేచనాలకు నార్‌ఫ్లాక్స్ వంటి మందులను చాలా విరివిగా ఉపయోగిస్తుంటాం. సొంతవైద్యం చేసుకునే చాలామందితో పాటు... కొంతకాలం డాక్టర్లు రాసిన మందులను చూస్తూ, ఆ తర్వాత వాటినే వాడుతూ ఉండే అవగాహన లేని గ్రామీణ వైద్యులు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటానికి కారణమవుతున్నారు.
కానీ దీనివల్ల మానవాళికి ఎంతో ముప్పు పొంచి ఉంది. రోగకారక సూక్ష్మజీవులు మనం విచ్చలవిడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్ పట్ల నిరోధకత పెంచుకుంటున్నాయి. దాంతో వాటి మోతాదును మరింతగా పెంచి ఇచ్చినా కూడా హానికారకమైన సూక్ష్మజీవులను తుదముట్టించలేకోతున్నాం. విచ్చలవిడి యాంటీబయాటిక్ ఉపయోగంతో కలగనున్న ముప్పునకు ఉదాహరణలివే...
♦ యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్న క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా కారణంగా వచ్చే నీళ్ల విరేచనాలు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు.
♦ కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల మందుల వల్ల ఎంతకూ లొంగని ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
♦ ఇక టీబీ వచ్చిన కొందరు వారికి ఇచ్చిన మందులను పూర్తికాలం ఉపయోగించకపోవడం వల్ల అది మళ్లీ కనిపించడంతోపాటు, టీబీకి కారణమైన క్రిములు యాంటీబయాటిక్స్‌కు నిరోధకత సాధిస్తున్నాయి. దాంతో టీబీ ఒకపట్టాన లొంగడం లేదు. దీనివల్ల హాస్పిటల్‌లో ఉండాల్సిన వ్యవధి, ఖర్చు పెరగడంతో పాటు చివరగా రోగి మృత్యువాత పడే రిస్క్ కూడా పెరుగుతాయి.
అందుకే వాటిని మన దేహానికి ఉన్న సహజ రోగ నిరోధక శక్తి దెబ్బతినకుండా ఉండేంత మోతాదులో వాడాలని గుర్తుంచుకోండి. అదికూడా పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment