ఆ మందులతో ఏటా 23,000 మంది మృతి!
వాషింగ్టన్: అవసరానికి మించి యాంటీబయాటిక్స్ వాడితే కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకే మోతాదుకు మించి యాంటీ బయాటిక్స్ వాడటం మూలంగా భవిష్యత్తులో సంభవించే తీవ్రమైన రోగాలపై కూడా అవి ప్రభావం చూపలేవు. అయితే అమెరికా వైద్యులు మాత్రం.. తమ పేషెంట్లకు సూచిస్తున్న యాంటీబయాటిక్స్లో 30 శాతానికి పైగా అవసరం లేనివేనట. డాక్టర్లు సూచిస్తున్న ఈ మోతాదుకు మించిన యాంటీ బయాటిక్స్ వాడకం మూలంగా ఏటా 20 లక్షల మంది యాంటీబయాటిక్స్ కు లొంగని ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సంస్థ నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. అంతే కాదు డాక్టర్ల ఈ నిర్వాకం మూలంగా ఏటా 23,000 మృత్యువాతపడుతున్నారని సీడీసీ వెల్లడించింది.
డాక్టర్లు రాసిన సుమారు 1,80,000 ప్రిస్క్రిప్షన్లను పరిశీలించి సీడీసీ తన ఫలితాలను వెలువరించింది. సైనసైటిస్, చెవి ఇన్ఫెక్షన్లు, గొంతు ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సూచిస్తున్న మందుల్లో మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. శ్వాసకోశ వ్యాదులకు సంబంధించి డాక్టర్లు సూచిస్తున్న యాంటీబయాటిక్స్లో 50 శాతం అసలు అవసరమే లేదని సీడీసీ తెలిపింది. ముఖ్యంగా ఔట్ పేషంట్లకు సూచిస్తున్న ఓరల్ యాంటీబయాటిక్స్లో 30 శాతం అక్కర్లేనివేనని తెలిపింది. మోతాదుకు మించి వీటిని వాడటం ద్వారా కలిగే దుష్ఫలితాలను గురించి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరముందని సీడీసీ అభిప్రాయపడింది.