- ఎస్కేయూలో అర్ధనగ్న ప్రదర్శన
హోదా కోసం ‘అనంత’లో భిక్షాటన
Published Tue, Jan 31 2017 12:58 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
అనంతపురం ఎడ్యుకేషన్ /ఎస్కేయూ :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం నగరంలో అర్ధనగ్నంగా భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన బీజేపీ, టీడీపీ ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశాయన్నారు. ప్రత్యేకప్యాకేజీ ఇస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటిస్తే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ ప్యాకేజీ వల్ల ముఖ్యమంత్రి, ఆయన అనుచరులకు లబ్ధి తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు లోకేష్‌శెట్టి, పెద్దన్న, సాకే నవీన్, నాయకులు మున్నా, షారుఖాన్, నాని, రిజ్వాన్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం విద్యార్థి జేఏసీ నాయకులు అర్ధనగ్నప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసిరావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతికిరణ్, భానుప్రకాష్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, పి.హేమంత్ కుమార్, ఏ. శ్రీనివాసులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పులిరాజు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్ యాదవ్, కె.మల్లిఖార్జున, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాలరాజు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వీరనారప్ప, ఎంఎస్‌ఎఫ్ నాయకులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement