Sajad Lone
-
కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి
శ్రీనగర్: స్వతంత్ర ప్రతిపత్తిని తిరిగి సాధించడమే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నాటికి ముందు పరిస్థితిని జమ్మూకశ్మీర్‌లో పునరుద్ధరించాలనీ, దీనిపై సంబంధిత పక్షాలన్నిటితో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. గురువారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన ఈ భేటీకి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోనె, పీపుల్స్ మూవ్‌వెంట్ నేత జావెద్ మిర్, సీపీఎం నేత యూసఫ్ తారిగామి హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్’గా తమ కూటమికి పేరు పెట్టామన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్లకున్న ప్రత్యేక హోదాతోపాటు, కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని సాధించుకుంటామన్నారు. తమ కూటమి భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే వెల్లడిస్తామన్నారు. జేకేపీసీసీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
కశ్మీర్ సీఎం ముఫ్తీకి అసంతృప్తి సెగ
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో బీజేపీ, పీడీపీల సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరి రెండ్రోజులయినా కాకముందే అసంతృప్తి జ్వాల రేగింది. ఒకప్పటి వేర్పాటువాది సజ్జద్ లోన్ తనకు కేటాయించిన పోర్ట్‌ఫోలియోపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సజ్జద్ రాజీనామా పత్రాన్ని బుధవారం బీజేపీ హైకమాండ్‌కు పంపినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. మీడియాకు దూరంగా ఉన్న సజ్జద్ తన ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి చెందిన నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా, మరో 21 మంది మంత్రులతో గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా ప్రమాణస్వీకారం చేయించారు. సజ్జద్ తనకు వైద్య, ఆరోగ్య శాఖ దక్కుతుందని భావించినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. కాగా ఆయనకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో అసంతృప్తి చెందిన సజ్జద్ రాజీనామా చేశారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసేందుకు నిరాకరించారు. రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా పీడీపీకి చెందిన ఆర్థిక మంత్రి హసీబ్ డ్రాబు.. సజ్జద్‌ను కోరారు. 2002లో హత్యకు గురైన పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు అబ్దుల్ గిలానీ లోన్ చిన్న కుమారుడైన సజ్జద్ బీజేపీ కోటాలో కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. కుప్వారా జిల్లాలోని హంద్వారా నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మంత్రివర్గంలో సజ్జద్ పశుసంవర్థక శాఖను నిర్వహించారు.