ఇదేమి రాజ్యం! | undemocratic ruling in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఇదేమి రాజ్యం!

Published Tue, Jan 19 2016 3:56 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

సోమవారం నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు - Sakshi

సోమవారం నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు

ఇంత అప్రజాస్వామికమా..
- యథేచ్ఛగా అధికారపార్టీ అణచివేత చర్యలు
- మిథున్‌రెడ్డి అరెస్టుపై చర్చ జరుగుతుండగానే మరో ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్టులు
- రైతుల తరఫున ధర్నా చేయడమే నేరమా?
- నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు..
- ప్రశ్నించిన కార్యకర్తలపై లాఠీచార్జీ.. పలువురికి గాయాలు
- సమైక్యాంధ్ర ఉద్యమ కేసు వెలికితీసి ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టు

 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి:

ఎక్కడున్నాం మనం..? ప్రజాస్వామ్యంలోనేనా?
 లేక ఇదేమన్నా రాజరిక వ్యవస్థా..?
 ఇంత నిరంకుశత్వమా..?
 ప్రశ్నించడాన్ని సహించలేకపోతే ఎలా?
 ప్రజల తరఫున పోరాడటమే నేరమా?

 
ఎడాపెడా కేసులు బనాయిస్తూ.. పాత కేసులను తవ్వితీస్తూ ఒక పార్టీ లక్ష్యంగా యథేచ్ఛగా సాగుతున్న అణచివేత చర్యలు చూసి రాష్ర్టం నివ్వెరపోతోంది. నిజాలకు పాతరేసి, అక్రమంగా కేసు బనాయించి వైఎస్సార్‌కాంగ్రెస్ ఎంపీని అరెస్టు చేయడంపై ప్రజాస్వామికవాదులంతా ఒకపక్క నిరసన వ్యక్తం చేస్తుండగానే కవ్వింపు చర్యలా అన్నట్లుగా ఆ పార్టీకే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.

రైతుల కోసం ధర్నా చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నాలుగు రోజుల తర్వాత తహశీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు మోపారు. ఆ అక్రమకేసుపై ధర్నా చేయడానికి ఉపక్రమించిన ఎమ్మెల్యేని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరెస్టును ప్రశ్నించిన కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీచార్జీ చేశారు. ఇంకోవైపు 2009 నాటి సమైక్యాంధ్ర ఉద్యమ కేసు బూజు దులిపి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కటకటాల వెనక్కి నెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమ కేసులన్నిటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను అణచివేయడానికి గాను ఆ కేసులను తిరగదోడేందుకు ప్రయత్నించడం గమనార్హం.

ప్రతిపక్ష పార్టీ నాయకులను, ప్రజల తరఫున ఆందోళనలు చేసే వారిని అణగదొక్కేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ అధికారపార్టీ వదులుకోదని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అన్ని హామీలలానే సమైక్యాంధ్ర ఉద్యమం నాటి కేసులన్నిటినీ మాఫీ చేస్తానన్న మాట కూడా ముఖ్యమంత్రి అటకెక్కించినట్లు కనిపిస్తోందని విమర్శకులంటున్నారు. ఇది ఉద్యమకారులను అవమానించడమేనని వారు పేర్కొంటున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ రాష్ర్టవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో రాష్ర్టప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం నిస్సందేహంగా కవ్వింపు చర్యేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టువంటివని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటి నిరంకుశవైఖరి గత ప్రభుత్వాలలో ఎన్నడూ ఎరగమని పరిశీలకులంటున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే ఇక తమ పరిస్థితి ఏమిటని సామాన్యులు సైతం భయపడే పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారు ఇంతటి అసహనం, నిరంకుశ వైఖరితో ఉండడం సరికాదని ప్రగతిశీలవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనేపథ్యంలో సోమవారంనాడు రాష్ర్టవ్యాప్తంగా సంచలనం కలిగించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల అరెస్టుల ఉదంతాలను పరిశీలిద్దాం...

అక్రమ కేసు... ఆపై అరెస్టు...

గోపిరెడ్డి వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహం
నరసరావుపేట రూరల్: గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సోమవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. తనపై అక్రమకేసు బనాయించడాన్ని నిరసిస్తూ ధర్నా చేసేందుకు వెళుతుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై మోపిన కేసు వివరాలేమిటంటే..  నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో పట్టా భూముల్లో ఈ నెల 11వ తేదీన అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి నిరసనగా భూ యజమానులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడకు వెళ్లి ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. తన విధులకు ఆటంకం కలిగించారంటూ తహశీల్దార్ పోలీసులకు 15వ తేదీన (అంటే ధర్నా జరిగిన నాలుగు రోజుల తర్వాత) ఫిర్యాదు చేశారు.

దీంతో ఎమ్మెల్యే సహా మొత్తం 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా కేసు బనాయించడాన్ని నిరసిస్తూ రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆయన నివాసం నుంచి ప్రదర్శనగా బయలు దేరారు. మార్గమధ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. గడియార స్తంభం సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఆగిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.

ధర్నాకు వచ్చిన కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే అరెస్టు విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి అబంటి రాంబాబు, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, పార్టీ నాయకులు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, రావి వెంకటరమణ, బొల్లా బ్రహ్మనాయుడు, కావటి మనోహరనాయుడు, ఆతుకూరి ఆంజనేయులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎమ్మెల్యే గోపిరెడ్డిని పరామర్శించారు.

హైడ్రామా నడుమ స్టేషన్ బెయిల్...
ఎమ్మెల్యేపై సెక్షన్ 353 నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినందున ఆయన్ను కోర్టుకు తరలిస్తున్నట్టు పోలీసులు తొలుత చెప్పారు. దీంతో గోపిరెడ్డి తరుపున న్యాయవాదులు, పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడేళ్లలోపు శిక్షాకాలం ఉన్న సెక్షన్‌లకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యేపై నమోదయిన సెక్షన్‌లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షాకాలం ఉన్నవేనని తెలిపారు. తనపై పెట్టిన తప్పుడు కేసును బేషరతుగా ఎత్తివేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని గోపిరెడ్డి ప్రకటించారు. న్యాయస్థానంలో బెయిల్ కూడా దరఖాస్తు చేయనని, జైల్‌లో న్యాయం కోసం పోరాడతానని స్పష్టంచేశారు. అప్పటికి రూరల్ స్టేషన్‌కు చేరుకున్న డీఎస్పీ కె.నాగేశ్వరరావు పార్టీ నాయకులు, పోలీసు అధికారులతో చర్చించి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.

ప్రదర్శనపై లాఠీచార్జి.. పలువురికి గాయాలు..
బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్యే గోపిరెడ్డి వెంట కార్యకర్తలు ప్రదర్శనగా స్టేషన్ నుంచి ప్రధాన మార్గం ద్వారా బయలుదేరారు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు ప్రదర్శన చేరుకోగానే తిరిగి పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించి చెల్లాచెదురు చేశారు. ప్రదర్శనలో ఉన్న వాహనాల తాళాలను బలవంతంగా లాక్కున్నారు. కొన్ని వాహనాలపై లాఠీలతో కొట్టడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసుల లాఠీచార్జితో ఆందోళన చెందిన కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ప్రదర్శన ఇంటి వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులు అసభ్య పదజాలంతో దూషిస్తూ కార్యకర్తలపై మరోమారు లాఠీచార్జికి దిగారు. ఈ సంఘటనలో పలువురు కార్యకర్తలకు బలమైన గాయాలయ్యాయి.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టు
తిరుపతి రూరల్:  వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సోమవారం తిరుపతి రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సమైకాంధ్ర ఉద్యమం సమయంలో ఓ రైలు దహనం కేసులో 2009 డిసెంబర్ 11న రైల్వే పోలీసులు కేసు నమోదుచేశారు. ఆ కేసులో ఎమ్మెల్యేపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేశారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు చెవిరెడ్డిని తుమ్మలగుంటలోని ఆయన ఇంట్లో తిరుపతి  రైల్వే పోలీసులు అరెస్ట్‌చేశారు. అనంతరం నెల్లూరు రైల్వే న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. చెవిరెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అరెస్టు సమాచారాన్ని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కి తెలియజేశారు.
 
మిథున్‌రెడ్డి కేసులో వాస్తవాలేమిటంటే..
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గాను 2015 నవంబర్ 26న ప్రయాణికులు సకాలంలోనే విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ వారికి బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా ఇండియన్ ఎయిర్‌లైన్స్ మేనేజర్ రాజశేఖర్ అకారణంగా నిలిపివేశారు. చాలా దురుసుగా ప్రవర్తించారు. అంతేకాదు విమానమెక్కిన ముఖాలేనా.. నేనేమన్నా మీ అసిస్టెంట్‌నా అంటూ పరుషపదజాలంతో వారిని దూషించారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి ప్రయాణీకులు ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యంపై ప్రశ్నించిన ఎంపీతోనూ మేనేజర్ ఇదేవిధంగా దురుసుగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత క్షమాపణ చెప్పారు.

కానీ ఈ ఘటన జరిగిన రోజు రాత్రి తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులతో నేరుగా మాట్లాడారు. రాత్రికి రాత్రి మేనేజర్ ఆసుపత్రిలో చేరారు. మిథున్‌రెడ్డి తనపై చేయి చేసుకున్నారంటూ పోలీసులకు మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు దాఖలయ్యింది. విమానాశ్రయంలో సీసీ కెమెరాలు, సీఐఎస్‌ఎఫ్ నిఘా, పోలీసుల పహారా మధ్య ఓ ఎంపీ  విమానాశ్రయ అధికారిపై చేయిచేసుకుంటే ఆ విషయం ఎవరికీ తెలియకుండా పోతుందా? అసలు ఆ రోజు వాస్తవంగా జరిగిందేమిటనే విషయాన్ని తెలియజేయడానికి గాను సీసీ కెమెరాల ఫుటేజీని బైటపెట్టమంటే ఎందుకు బైటపెట్టడం లేదు? మిథున్‌రెడ్డి చేయిచేసుకుని ఉంటే విమానాశ్రయంలోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేవారు... కానీ చంద్రబాబు ఆదేశించిన తర్వాతనే పోలీసులు చర్యలకు ఉపక్రమించారంటే ఇది తప్పుడు కేసు అని అర్ధం కావడం లేదూ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement