2019 లోక్‌సభ ఎన్నికలు పార్టీల ముఖచిత్రాన్ని మారుస్తున్నాయా? బీజేపీ హిందుత్వ వాదానికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాలు మారుస్తోందా? ఎన్నికల రాష్ట్రాల్లో రాహుల్ గుళ్లు, గోపురాలకు అందుకే వెళుతున్నారా? రామ మందిర సమస్యను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందా? అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీ అతివాద హిందుత్వ వాదానికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహం సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. ప్రధానంగా హిందూ ఓటర్లు ఆకట్టుకునేందుకు హిందూ అనుకూల వాతావరణం సృష్టించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో హిందూభావజాలాన్ని ప్రతిబింబించేలా వ్యూహాలను కాంగ్రెస్ అనుసరిస్తోంది.
రాహుల్ వ్యూహాలు
రాహుల్ గాంధీ హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ మీడియా స్ట్రాటజీ సెల్ స్పష్టం చేస్తోంది. రాహుల్ గాంధీ ఏదైనా యాత్ర ఆరంభించేముందు ఆ ప్రాంతంలోని ప్రముఖ దేవాలయాన్ని సందర్శించేలా ప్రణాళిక రూపొందించుకున్నారని మీడియా స్ట్రాటజీ సెల్ చెబుతోంది. గుజరాత్ పర్యటన సమయంలో రాహుల్ గాంధీ పలు ఆలయాల సందర్శన అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యాఖ్యలపై జాగ్రత్తలు
కొంతకాలంగా హిందూ ఓటర్లను ఒకవైపు ఆకర్షించేలా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. ముఖ్యంగా హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై ఆచితూచి జాగ్రత్తగా స్పందించాలని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా ఢిల్లీలో బాణాసంచాపై సుప్రీం నిషేధం విధించిన సమయంలో.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం అని విశ్లేషకలు చెబుతున్నారు. రాముడు వనవాసాన్ని పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు వచ్చిన సందర్భంలో ప్రజలు ఆనందంగా బాణాసంచా కాలుస్తారు.. ఇది ఆచారం.. అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూర్జేవాలా వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా గుర్తు చేసుకోవాలి.
ఏకే అంటోనీ రిపోర్ట్
2014 లోక్‌సభ ఎన్నికల అవమానకర ఫలితాలపై మాజీ రక్షణశాఖ మంత్రి ఏకే అంటోనీ కాంగ్రెస్ పార్టీకి ఒక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో ఆయన మైనారిటీలను బుజ్జగించే పనిలో.. మెజారిటీ ఓటర్లను పార్టీ దూరం చేసుకుందన్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాక దేశంలోని మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మైనారిటీ అనుకూల పార్టీగా గుర్తించడంతోనే 2014 ఎన్నికల్లో దారుణ ఫలితం వచ్చినట్లు అంటోని నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది.
యూపీ తీర్పు
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను కూడా విశ్లేషించుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీ హిందూ సానుకూల ధోరణితో ముందుకు వెళ్లాలని నిర్ణయించుంది. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో.. మైనారిటీలు ఈ రెండు పార్టీలవైపు నిలిచారు. అదే సమయంలో మెజారిటీ ఓటర్లు బీజేపీకి అండగా నిలవడంతో.. దారుణ ఫలితాలు వచ్చాయి.
2014, యూపీ ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. మెజారిటీ హిందూ ఓటర్లను ఆకర్షించగలిగితేనే.. 2019లో పార్టీకి మెరుగైన స్థానాలు లభిస్తాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment