మజ్లిస్ పార్టీపై శివసేన సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మజ్లిస్ పార్టీ పైనా ...ఆ పార్టీ అధినేతలు ఒవైసీ సోదరుల పైనా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. ఒవైసీ సోదరులిద్దరూ ఛాందస వాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఉద్ధవ్ విమర్శించారు. దేశ వ్యాప్తంగా ముస్లింలో మనసుల్లో ఒవైసీ సోదరులు విషబీజాలు నాటుతున్నారని ఆయన మండి పడ్డారు. మహారాష్ట్రలోని నాందెడ్ మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో ఆరంగేట్రం చేసిన మజ్లిస్ పార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రంలో బోణీ కొట్టింది.
రెండు స్థానాల్లో మజ్లిస్ విజయ బావుటా ఎగరేసింది.మరో 14 నియోజక వర్గాల్లో రెండు..మూడు స్థానాల్లో నిలిచి తన ఉనికి చాటుకుంది. మజ్లిస్ బలోపేతం కావడం రాజకీయంగా తమకు నష్టమేనని భావిస్తోన్న ఉద్ధవ్ థాకరే... మజ్లిస్పై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. మజ్లిస్ పార్టీని నిషేధించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణీతి షిండే డిమాండ్ చేశారంటోన్న ఉద్ధవ్..ప్రజలంతా ఆమె డిమాండ్ కు మద్దతు పలకాలని పిలుపు నిచ్చారు. హిందువులకు అత్యంత ప్రమాదకరమైన శక్తులు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో తలలు పైకెత్తాయని ఉద్ధవ్ థాకరే మజ్లిస్ విజయాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.