బుధవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న అమిత్‌షా
కేసీఆర్.. తెలంగాణలో తిరిగి అధికారం లభిస్తే దళితుడు లేదా ఆదివాసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించగలవా?. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానన్న కేసీఆర్... మాటతప్పి ఆయనే సీఎం కుర్చీపై కూర్చున్నారు. ప్రధాని మోదీ ప్రభంజనానికి భయపడి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు ఆయనకు కూతురు, కొడుకు భవిష్యత్తు కనిపిస్తోంది. కొడుకును సీఎం చేద్దామనుకుంటున్నారు. మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ కూటమి కట్టి ఓట్ల కోసం వస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలి.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/యాదాద్రి : ‘తెలంగాణలో తిరిగి అధికారం లభిస్తే దళితుడు లేదా ఆదివాసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించగలవా?’అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానన్న కేసీఆర్... మాటతప్పి ఆయనే సీఎం కుర్చీపై కూర్చున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభంజనానికి భయపడి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆయనకు కూతురు, కొడుకు భవిష్యత్తు కనిపిస్తోందని, కొడుకును సీఎం చేద్దామనుకుంటున్నారని ధ్వజమెత్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీపైనా అమిత్ షా విరుచుకుప డ్డారు. మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రె స్ కూటమి కట్టి ఓట్ల కోసం వస్తోందని, ఆ పార్టీలు టీఆర్‌ఎస్‌కు ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాలేవని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ పట్టణంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి శివారులో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించారు. అమిత్ షా ప్రసంగం ఆయన మాటల్లోనే...
ఆదిలాబాద్ సభలో...
ఆదిలాబాద్‌కిచ్చిన వాగ్దానాల అమలేదీ?
ఆదిలాబాద్‌లో 350 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మిస్తానన్న కేసీఆర్ వాగ్దానం ఏమైంది? అలాగే స్థానికంగా 18 చెరువులు, కుంటలు తవ్విస్తానన్న కేసీఆర్ కనీసం మట్టిని కూడా తవ్వలేదు. ఆదిలాబాద్ టౌన్ హాలు నిర్మాణం ఏమైందో టీఆర్‌ఎస్ అభ్యర్థి (మంత్రి జోగు రామన్నను ఉద్దేశించి) సమాధానం చెప్పాలి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం హామీ అమలు కాలేదు. చివరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదల చేసిన నిధులు కూడా ఖర్చు చేయలేదు. స్థానిక ఆదివాసీల కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన కేసీఆర్ కనీసం రూ. 8 కోట్లు కూడా ఖర్చు చేయలేదు.
కేసీఆర్‌కు మోదీ భయం...
కేంద్రంలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అమలు కాకుండా కేసీఆర్ మోకాలడ్డుతున్నారు. ఆ పథకాలను అమలు చేస్తే రాష్ట్రంలో మోదీ ప్రతిష్ట పెరుగుతుందని కేసీఆర్ భయం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలో ఒక్క ఇంటి నిర్మాణం జరగలేదు. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో 1,18,396 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణను కేసీఆర్ చేర్చలేదు. దీనివల్ల పేద కుటుంబాలు ఏటా రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య సేవలను కోల్పోయారు. తెలంగాణ ప్రజలకు నష్టం జరగడానికి కారణం కేసీఆరే. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 16 వేల కోట్లు ఇస్తే మోదీ ప్రభుత్వం రూ. 2.30 లక్షల కోట్లు ఇచ్చింది.
ముస్లింలను సంతృప్తిపరిచేందుకు
కేసీఆర్, రాహుల్ పోటాపోటీ...
ముస్లింలను సంతృప్తిపరచడంలో కేసీఆర్ పోటీ పడుతున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు గిరిజనుల కోటాకు కోత పెట్టారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఏకంగా పార్లమెంటులో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మైనారిటీల కోసం ప్రత్యేక ఐటీ కారిడార్ కావాలంటున్నారు. కేసీఆర్‌కన్నా రాహుల్ గాంధీ నాలుగడుగులు ముందుకెళ్లిపోయారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు. విదేశాలకు వెళ్లే మైనారిటీ విద్యార్థులకు రూ. 20 లక్షల స్కాలర్‌షిప్, మైనారిటీలకు ప్రత్యేక ఆసుపత్రులు, మసీదులు, చర్చిలకు ఉచిత విద్యుత్ ఇచ్చి దేవాలయాలను విస్మరించారు. ఉర్ధూ రాకపోతే తెలంగాణలో టీచర్ కాలేని పరిస్థితి ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. దేశ ఆర్థిక వనరులపై మైనారిటీలకే మొదటి హక్కు అని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అంటే మోదీ మాత్రం బడుగు, బలహీన వర్గాల హక్కుగా అభివర్ణించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య తేడా ఇదే.
గెలిపిస్తే ఆకుపచ్చ ఆదిలాబాద్ చేస్తాం..
బీజేపీని గెలిపిస్తే అటవీ సంపదను మాఫియా నుంచి రక్షించి ఆకుపచ్చ ఆదిలాబాద్‌గా చేస్తాం. గుడిసెల్లో నివసించే వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తాం. దక్షిణాదికి అవసరమైన వస్త్రాలను అందించేంత పత్తిని పండిస్తున్న ఆదిలాబాద్ రైతులకు కిలోల చొప్పున పత్తికి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయిస్తాం. ఆదిలాబాద్‌లో సిమెంటు ఫ్యాక్టరీ (సీసీఐ)ని పునరుద్ధరిస్తాం. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌ను గెలిపించాలని కోరుతున్నా. ఎంఐఎంను ఢీకొనేది
బీజేపీయే...
తెలంగాణ ముఖ్యమంత్రి సహా ఎవరైనా మా ఎదుట తల వంచాల్సిందేనని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి గెలిపిస్తే ఎంఐఎం కళ్లలో కళ్లుపెట్టి చూసే రీతిలో పాలన సాగిస్తాం. ఎంఐఎంకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ లొంగిపోయాయి. ఒవైసీకి భయపడి కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపట్లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ఊరూరా, గడపగడపన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుతాం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కుమురం భీం వంటి వారు లేకపోతే నా లాంటి వారికి ఆదిలాబాద్ రావడానికి పాస్‌పోర్టు అవసరమయ్యేది. కేసీఆర్‌తోపాటు రాహుల్‌గాంధీ, కోదండరాం, కమ్యూనిస్టుల వల్ల ఎంఐఎం విముక్తి సాధ్యంకాదు.
చౌటుప్పల్ సభలో...
తెలుగువారిని కాంగ్రెస్ అవమానించింది..
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలే. ఇరు పార్టీలు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాయి. వాజ్‌పేయెహయాంలో గొడవలేవీ లేకుండా ఛత్తీస్‌గడ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో తెలుగు వారిని అవమానించింది. తెలంగాణకు చెందిన దళిత ముఖ్యమంత్రి టి. అంజయ్యను నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అవమానించారు. ప్రధానిగా పని చేసిన పీవీ నర్సింహారావు పార్థివదేహాన్ని పార్టీ కార్యాలయంలోకి అనుమతించకపోగా కనీసం నివాళులు కూడా అర్పించకుండా విమానంలో హైదరాబాద్‌కు పంపి అవమానించారు. మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ కూటమి కట్టి ఓట్ల కోసం వస్తోంది. కాంగ్రెస్‌కు దేశంలో, కమ్యూనిస్టులకు ప్రపంచంలోనే కనుమరుగయ్యే దశ నెలకొంది. ఆ పార్టీలు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాలేవు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ రూ. 2.5 లక్షల కోట్లు అప్పుల భారాన్ని ప్రజలపై మోపింది.
టీఆర్‌ఎస్ పాలనలో 4,500 మంది రెతుల ఆత్మహత్య...
కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. టీఆర్‌ఎస్ పాలనలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 131 మంది రైతులు చనిపోతే కనీసం వారి కుటుంబాలను కేసీఆర్ పలకరించిన పాపాన పోలేదు. నల్లగొండలో ఫ్లోరైడ్ భూతం వల్ల యువకులు, పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. బీజేపీని గెలిపిస్తే నల్లగొండను అభివృద్ధి చేస్తాం. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మునుగోడు అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నా. కాగా, ఆదిలాబాద్ సభలో కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేపీ అభ్యర్థులు సట్ల అశోక్, మాడవి రాజు, కొయ్యల ఏమాజీ, ఆత్మారాం నాయక్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ సభలో వెదిరె శ్రీరాం, నూకల నర్సింహారెడ్డి, చింతా సాంబమూర్తి, జిట్టా బాలకృష్ణారెడ్డి, రామోజు షణ్ముఖ, రఘునాథరావు, కాసర్ల లింగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment