undemocratic
-
జియా ఉల్ హక్ హయాం.. మోదీ పాలన ఒక్కటే
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనసుల్ని విషపూరితం చేస్తూ మోదీ సర్కార్ అప్రజాస్వామికంగా పాలిస్తోందని మెహబూబా ఆగ్రహం వ్యక్తంచేశారు. పాకిస్తాన్లో ఒకప్పటి సైనిక నియంత జనరల్ ముహమ్మద్ జియా ఉల్ హక్ పాలనా.. మోదీ సర్కార్ పరిపాలనా ఒక్కటే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి హోదాను తొలగించిన మోదీ సర్కార్‌పై జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా పోరాడాలని మెహబూబా పిలుపునిచ్చారు. బుధవారం ఆమె జమ్మూలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ‘ పాక్‌లో ఒక శ్రీలంక జాతీయుడిని అమానుషంగా కొట్టి చంపేస్తే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెంటనే స్పందించి కఠిన చర్యలకు పూనుకున్నారు. కానీ, భారత్‌లో మూకదాడికి పాల్పడి ప్రాణాలను హరిస్తున్న వారికి పూలదండలతో సత్కరిస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగా న్ని ఖూనీ చేస్తున్నారు. నాటి జియా ఉల్ హక్ పాలనకు, నేటి మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు తేడా ఏముంది? రెండూ ఒక్కటే’ అని మెహబూబా అన్నారు. ‘ భారత్‌ను, ముస్లింలను విడదీస్తున్నారని నాడు పాక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాపై అందరూ పగతో రగలిపోయారు. ఇప్పుడు భారత్‌లో ఎందరో జిన్నాలు ఉద్భవించారు. వారంతా భారతస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని పార్టీకి చెందిన వారే’ అని బీజేపీని మెహబూబా పరోక్షంగా విమర్శించారు. -
బలవంతపు భూసేకరణను నిలిపివెయ్యాలి
-
ఉపఎన్నికలు వచ్చే అవకాశాల్లేవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి సొంత నియోజకవర్గం లోనే ప్రజలు బీజేపీని ఓడించారన్న విషయా న్ని సీఎం కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రస్తు తం అసెంబ్లీ నడిచే తీరును చూసి బాధపడుతున్నానన్నారు. గతంలో అసెంబ్లీ ఎంతో హుం దాగా నడిచేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తానేం చేయలేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తానేమీ చేయకపోతే ఆయన తన ఇంటికి ఎందుకొచ్చా రని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏర్పా టు చేసి ఉండకపోతే కేసీఆర్ సీఎం హోదాలో మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించారు. తిట్టడం మానుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. ఐడీపీఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థలనూ కేసీఆరే తీసుకువచ్చారా అని ప్ర శ్నించారు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశాలను కొట్టిపారేశారు. రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతా తాను కేసీఆర్ లాంటి వాడిని కాదని, మానవతావాదిగా, రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతానని అన్నారు. నాలుగేళ్లపాటు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నా ప్రభుత్వంలో వివేచన కనిపించ డం లేదని, అసెంబ్లీలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో కి రావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం లో మీడియాపై ఆంక్షలు ఉండబోవన్నారు. -
రైతు సమితుల ఏర్పాటు అప్రజాస్వామికం
-
రైతు సమితుల ఏర్పాటు అప్రజాస్వామికం
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: తెలంగాణలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయటం అప్రజాస్వామికమని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని జీవో నంబర్ 39 దెబ్బతీస్తుందన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు అధికారాలను కల్పిస్తూ తెచ్చిన రాజ్యాంగంలోని 73, 74 సవరణలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆరోపించారు. సమన్వయ సమితులు అధికార పార్టీ పెత్తనానికి వేదికగా ఉపయోగపడతాయన్నారు. రైతు సమన్వయ కమిటీలను రద్దు చేసే వరకు ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. -
ఇదేమి రాజ్యం!
ఇంత అప్రజాస్వామికమా.. - యథేచ్ఛగా అధికారపార్టీ అణచివేత చర్యలు - మిథున్‌రెడ్డి అరెస్టుపై చర్చ జరుగుతుండగానే మరో ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్టులు - రైతుల తరఫున ధర్నా చేయడమే నేరమా? - నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు.. - ప్రశ్నించిన కార్యకర్తలపై లాఠీచార్జీ.. పలువురికి గాయాలు - సమైక్యాంధ్ర ఉద్యమ కేసు వెలికితీసి ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎక్కడున్నాం మనం..? ప్రజాస్వామ్యంలోనేనా? లేక ఇదేమన్నా రాజరిక వ్యవస్థా..? ఇంత నిరంకుశత్వమా..? ప్రశ్నించడాన్ని సహించలేకపోతే ఎలా? ప్రజల తరఫున పోరాడటమే నేరమా? ఎడాపెడా కేసులు బనాయిస్తూ.. పాత కేసులను తవ్వితీస్తూ ఒక పార్టీ లక్ష్యంగా యథేచ్ఛగా సాగుతున్న అణచివేత చర్యలు చూసి రాష్ర్టం నివ్వెరపోతోంది. నిజాలకు పాతరేసి, అక్రమంగా కేసు బనాయించి వైఎస్సార్‌కాంగ్రెస్ ఎంపీని అరెస్టు చేయడంపై ప్రజాస్వామికవాదులంతా ఒకపక్క నిరసన వ్యక్తం చేస్తుండగానే కవ్వింపు చర్యలా అన్నట్లుగా ఆ పార్టీకే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. రైతుల కోసం ధర్నా చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నాలుగు రోజుల తర్వాత తహశీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు మోపారు. ఆ అక్రమకేసుపై ధర్నా చేయడానికి ఉపక్రమించిన ఎమ్మెల్యేని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరెస్టును ప్రశ్నించిన కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీచార్జీ చేశారు. ఇంకోవైపు 2009 నాటి సమైక్యాంధ్ర ఉద్యమ కేసు బూజు దులిపి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కటకటాల వెనక్కి నెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమ కేసులన్నిటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను అణచివేయడానికి గాను ఆ కేసులను తిరగదోడేందుకు ప్రయత్నించడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీ నాయకులను, ప్రజల తరఫున ఆందోళనలు చేసే వారిని అణగదొక్కేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ అధికారపార్టీ వదులుకోదని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అన్ని హామీలలానే సమైక్యాంధ్ర ఉద్యమం నాటి కేసులన్నిటినీ మాఫీ చేస్తానన్న మాట కూడా ముఖ్యమంత్రి అటకెక్కించినట్లు కనిపిస్తోందని విమర్శకులంటున్నారు. ఇది ఉద్యమకారులను అవమానించడమేనని వారు పేర్కొంటున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ రాష్ర్టవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో రాష్ర్టప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం నిస్సందేహంగా కవ్వింపు చర్యేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టువంటివని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటి నిరంకుశవైఖరి గత ప్రభుత్వాలలో ఎన్నడూ ఎరగమని పరిశీలకులంటున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే ఇక తమ పరిస్థితి ఏమిటని సామాన్యులు సైతం భయపడే పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారు ఇంతటి అసహనం, నిరంకుశ వైఖరితో ఉండడం సరికాదని ప్రగతిశీలవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనేపథ్యంలో సోమవారంనాడు రాష్ర్టవ్యాప్తంగా సంచలనం కలిగించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల అరెస్టుల ఉదంతాలను పరిశీలిద్దాం... అక్రమ కేసు... ఆపై అరెస్టు... గోపిరెడ్డి వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహం నరసరావుపేట రూరల్: గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సోమవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. తనపై అక్రమకేసు బనాయించడాన్ని నిరసిస్తూ ధర్నా చేసేందుకు వెళుతుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై మోపిన కేసు వివరాలేమిటంటే.. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో పట్టా భూముల్లో ఈ నెల 11వ తేదీన అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి నిరసనగా భూ యజమానులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడకు వెళ్లి ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. తన విధులకు ఆటంకం కలిగించారంటూ తహశీల్దార్ పోలీసులకు 15వ తేదీన (అంటే ధర్నా జరిగిన నాలుగు రోజుల తర్వాత) ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే సహా మొత్తం 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా కేసు బనాయించడాన్ని నిరసిస్తూ రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆయన నివాసం నుంచి ప్రదర్శనగా బయలు దేరారు. మార్గమధ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. గడియార స్తంభం సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఆగిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ధర్నాకు వచ్చిన కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే అరెస్టు విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి అబంటి రాంబాబు, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, పార్టీ నాయకులు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, రావి వెంకటరమణ, బొల్లా బ్రహ్మనాయుడు, కావటి మనోహరనాయుడు, ఆతుకూరి ఆంజనేయులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎమ్మెల్యే గోపిరెడ్డిని పరామర్శించారు. హైడ్రామా నడుమ స్టేషన్ బెయిల్... ఎమ్మెల్యేపై సెక్షన్ 353 నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినందున ఆయన్ను కోర్టుకు తరలిస్తున్నట్టు పోలీసులు తొలుత చెప్పారు. దీంతో గోపిరెడ్డి తరుపున న్యాయవాదులు, పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడేళ్లలోపు శిక్షాకాలం ఉన్న సెక్షన్లకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యేపై నమోదయిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షాకాలం ఉన్నవేనని తెలిపారు. తనపై పెట్టిన తప్పుడు కేసును బేషరతుగా ఎత్తివేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని గోపిరెడ్డి ప్రకటించారు. న్యాయస్థానంలో బెయిల్ కూడా దరఖాస్తు చేయనని, జైల్లో న్యాయం కోసం పోరాడతానని స్పష్టంచేశారు. అప్పటికి రూరల్ స్టేషన్‌కు చేరుకున్న డీఎస్పీ కె.నాగేశ్వరరావు పార్టీ నాయకులు, పోలీసు అధికారులతో చర్చించి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ప్రదర్శనపై లాఠీచార్జి.. పలువురికి గాయాలు.. బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్యే గోపిరెడ్డి వెంట కార్యకర్తలు ప్రదర్శనగా స్టేషన్ నుంచి ప్రధాన మార్గం ద్వారా బయలుదేరారు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు ప్రదర్శన చేరుకోగానే తిరిగి పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించి చెల్లాచెదురు చేశారు. ప్రదర్శనలో ఉన్న వాహనాల తాళాలను బలవంతంగా లాక్కున్నారు. కొన్ని వాహనాలపై లాఠీలతో కొట్టడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసుల లాఠీచార్జితో ఆందోళన చెందిన కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ప్రదర్శన ఇంటి వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులు అసభ్య పదజాలంతో దూషిస్తూ కార్యకర్తలపై మరోమారు లాఠీచార్జికి దిగారు. ఈ సంఘటనలో పలువురు కార్యకర్తలకు బలమైన గాయాలయ్యాయి. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టు తిరుపతి రూరల్: వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సోమవారం తిరుపతి రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సమైకాంధ్ర ఉద్యమం సమయంలో ఓ రైలు దహనం కేసులో 2009 డిసెంబర్ 11న రైల్వే పోలీసులు కేసు నమోదుచేశారు. ఆ కేసులో ఎమ్మెల్యేపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేశారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు చెవిరెడ్డిని తుమ్మలగుంటలోని ఆయన ఇంట్లో తిరుపతి రైల్వే పోలీసులు అరెస్ట్‌చేశారు. అనంతరం నెల్లూరు రైల్వే న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. చెవిరెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అరెస్టు సమాచారాన్ని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కి తెలియజేశారు. మిథున్‌రెడ్డి కేసులో వాస్తవాలేమిటంటే.. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గాను 2015 నవంబర్ 26న ప్రయాణికులు సకాలంలోనే విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ వారికి బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా ఇండియన్ ఎయిర్‌లైన్స్ మేనేజర్ రాజశేఖర్ అకారణంగా నిలిపివేశారు. చాలా దురుసుగా ప్రవర్తించారు. అంతేకాదు విమానమెక్కిన ముఖాలేనా.. నేనేమన్నా మీ అసిస్టెంట్‌నా అంటూ పరుషపదజాలంతో వారిని దూషించారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి ప్రయాణీకులు ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యంపై ప్రశ్నించిన ఎంపీతోనూ మేనేజర్ ఇదేవిధంగా దురుసుగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. కానీ ఈ ఘటన జరిగిన రోజు రాత్రి తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులతో నేరుగా మాట్లాడారు. రాత్రికి రాత్రి మేనేజర్ ఆసుపత్రిలో చేరారు. మిథున్‌రెడ్డి తనపై చేయి చేసుకున్నారంటూ పోలీసులకు మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు దాఖలయ్యింది. విమానాశ్రయంలో సీసీ కెమెరాలు, సీఐఎస్ఎఫ్ నిఘా, పోలీసుల పహారా మధ్య ఓ ఎంపీ విమానాశ్రయ అధికారిపై చేయిచేసుకుంటే ఆ విషయం ఎవరికీ తెలియకుండా పోతుందా? అసలు ఆ రోజు వాస్తవంగా జరిగిందేమిటనే విషయాన్ని తెలియజేయడానికి గాను సీసీ కెమెరాల ఫుటేజీని బైటపెట్టమంటే ఎందుకు బైటపెట్టడం లేదు? మిథున్‌రెడ్డి చేయిచేసుకుని ఉంటే విమానాశ్రయంలోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేవారు... కానీ చంద్రబాబు ఆదేశించిన తర్వాతనే పోలీసులు చర్యలకు ఉపక్రమించారంటే ఇది తప్పుడు కేసు అని అర్ధం కావడం లేదూ? -
స్తంభించిన సీమాంధ్ర
వైఎస్సార్సీపీ బంద్ పిలుపు విజయవంతం పార్టీ శ్రేణులతో జత కలిసిన సమైక్యవాదులు, ఎన్జీవోలు, విద్యార్థులు అన్ని జిల్లాల్లో రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనాలు సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో అప్రజాస్వామిక పద్ధతిలో ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు బంద్‌ను విజయవంతం చేశారు. విద్యా, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. బస్సులు నిలిచి పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులు మూతపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నాలు చేశారు. పార్టీకి రాజీనామా చేసిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కంబాలచెరువు వద్ద కాంగ్రెస్ జెండాలను తగులబెట్టారు. సోనియా ఫ్లెక్సీని కుళ్లిన కోడిగుడ్లు, టమాటాలతో కొట్టారు. పిఠాపురం, రావులపాలెం, మామిడికుదురు ప్రాంతాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించగా, సామర్లకోటలో మున్సిపల్ కార్యాలయంపై వైఎస్సార్సీపీ నేతలు నల్లజెండా ఎగురవేశారు. - పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం లో బీజేపీ నేతల ప్లెక్సీలు, బుట్టాయగూడెంలో సోనియా దిష్టిబొమ్మను వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో తగలబెట్టారు. ఏలూరులో ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఆచంట సెంటర్లో నరేంద్రమోడీ, బీజేపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజుల ఫ్లెక్సీలు, పెనుమంట్రలో కేంద్రమంత్రుల ఫ్లెక్సీలు దహనం చేశారు. ఉండి ప్రధాన కూడలిలో రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. - వైఎస్సార్ సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో మద్దిలపాలెంలో వాహనా లను అడ్డుకున్నారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి నేతృత్వంలో విద్యార్థినులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట షిండే, రాహుల్, సుష్మాస్వరాజ్, సోనియా వ్యంగ్య చిత్రాల్ని ప్రదర్శించారు. కేజీహెచ్ వైద్యులు ఆస్పత్రి ఆవరణలో నిరసన ప్రదర్శన చేశారు. ఏయూ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏయూ పరిధిలో బుధవారం జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. మాడుగులలో టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. - శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఇంటిపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ చెప్పు విసిరి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీనివాస్‌తో సహా 16 మందిని అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో బస్సులను నిలిపివేశారు. వైఎస్సార్ కూడలి, సూర్యమహల్ కూడళ్ల వద్ద యూపీఏ ప్రభుత్వం, సోనియా, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆమదాలవలసలో పాలకొండ రోడ్డును దిగ్బంధించారు. విజయనగరంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గురాన అయ్యలు ఆధ్వర్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ఎదుట బైఠాయించారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సుమారు 400 మంది ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం గంటస్తంభం వద్ద మానవహారం నిర్వహించారు. - కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, మంత్రాలయం, బనగానపల్లె, ఆత్మకూరు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, సమైక్యవాదులు రోడ్లపై ప్రదర్శనలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు డోన్‌లో జాతీయ రహదారిని దిగ్భంధించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. - కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌బాబు, నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా సాగింది. వికలాంగులు నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలు వందలాది బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్ వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మకు ఉరి వేశారు. రైల్వేకోడూరులో గాంధీ విగ్రహం కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. - అనంతపురంలో వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలను మూయించారు. కలెక్టర్ కార్యాలయంలో ట్రెజరీ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ముఖద్వారం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూపురంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. - చిత్తూరులో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడిచేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. -
'చంద్రబాబు ప్రయత్నాలు అప్రజాస్వామికం'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డిని బెయిల్ పిటిషన్ అడ్డుకోవడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా అప్రజాస్వామికమని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వైఖరి ఏ మాత్రం సమంజసంగా లేదని విశాలాంధ్ర ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు విచిత్రమైన వాదనలు చేస్తున్నారని తెలిపారు. జగన్ బెయిల్‌పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. టీడీపీ నేతలు దిగజారి ఆరోపణలు చేయడం సరికాదని హితబోధ చేశారు. -
అరుణ్ జైట్లీ నిర్బంధం అప్రజాస్వామికం: మోడీ
జమ్మూ విమానాశ్రయంలో బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ బృందాన్ని పోలీసులు నిర్బంధించిన ఘటనను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం తీవ్రంగా ఖండించారు. ఆ ఘటన అప్రజాస్వామికమని ఆయన వ్యాఖ్యానించారు. కిష్టవార్ జిల్లాలో జరిగిన మతఘర్షణలకు గల కారణాలు అన్వేషించేందుకు వెళ్లిన అరుణ్ జైట్లీ బృందాన్ని అలా అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. కిష్టవార్ జిల్లాలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు బయట సమాజానికి తెలిపే క్రమంలో వారు జమ్మూ వెళ్లారని మోడీ వివరించారు. అయితే అక్కడ జరిగిన నిజాలు వెలుగులోకి రాకుండా ప్రతిపక్షాలను ప్రభుత్వం ఇలా అడ్డుకుంటుందని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. అందులోభాగంగానే జైట్లీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారని మోడీ తెలిపారు. కిష్టవార్ జిల్లాలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ నేతృత్వంలోని బృందం ఆదివారం జమ్మూ విమానాశ్రయాకి చేరుకుంది. అరుణ్‌జైట్లీ బృందాన్ని పోలీసులు నిర్భంధించారు. మతకలహాలు చోటుచేసుకున్న కిష్టావర్ ప్రాంతానికి వెళ్లకుండా ఆ బృందంపై ఆంక్షలు విధించారు. జమ్మూ నుంచి వెంటనే న్యూఢిల్లీ వెళ్లిపోవాలని ఆ బృందాన్ని కోరినట్లు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈద్ పండగ సందర్భంగా గత రెండు రోజుల క్రితం కిష్టవార్ జిల్లాలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.వారు జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ ఘర్షణలకు గల కారణాలు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ నేత అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ఓ బృందం న్యూఢిల్లీ నుంచి ఆదివారం ఉదయం జమ్మూకు బయలుదేరి వెళ్లింది. ఆ క్రమంలో ఆ బృందాన్ని జమ్మూ విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించారు.