ఏటా 15 వేల మందికి..
గ్రేటర్‌లో పెరుగుతున్న టీబీ రోగులు
ఒకప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఎయిడ్స్ రోగుల్లో మాత్రమే టీబీ లక్షణాలు కన్పించేవి. కానీ నేడు వాతావరణ కాలుష్యం.. చిన్న తనంలోనే స్మోకింగ్‌కు అలవాటు...విటమిన్ డి లోపం..వల్ల యుక్తవయసులోనే క్షయ వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గురువారం(మార్చి 24) ప్రపంచ టీబీ దినోత్సవంసందర్భంగా ప్రత్యేక కథనం...
సిటీబ్యూరో ఓ వైపు నగరాన్ని స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వణికిస్తుండగా ఇప్పుడాస్థానాన్ని ట్యూబర్ క్యులోసిస్(టీబీ) ఆక్రమించింది. నగరంలో క్షయ మహమ్మారి తగ్గకపోగా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో ఏటా కొత్తగా సుమారు 15 వేల కొత్త కేసులు న మోదు అవుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్ష మందికిపైగా ఎయిడ్స్ రోగులు ఉండగా, వీరిలో మూడొంతుల మందికి టీబీ ఉన్నట్లు ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి వైద్యుల సర్వేలో వెల్లడైంది. గతేడాది హైదరాబాద్‌లో ఏడు వేలు, రంగారెడ్డి జిల్లాలో ఆరువేల కొత్త కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 41, రంగారెడ్డిలో 48 క్షయ నిర్ధారణ కేంద్రాలు ఉండగా, వీటిలో చాలా చోట్ల ల్యాబ్ టెక్నిషియన్లు లేరు. వ్యాధి నిర్ధారణకు కావాల్సిన ైవె ద్య పరికరాలు కూడా లేవు.
ఒకరి నుంచి 15 మందికి..
ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొత్తగా తొమ్మిది మిలియన్ల మంది టీబీ బారిన పడుతున్నారు. ఈ బాధితుల్లో సుమారు 1/3 వంతు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే టీబీ ఎక్కువ ఉన్న దేశం మనదే. దేశంలో ప్రతి సెకనుకు ఒకరు టీబీ బారిన పడుతున్నారు. దేశంలో ఏటా మూడు లక్షల మంది టీబీతో చనిపోతున్నారు. ప్రతి రోగి తను చనిపోయే ముందు మరో 15 మందికి వ్యాపింపజేస్తున్నాడు. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి గాలిలోకి ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. ఇలా ఒకసారిగాలిలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా 18-20 గంటల పాటు జీవిస్తుంది. ప్రతి వ్యక్తికి టీబీ ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు బయట పడుతుంది. మనిషి శరీరంలో ఎంత కాలమైనా ఇది జీవిస్తుంది. శీతల గదిలో 8-10 రోజులు జీవిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుంది.
లక్షణాలు గుర్తించవచ్చు ఇలా..
సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం. ఆకలి, బరువు తగ్గడం, నీరసంగా, ఆయాసం, ఛాతిలో నొప్పి ఉంటుంది. తెమడ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఆరు మాసాలు విధిగా మందులు వాడాలి.బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి. బలవర్థకమైన ప్రొటీన్ల(గుడ్లు, పప్పు, పాలు)తో కూడిన ఆహారం తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పృహ కలిగి ఉండాలి.
- డాక్టర్ గోపికృష్ణ, పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి