నాంపల్లిలో జరిగిన సమావేశంలో అభివాదం చేస్తున్న అమిత్ షా. చిత్రంలో లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కొడుకునో, బిడ్డనో సీఎం చేసేందుకు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రధాని మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే అభద్రతా భావంతోనే కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కానీ.. కేసీఆర్ ఆశలు నెరవేరవన్నారు. తెలంగాణలో బీజేపీ రాజకీయ శక్తిగా ఎదగబోతోందని.. ఇందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, భువనగిరి, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాల బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కుటుంబం కోసం కేసీఆర్ పని చేస్తే, బీజేపీ దేశం కోసం పని చేస్తోందన్నారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారానికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని షా ప్రశ్నించారు.
కార్యకర్తలే మన బలం
11 కోట్ల మంది కార్యకర్తలతో ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి ప్రధానితోపాటు 15 మంది సీఎంలు ఉన్నారని అమిత్ షా గుర్తుచేశారు. అయితే కేరళ, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ గెలిస్తేనే సంపూర్ణ విజయం సాధించినట్లు అవుతుందని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఒవైసీని సంతృప్తి పరిచేందుకే తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించడం లేదని టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక 2019 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించుకుందామన్నారు. బూత్ స్థాయిలో చేయాల్సిన 23 పనులను 15 రోజుల్లో చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తామన్నారు. కార్యకర్తల శ్రమతోనే బీజేపీ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. 1% ఓటింగ్ కూడా లేని మణిపూర్‌లో అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. ‘అస్సాం, త్రిపుర, మణిపూర్ కన్నా ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. అక్కడే గెలిచాం. ఇక్కడ గెలవలేమా?’ అని అమిత్ షా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో మైనారిటీలకు 12% రిజర్వేషన్లు ఇస్తే బీసీలు, దళితులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి వ్యతిరేకమన్నారు.
కేసీఆర్ వాస్తవాలు మాట్లాడు
యూపీఏ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 13వ ఆర్థిక సంఘం ద్వారా తెలంగాణకు రూ.16,500 కోట్లు ఇస్తే.. మోదీ ప్రభుత్వంలో 14వ ఆర్థిక సంఘం రూ.1,15,105 కోట్లు ఇచ్చిందన్నారు. వాటికి అదనంగా సర్వశిక్షా అభియాన్ తదితర పథకాల కింద మొత్తంగా తెలంగాణకు కేంద్రం రూ.2.30 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ‘కేసీఆర్ వాస్తవాలు మాట్లాడు. తెలంగాణపై మోదీ వివక్ష చూపుతున్నారంటూ అబద్ధాలు చెబుతున్నావ్. ముందు.. కేంద్రం ఇచ్చిన నిధులను దేనికి ఖర్చుచేశారో చెప్పాలి’ అని షా డిమాండ్ చేశారు. రోడ్ల నిర్మాణానికే రూ.40 వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం ఇచ్చిందన్నారు.
‘ప్రధాన మంత్రికి పేరు వస్తుందనే కారణంతోనే.. పేదవాడికి రూ. 5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించే ‘ఆయుష్మాన్ భారత్’ బీమా పథకాన్ని రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేయడం లేదు. ఇంతకంటే మరో అన్యాయం ఉంటుందా? ఉజ్వల పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. రాష్ట్రంలో పేదలకు, రైతులకు అందాల్సిన కేంద్ర పథకాలను దూరం చేస్తున్నారు. కేసీఆర్ మావన హక్కులను హరిస్తున్నారన్నారు’ అని షా ఆరోపించారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు అక్రమంగా నివాసం ఉంటు న్నా.. కేసీఆర్ వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు.
బీజేపీతోనే సుపరిపాలన: లక్ష్మణ్
తెలంగాణకు బీజేపీ మాత్రమే సుపరిపాలన అందిం చగలుగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో.. నియంతృత్వ కుటుంబ పరి పాలనను ప్రజలు చూశారని.. వాటి నుంచి విముక్తి కోసం, మార్పు కోసం బీజేపీకి అధికారం ఇవ్వాలన్నారు. పోలింగ్ బూత్‌లో గెలుపే.. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో గెలుపునకు పునాది వేస్తుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇన్‌చార్జీగా వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. కాగా, అమిత్ షా సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ నేత దిలీప్ ఆచారి, కొత్తగూడెం ప్రజారాజ్యం మాజీ నేత కుంచె రంగా కిరణ్ బీజేపీలో చేరారు.
హిందుత్వ అజెండాతోనే ముందుకు
అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ అజెండాతోనే ముందుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రాత్రి.. 119 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇంచార్జీలతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment