కొంతమంది అదేపనిగా, చాలాకాలంగా సిగరెట్స్ తాగుతూనే ఉంటారు. పొగతాగడమన్నది కొద్దిగానైనా లేదా చాలా ఎక్కువగానైనా అది దేహం మీద దుష్ప్రభావం చూపుతూనే ఉంటుంది. స్మోకింగ్ దుష్ప్రభావం ఊపిరితిత్తుల మీద ఎక్కువని చాలామంది అనుకుంటుంటారు గానీ... ఈ అందమైన లోకాన్ని మనకు చూపించే కళ్ల మీద కూడా ఉంటుందని అనుకోరు. స్మోకింగ్ వల్ల కళ్ల మీద పడే దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. వాటి గురించి తెలుసుకొని, ఆ తర్వాత నుంచైనా పొగ తాగే అలవాటుకు దూరంగా ఉండడం కోసమే ఈ కథనం.
కొంతమంది చాలా కాలం నుంచి పొగతాగే అలవాటు కలిగి ఉంటారు. వీళ్లనే ‘క్రానిక్ స్మోకర్స్’ అంటారు. దీర్ఘకాలంగా పొగతాగడం వల్ల కంటికి వచ్చే సమస్యలు ఒకటి రెండూ కాదు సరికదా ఈ జాబితా చాలా పెద్దది.
కారణం: పొగాకులో దాదాపు 6,000కు పైగా హానికరమైన విషపదార్థాలు ఉంటాయి. సిగరెట్ కాల్చినప్పుడు వాటిల్లోని అత్యంత హానికరమైనవీ, క్యాన్సర్‌ను కలగజేసేవీ దాదాపు 69 విషపదార్థాల పొగ నేరుగా కంటికీ, ఒంటికీ తాకడం వల్ల అనేకానేక సమస్యలు వచ్చే అవకాశముంది. ఇందులో ఈ కింద ఉన్నవి ముఖ్యమైనవీ, కేవలం కొన్ని మాత్రమే.
అర్లీ క్యాటరాక్ట్ : కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ కంట్లో ఉండే లెన్స్... తమ పారదర్శకతను కోల్పోవడంతో క్యాటరాక్ట్ అనే సమస్య రావడం తెలిసిందే. పొగతాగేవారిలో ఇది చాలా త్వరగా వచ్చేస్తుంది.
టొబాకో ఆంబ్లోపియా : పొగాకులోని ‘నికోటిన్’ ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య వస్తుంది. ఇలా ఆంబ్లోపియా సమస్య వచ్చినవాళ్లలో కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని ఎదుటనున్న వారి క్లియర్ ఇమేజ్ స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఒక్కోసారి అది కేవలం ఓ స్కెచ్‌లాగానో లేదా నెగెటివ్ లాగానో కనిపించవచ్చు. ఎదుటి దృశ్యం నెగెటివ్‌లా కనిపించడాన్ని ఘోస్ట్ ఇమేజ్ అంటారు.
ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీ–జనరేషన్
ఈ సమస్యలో రెటీనా పొరలోని కీలక భాగమైన ‘మాక్యులా’ దెబ్బతింటుంది. దృష్టిజ్ఞానాన్ని ఇవ్వడంలో ఈ మాక్యులాది కీలక పాత్ర. పొగతాగడం వల్ల ఇది చాలా త్వరగా వస్తుంది.
ఆప్టిక్ న్యూరోపతి : మనందరి దృష్టిజ్ఞానానికి కారణమయ్యే అత్యంత సంక్లిష్టమైన నరం ‘ఆప్టిక్ నర్వ్’ అనే ఈ నరం దెబ్బతినడంతో వచ్చే సమస్యే ‘ఆప్టిక్ న్యూరోపతి’. విచక్షణ లేకుండా యాంటీబయాటిక్ మందులు, డ్రగ్స్, విషపదార్థాలు వాడటం దీనికి కారణం. సిగరెట్ పొగలోనూ ఉండేవి చాలా హానికారకవిషపదార్థాలతో ‘ఆప్టిక్ న్యూరోపతి’ వచ్చే అవకాశాలెక్కువ.
రెటినల్ ఇస్కీమియా : రెటీనాకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్ల వచ్చే వ్యాధి ఇది.
పొగతాగేవారిలో...
పొగలోని విషపదార్థాలు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్ కారణంగా రక్తకణాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా అన్ని కణాల్లో లాగే కంటి కణాలకూ పోషకాలూ, ఆక్సిజన్ అందక΄ోవడంతో ‘రెటినల్ ఇస్కీమియా’ వ్యాధి వచ్చి... అది అంధత్వానికి దారితీసే ప్రమాదం చాలా ఎక్కువ.
థైరాయిడ్ ఆఫ్తాల్మోపతి : థైరాయిడ్ ఐ డిసీజ్ అంటూ పిలిచే ఈ వ్యాధిని గ్రేవ్స్ ఆఫ్తాల్మోపతి అని కూడా అంటారు. సొంత వ్యాధి నిరోధక శక్తి తమ సొంత కణాలను దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ సమస్య అయిన ఇది... పొగతాగేవారిలో చాలా ఎక్కువ.
కార్నియల్ ఎపిథీలియల్ సమస్యలు : కంట్లో ఉండే నల్ల గుడ్డును కార్నియా అంటారు. చూపుజ్ఞానం కలిగించడంలో ఈ నల్లగుడ్డు భూమిక చాలా కీలకం. ఈ నల్లగుడ్డు మీద పారదర్శకమైన ఒక పైపొర ఉంటుంది. దాన్ని ‘ఎపిథీలియమ్’ అంటారు.
సిగరెట్ అంటించడం కోసం తరచూ అగ్గిపుల్ల లేదా లైటర్ వెలిగించినప్పుడు, ఆ మంట ప్రభావం కంటికీ ఎంతో కొంత తాకే అవకాశం ఉంటుంది. ఆ మంట మాటిమాటికీ అలా తగులుతుండటం లేదా వేడి సెగగానీ, సిగరెట్ పొగగానీ తరచూ తగులుతుండటంతో ఈ ‘ఎపిథీలియమ్’పొర దెబ్బతినడానికి అవకాశాలెక్కువ. ఎపిథీలియమ్ దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, కన్ను ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
΄పొగతాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు కేవలం ఊపిరితిత్తుల మీదనో లేదా క్యాన్సర్ల రూపంలోనో మాత్రమే కాకుండా ఇలా కంటి మీద కూడా పడటమే కాదు... ఏకంగా చూపును దూరం చేసే అవకాశమూ ఉన్నందువల్ల ఆ దురలవాటును తక్షణం మానేయాలి.
ఇవే కాకుండా గర్భవతుల్లో ఒకవేళ పోగతాగే అలవాటు ఉంటే కడుపులో ఉన్న చిన్నారికీ అనేక కంటి సమస్యలు రావచ్చు. ఉదాహరణకు కనుగుడ్లు నమ్మలేనంత చిన్నవిగా మారిపోయే ‘మైక్రో ఆఫ్తాల్మోస్’ అనే వ్యాధి, కళ్లు బాగా ఎర్రబారిపోవడమే కాకుండా కొందరిలో కనురెప్పలు బూడిద రంగులో కనిపించడం (గ్రేయిష్ అప్పియరెన్స్ ఆఫ్ ఐలిడ్స్) వంటి సమస్యలూ రావచ్చు.
లక్షణాలు: కంటి సమస్య వచ్చినవారిలో కళ్లు ఎర్రబారడం, కళ్లవాపు, మంటలు, కనుగుడ్లు చిన్నగా మారడం, చూపు సరిగా కనిపించక΄ోవడంతో ΄పాటు నెగెటివ్‌ను చూస్తున్నట్లుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఏజింగ్ ప్రక్రియతో కంటి చుట్టూ ముడతలు : ΄పొగతాగడం వల్ల కంటి చుట్టూ నల్లగా మారడం, వయసుతోపాటు వచ్చే ముడతల్లాగా (ఏజింక్ స్కిన్ ఫోల్డ్స్) రావడం కూడా ఎక్కువ. క్రానిక్ స్మోకర్స్‌లో పెదవులు కూడా నల్లగా, బండగా మారిపోతాయి.
చికిత్స : పొగతాగడం వల్ల వచ్చిన ఏ కంటి సమస్య అయినప్పటికీ, చూపులో ఏదైనా తేడా కనిపించిన వెంటనే కంటి వైద్యనిపుణులకు చూపించడం అవసరం. లేకపోతే అది అంధత్వానికి దారితీసే ప్రమాదమూ లేక΄ోలేదు. అందుకే డాక్టర్‌కు చూపిస్తే... వచ్చిన సమస్యను బట్టి కంటికి అవసరమైన వైద్యచికిత్స అందిస్తారు. కొందరికి అవసరాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ (అందునా మరీ ముఖ్యంగా బి1, బి2, బి12, బి6 వంటి విటమిన్లు) ఇస్తూ సమస్యను చక్కబరిచేందుకు ప్రయత్నిస్తారు.
డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment