కంకిపాడుకు చెందిన రామారావు(పేరుమార్చాం)కు 45 ఏళ్లు.. వ్యవసాయ కూలీపనులకు వెళ్లే ఆయన నిత్యం సాయంత్రం ఒళ్లు నొప్పులు రావడంతో మందుల షాపుకు వెళ్లి నొప్పుల బిళ్లలు తీసుకుని వేసుకునే వాడు. ఇలా రెండేళ్లు గడిచే సరికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. ప్రస్తుతం అంపశయ్యపై ఉన్న వెంకటేష్ వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు...
నగరానికి చెందిన రమేష్‌కు పళ్ల ఇన్‌ఫెక్షన్ ఉండటంతో తరచూ యాంటీ బయోటిక్స్ వాడుతుంటాడు. వైద్యుని సూచనపై కాకుండా మందుల షాపుల్లో ఇచ్చేవి తీసుకుని వాడుతుండటంతో క్రమేపీ అతని శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి, వ్యాధులు సోకడం ప్రారంభించాయి. ప్రస్తుతం మందులు సైతం పనిచేయని స్థితికి చేరుకున్నాడు.
ఇలా వెంకటేష్.. రమేష్‌లే కాదు.. సమాజంలో చాలామంది విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్, యాంటిబయోటిక్స్ వాడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. చిన్న సమస్యలకు మితిమీరిన మందులు వాడకంతో.. తెలియకుండానే వారి అవయవాలు పూర్తిస్థాయిలో దెబ్బతింటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిని గుర్తించి అవగాహన కలిగించేందుకు నిర్ణయించింది.
లబ్బీపేట(విజయవాడ తూర్పు): అవసరం లేకున్నా తరచూ మందులు వాడుతుండటంతో అనేక మంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అధికంగా మందుల వినియోగం వలన ఎముకలోని మూలిగ(బోన్ మ్యారో)పై ప్రభావం చూపి ఒక్కో సమయంలో రక్తహీనత, ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదనే నిబంధన ఉన్నా.. దానిని పాటించక పోవడం వల్లే విచ్చలవిడి వినియోగం పెరిగినట్లు అభిప్రాయపడుతున్నారు. కిడ్నీ, గుండె, లివర్ వ్యాధులతో పాటు, ఒక్కోసారి నరాలు, మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో మందుల వినియోగం వల్ల పెరుగుతున్న వ్యాధులను నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. మందుల వాడకంపై అవగాహన కలిగించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని కొద్దికాలం కిందట ఫార్మశీ కౌన్సిల్స్‌ను ఆదేశించింది.
యాంటిబయోటిక్స్‌తో అనర్థమే..
పెన్సిలిన్ వంటి యాంటి బయోటిక్స్ వైద్యరంగంలో ఒక సంచలనంగా మిగిలిపోయింది. ఎంతో మందిని ప్రాణాంతక వ్యాధుల నుంచి విముక్తి కలిగించింది. అయితే ఆ తర్వాత క్రమేణా మార్కెట్‌లోకి యాంటిబయోటిక్స్ ప్రవేశం పెరగడంతో చిన్న సమస్యకు వాటిని వాడటం ప్రారంభమైంది. దీంతో శరీరంలో యాంటి డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి. ప్రాణాంతక వ్యాధులు సోకిన సమయంలో మందులు పనిచేయని పరిస్థితులు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వినియోగం ఇలా ఉండాలి..
యాంటిబయోటిక్స్‌కు సంబంధించి వ్యాధిని బట్టి వైద్యుల సూచన మేరకు సూటబుల్ మందులు వాడాల్సి ఉందంటున్నారు. మన శరీరంలో కొన్ని వేల బ్యాక్టీరియాలు ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన సమయంలో అవి ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో జన్యుపరమైన కారణాలతో కొన్ని రకాల మందులు పడవని, వాటిని గమనించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఉదాహరణకు పెయిన్‌కిల్లర్ ‘బ్రూఫెన్’ అందరికీ పడదని చెబుతున్నారు. ఇలా అనేక రకాల మందులు వైద్యుల సూచన లేకుండా వాడటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారంటున్నారు.
జలుబుకూ వాడేస్తున్నారు..
జలుబు.. వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల వస్తుంది. దీనికి ఎలాంటి యాంటిబయోటిక్స్ అవసరం లేదు. కానీ దీనికి కూడా యాంటిబయోటిక్స్‌తో పాటు, కొందరు స్టిరాయిడ్స్ కూడా వాడుతున్నారు. పొడిదగ్గుకు యాంటి బయోటిక్స్ వాడనవరం లేదు.. వీటిని ఎప్పుడూ లోయర్ టు హయ్యర్‌కు వెళ్లాలి. కానీ ప్రజలు ఒకేసారి వ్యాధి తగ్గిపోవాలనే ఉద్ధేశంతో హయర్ వాడేస్తున్నారు. బాక్టీరియాను బట్టి యాంటిబయోటిక్స్ వాడాలి. దానిని నిపుణులు మాత్రమే గుర్తించగలుగుతారు. వీటి వినియోగంపై తమశాఖ ఆధ్వర్యంలో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.– డాక్టర్ బాలు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్,ఫార్మకాలజీ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment