immune
-
మా వ్యాక్సిన్ సేఫ్: సీరం ఇన్స్టిట్యూట్
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’ ట్రయల్స్‌లో పాల్గొన్న తనకు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై సీరం ఇన్స్టిట్యూట్ స్పందించింది. తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైనదని.. ఇమ్యూనోజెనిక్ అని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో తాము అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలను అనుసరిస్తున్నామని వెల్లడించింది. అన్ని రకాల జాగ్రత్తల తర్వాతే తాము ట్రయల్స్ నిర్వహించామన్నది. సదరు వలంటీర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. ‘వలంటీర్ అనారోగ్యం గురించి నోటీసులో పేర్కొన్న విషయాలు పూర్తిగా అవాస్తవం.. అసంబద్ధమైనవి. ప్రస్తుతం వలంటీర్ ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితికి, సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. వలంటీర్ అబద్దం చెప్తున్నాడు.. అతడి అనారోగ్య సమస్యలకు కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ని బ్లేమ్ చేస్తున్నాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. అబద్ధాలతో సంస్థ ప్రఖ్యాతిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు’ అని ప్రకటనలో పేర్కొంది. అంతేకాక సదరు వలంటీర్ ఆరోగ్య పరిస్థితిపై సీరం ఇన్స్టిట్యూట్ సానుభూతి వ్యక్తం చేసింది. వలంటీర్ ఆరోపణలపై ఆదివారమే స్పందించిన సీరం.. నేడు మరోసారి ప్రకటన విడుదల చేసింది. (చదవండి: 90%సామర్థ్యం ఉండాల్సిందే!) టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని సదరు వలంటీర్ ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. -
ఏటా 15 వేల మందికి..
గ్రేటర్లో పెరుగుతున్న టీబీ రోగులు ఒకప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఎయిడ్స్ రోగుల్లో మాత్రమే టీబీ లక్షణాలు కన్పించేవి. కానీ నేడు వాతావరణ కాలుష్యం.. చిన్న తనంలోనే స్మోకింగ్‌కు అలవాటు...విటమిన్ డి లోపం..వల్ల యుక్తవయసులోనే క్షయ వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గురువారం(మార్చి 24) ప్రపంచ టీబీ దినోత్సవంసందర్భంగా ప్రత్యేక కథనం... సిటీబ్యూరో ఓ వైపు నగరాన్ని స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వణికిస్తుండగా ఇప్పుడాస్థానాన్ని ట్యూబర్ క్యులోసిస్(టీబీ) ఆక్రమించింది. నగరంలో క్షయ మహమ్మారి తగ్గకపోగా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్లో ఏటా కొత్తగా సుమారు 15 వేల కొత్త కేసులు న మోదు అవుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్ష మందికిపైగా ఎయిడ్స్ రోగులు ఉండగా, వీరిలో మూడొంతుల మందికి టీబీ ఉన్నట్లు ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి వైద్యుల సర్వేలో వెల్లడైంది. గతేడాది హైదరాబాద్‌లో ఏడు వేలు, రంగారెడ్డి జిల్లాలో ఆరువేల కొత్త కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 41, రంగారెడ్డిలో 48 క్షయ నిర్ధారణ కేంద్రాలు ఉండగా, వీటిలో చాలా చోట్ల ల్యాబ్ టెక్నిషియన్లు లేరు. వ్యాధి నిర్ధారణకు కావాల్సిన ైవె ద్య పరికరాలు కూడా లేవు. ఒకరి నుంచి 15 మందికి.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొత్తగా తొమ్మిది మిలియన్ల మంది టీబీ బారిన పడుతున్నారు. ఈ బాధితుల్లో సుమారు 1/3 వంతు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే టీబీ ఎక్కువ ఉన్న దేశం మనదే. దేశంలో ప్రతి సెకనుకు ఒకరు టీబీ బారిన పడుతున్నారు. దేశంలో ఏటా మూడు లక్షల మంది టీబీతో చనిపోతున్నారు. ప్రతి రోగి తను చనిపోయే ముందు మరో 15 మందికి వ్యాపింపజేస్తున్నాడు. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి గాలిలోకి ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. ఇలా ఒకసారిగాలిలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా 18-20 గంటల పాటు జీవిస్తుంది. ప్రతి వ్యక్తికి టీబీ ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు బయట పడుతుంది. మనిషి శరీరంలో ఎంత కాలమైనా ఇది జీవిస్తుంది. శీతల గదిలో 8-10 రోజులు జీవిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుంది. లక్షణాలు గుర్తించవచ్చు ఇలా.. సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం. ఆకలి, బరువు తగ్గడం, నీరసంగా, ఆయాసం, ఛాతిలో నొప్పి ఉంటుంది. తెమడ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఆరు మాసాలు విధిగా మందులు వాడాలి.బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి. బలవర్థకమైన ప్రొటీన్ల(గుడ్లు, పప్పు, పాలు)తో కూడిన ఆహారం తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పృహ కలిగి ఉండాలి. - డాక్టర్ గోపికృష్ణ, పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి -
మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ వాడకంతో తగ్గుతున్న రోగ నిరోధక శక్తి
ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటక శాఖ ఆందోళన సాక్షి, బెంగళూరు : జ్వరం, జలుబు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు సైతం ప్రజలు మోతాదుకు మించి యాంటీ బయాటిక్స్‌ను వాడుతుండటంతో శరీరంలోని రోగనిరోధక శక్తి క్రమేపీ తగ్గుతూ వస్తోందని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధి డాక్టర్ వై.సి.యోగానందరెడ్డి మాట్లాడుతూ...ప్రస్తుతం చాలా మంది తమకు అవసరం ఉన్నా లేకున్నా అనేక రకాల యాంటీ బయాటిక్స్‌ను వాడుతున్నారని అన్నారు. ఈ కారణంగా శరీరంలో సహజంగా ఏర్పడిన రోగనిరోధక శక్తి తగ్గుతూ వస్తోందని తెలిపారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో అసలు ఎలాంటి ఔషధం మనిషి దేహంపై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీబయాటిక్స్‌ను వాడడాన్ని ప్రజలు తగ్గించుకోవాలని, అందునా డాక్టర్ సలహా లేకుండా ఏ యాంటీ బయాటిక్స్‌ను వాడరాదని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో అవసరం లేని అనేక యాంటీ బయాటిక్స్ ప్రజలపై దుష్పరిణామాలను కనబరుస్తున్నాయని, వీటన్నింటిని నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. యాంటీ బయాటిక్స్ వాడకంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహనను కల్పించేందుకు నేటి (ఆదివారం) నుంచి అక్టోబర్ 5 వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రముఖ డాక్టర్లు, మెడికల్ షాపుల యజమానులు ఈ అవగాహనా కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారని వెల్లడించారు.