మొండి రోగాల ముప్పు! | UN Warns Be Careful WIth Dangerous Diseases | Sakshi
Sakshi News home page

మొండి రోగాల ముప్పు!

Published Wed, May 1 2019 1:00 AM | Last Updated on Wed, May 1 2019 1:00 AM

UN Warns Be Careful WIth Dangerous Diseases - Sakshi

వచ్చిన జబ్బేమిటో, దాని తీవ్రత ఎంతో తెలియకపోయినా ఇష్టానుసారం మందులు మింగే అల వాటు మానవాళి మనుగడకే ప్రమాదంగా పరిణమించిందని, మొండిరోగాలు పుట్టుకొస్తున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్‌ ఏజెన్సీ కో ఆర్డినేషన్‌ బృందం (ఐఏసీజీ) సోమవారం చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కలిగించాలి. బ్యాక్టీరియా వల్లనో, వైరస్‌వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో ఏదైనా వ్యాధి సోకినప్పుడు శరీరతత్వాన్నిబట్టి స్పందన ఉంటుంది. ఏ కారణంగా నలత ఉందో, దాన్ని అరికట్టడానికి ఏ మందు ఏ మోతాదులో, ఎలా వాడాలో వైద్య నిపుణులు చెప్పాలి.  కానీ ఎవరినీ సంప్రదించకుండా, మందుల దుకాణంలో లక్షణాలు చెప్పి గోలీలు కొనుక్కుని వాడే ధోరణి మన దేశంలోనే కాదు... ప్రపంచమంతటా పెరిగిపోయింది. దానికి తోడు ఆసుపత్రులు కాసుపత్రులుగా మారాక అవసరమున్నా లేకున్నా వైద్యులే మందులు అంటగడుతున్నారు. ఇలాంటి ధోరణుల వల్ల మొండి రోగాలు విస్తరించి 2030నాటికి అల్పాదాయ దేశాల్లో దాదాపు రెండున్నర కోట్లమంది తీవ్రమైన పేదరికం బారిన పడతారని, దానివల్ల ఆర్థిక వ్యవస్థలు ధ్వంస మవుతాయని ఐఏసీజీ హెచ్చరిస్తోంది. మన దేశంతోసహా 71 దేశాల్లో గణాంకాలు సేకరించి విశ్లేషిం చాక ఇందులో మూడోవంతు దేశాల్లో వ్యాధికారక క్రిములు మందులకు లొంగని రీతిలో తయా రయ్యాయని తేలిందని అంటోంది.

వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్న మన దేశంలో అసలు ఔషధాల వాడకం ఎలా ఉందో, అందులోని గుణదోషాలేమిటో ఆరా తీసే వ్యవస్థ సక్రమంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే. కొన్నేళ్లక్రితం ఏ మందులకూ లొంగని అత్యంత శక్తిమంతమైన కొత్త బ్యాక్టీరియా పుట్టు కొచ్చిందని కనుక్కున్నప్పుడు దానికి ‘న్యూఢిల్లీ సూపర్‌బగ్‌’ అని పేరుపెట్టారు. పేరు గురించిన వివాదం సంగతి పక్కనబెడితే ‘ఇ–కొలి’ అనే అసాధారణ బ్యాక్టీరియాలో కొత్త జన్యువు బయల్దేరి దాన్ని మొండి ఘటంగా మార్చిందని ఆ పరిశోధన ద్వారా కనుక్కున్నారు. అశాస్త్రీయంగా, విచ్చలవి డిగా మందులు మింగడం వల్లే ఈ ‘సూపర్‌బగ్‌’ పుట్టుకొచ్చిందని  నిర్ధారించారు. ఇన్‌ఫెక్షన్లు ఏర్ప డినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి నిర్దిష్టమైన మోతాదులో మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మోతాదు ఎక్కువైనా, తక్కువైనా రోగికి ముప్పు కలిగించడమే కాదు... ఆ రోగకారక క్రిమి మరింత శక్తి సంతరించుకుని చుట్టూ ఉన్న అనేకమందికి సోకుతుంది. అటుపై దాన్ని అరికట్టడం అసాధ్య మవుతుంది. అంటురోగాలను నివారించడానికి పెన్సిలిన్‌ కనుగొన్నప్పుడు అందరూ సంబరప డ్డారు. కానీ రెండు దశాబ్దాలు గడిచేసరికల్లా వ్యాధికారక బ్యాక్టీరియా పెన్సిలిన్‌ను తట్టుకునే విధంగా వృద్ధి చెందింది.

మన దేశంలో జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లకు వినియోగించే యాంటీ బయాటిక్‌ మందుల విక్రయాలపై ఎవరికీ అదుపు లేదు. వైద్యుల చీటీ ఉంటే తప్ప కొన్ని మందులు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించేవారుండరు. అది అమలవుతున్నదో లేదో చూసే వ్యవస్థ సక్రమంగా లేదు. జ్వరం, జలుబు, దగ్గు, అతిసార వంటి వైరస్‌ కారక జబ్బులకు చాలా సందర్భాల్లో అసలు యాంటీ బయాటిక్స్‌ అవసరమే ఉండదని, వాటంతటవే దారికొస్తా యని అంటారు. కానీ సరైన అవగాహన లేకపోవడం, శాస్త్రీయంగా ఆలోచించే ధోరణి కొరవడటం, వ్యాపార ప్రయోజనాలు ఇమిడి ఉండటం వగైరా కారణాల వల్ల వైద్యులు అయినదానికీ, కానిదా నికీ రోగులతో ఔషధాలు వాడిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరుగా ఇవ్వాల్సిన యాంటీ బయాటిక్స్‌ను మొదట్లోనే అంటగడుతున్నారు. ఈ సంగతిని రెండేళ్లక్రితం యునిసెఫ్‌ నివేదిక వెల్ల డించింది. సక్రమంగా మందులు వాడకపోవడం వల్ల లేదా మోతాదుకుమించి మింగడం వల్ల ఏటా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో లెక్కేసే విధానమే మన దేశంలో లేదు. కనుక దాన్ని అరికట్టడ మనే ఆలోచనే ఉండటం లేదు.

మెరుగైన, ప్రామాణికమైన వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పుడే ఔషధాల వాడకం ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. అదొక్కటే కాదు...దీనితో ముడిపడి ఉండే ఇతర సమస్యలపై సైతం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిశు భ్రమైన తాగునీటి లభ్యత, పారిశుద్ధ్యం అంతంతమాత్రం. వాటికి పౌష్టికాహారలోపం తోడవటంతో వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఎక్కువ. ఈ స్థితిలో జబ్బును అరికట్టడానికి అవసరమైన మోతాదులో మందుల వినియోగం కొరవడితే చెప్పేదేముంది? ఔషధ నిరోధకతను అరికట్టడానికి రెండేళ్లక్రితం భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. కానీ ఆచ రణలో అది సరిగా అమలు కావడం లేదు. కొన్ని ఔషధాలను నిషేధించడం, మరికొన్ని ఔషధాల విక్రయంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకున్నా అవి ఏమాత్రం చాలవన్నది ఐఏసీజీ భావన. ఔషధ నిరోధకత ఏ స్థాయిలో ఉన్నదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే  దాన్ని సంపూర్ణంగా అరికట్టడం సాధ్యమవుతుంది.

ఔషధ నిరోధకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇప్పటికే 7 లక్షలమంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకుంటుందని ఐఏసీజీ అంచనా వేస్తోంది. మన దేశంలో సగటున ప్రతి వేయిమందిలో రోజూ యాంటీబయాటిక్స్‌ వాడే అలవాటు 63 శాతం పెరిగిందని నిరుడు ఒక అధ్యయనం తెలియజేసింది. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తున్నదని వెల్లడైంది గనుక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే ప్రణాళికలు రచించి మందుల వినియోగంపై వైద్యులు, ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సుల వరకూ అందరికీ అవగాహన కలిగించాలి. విస్తృత ప్రచారోద్యమాన్ని నిర్వహించాలి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల తరహాలో జబ్బుపడినవారెవరికైనా నాణ్యమైన చికిత్స అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఔషధ నిరోధకత ముప్పునుంచి తప్పించుకోగలం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement