స్తంభించిన సీమాంధ్ర | Seemandhra Bandh Success by calling of Ysr congress party | Sakshi
Sakshi News home page

స్తంభించిన సీమాంధ్ర

Published Thu, Feb 20 2014 1:41 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

స్తంభించిన సీమాంధ్ర - Sakshi

స్తంభించిన సీమాంధ్ర

వైఎస్సార్‌సీపీ బంద్ పిలుపు విజయవంతం
పార్టీ శ్రేణులతో జత కలిసిన సమైక్యవాదులు, ఎన్జీవోలు, విద్యార్థులు
అన్ని జిల్లాల్లో రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనాలు

 
 సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో అప్రజాస్వామిక పద్ధతిలో ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు బంద్‌ను విజయవంతం చేశారు. విద్యా, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. బస్సులు నిలిచి పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులు మూతపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నాలు చేశారు. పార్టీకి రాజీనామా చేసిన  ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కంబాలచెరువు వద్ద కాంగ్రెస్ జెండాలను తగులబెట్టారు. సోనియా ఫ్లెక్సీని కుళ్లిన కోడిగుడ్లు, టమాటాలతో కొట్టారు. పిఠాపురం, రావులపాలెం, మామిడికుదురు ప్రాంతాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించగా, సామర్లకోటలో మున్సిపల్ కార్యాలయంపై వైఎస్సార్‌సీపీ నేతలు నల్లజెండా ఎగురవేశారు.
 
-     పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం లో బీజేపీ నేతల ప్లెక్సీలు, బుట్టాయగూడెంలో సోనియా దిష్టిబొమ్మను వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో తగలబెట్టారు. ఏలూరులో ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. ఆచంట సెంటర్‌లో నరేంద్రమోడీ, బీజేపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజుల ఫ్లెక్సీలు, పెనుమంట్రలో కేంద్రమంత్రుల ఫ్లెక్సీలు దహనం చేశారు. ఉండి ప్రధాన కూడలిలో రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
 
-     వైఎస్సార్ సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో మద్దిలపాలెంలో వాహనా లను అడ్డుకున్నారు.  రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి నేతృత్వంలో విద్యార్థినులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట షిండే, రాహుల్, సుష్మాస్వరాజ్, సోనియా వ్యంగ్య చిత్రాల్ని ప్రదర్శించారు. కేజీహెచ్ వైద్యులు ఆస్పత్రి ఆవరణలో నిరసన ప్రదర్శన చేశారు. ఏయూ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏయూ పరిధిలో బుధవారం జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. మాడుగులలో టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
 
-     శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఇంటిపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ చెప్పు విసిరి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీనివాస్‌తో సహా 16 మందిని అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో బస్సులను నిలిపివేశారు. వైఎస్సార్ కూడలి, సూర్యమహల్ కూడళ్ల వద్ద యూపీఏ ప్రభుత్వం, సోనియా, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆమదాలవలసలో పాలకొండ రోడ్డును దిగ్బంధించారు. విజయనగరంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గురాన అయ్యలు ఆధ్వర్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ఎదుట బైఠాయించారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సుమారు 400 మంది ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం గంటస్తంభం వద్ద మానవహారం నిర్వహించారు.
 
  -   కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, మంత్రాలయం, బనగానపల్లె, ఆత్మకూరు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, సమైక్యవాదులు రోడ్లపై ప్రదర్శనలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు డోన్‌లో జాతీయ రహదారిని దిగ్భంధించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి.
 
-     కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌బాబు, నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా సాగింది. వికలాంగులు నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేతలు వందలాది బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్ వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మకు ఉరి వేశారు. రైల్వేకోడూరులో  గాంధీ విగ్రహం కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు.
 
-     అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలను మూయించారు. కలెక్టర్ కార్యాలయంలో ట్రెజరీ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ముఖద్వారం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూపురంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.  
 
-     చిత్తూరులో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడిచేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement