- ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటక శాఖ ఆందోళన
సాక్షి, బెంగళూరు : జ్వరం, జలుబు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు సైతం ప్రజలు మోతాదుకు మించి యాంటీ బయాటిక్స్‌ను వాడుతుండటంతో శరీరంలోని రోగనిరోధక శక్తి క్రమేపీ తగ్గుతూ వస్తోందని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధి డాక్టర్ వై.సి.యోగానందరెడ్డి మాట్లాడుతూ...ప్రస్తుతం చాలా మంది తమకు అవసరం ఉన్నా లేకున్నా అనేక రకాల యాంటీ బయాటిక్స్‌ను వాడుతున్నారని అన్నారు.
ఈ కారణంగా శరీరంలో సహజంగా ఏర్పడిన రోగనిరోధక శక్తి తగ్గుతూ వస్తోందని తెలిపారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో అసలు ఎలాంటి ఔషధం మనిషి దేహంపై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీబయాటిక్స్‌ను వాడడాన్ని ప్రజలు తగ్గించుకోవాలని, అందునా డాక్టర్ సలహా లేకుండా ఏ యాంటీ బయాటిక్స్‌ను వాడరాదని సూచించారు. ప్రస్తుతం మార్కెట్‌లో అవసరం లేని అనేక యాంటీ బయాటిక్స్ ప్రజలపై దుష్పరిణామాలను కనబరుస్తున్నాయని, వీటన్నింటిని నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.
యాంటీ బయాటిక్స్ వాడకంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహనను కల్పించేందుకు నేటి (ఆదివారం) నుంచి అక్టోబర్ 5 వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రముఖ డాక్టర్లు, మెడికల్ షాపుల యజమానులు ఈ అవగాహనా కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారని వెల్లడించారు.