సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి పోరాటం చేస్తుందన్నారు. నిరాహారదీక్షలు మొదలు సభలు, సమావేశాలు నిర్వహించిందన్నారు.
హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆది నుంచి రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీనే కావాలని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడని బాలినేని విమర్శించారు. ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడని బాలినేని చెప్పారు.
బాబుకు రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేదన్నారు. హోదా వచ్చే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలు, ప్రజాసంఘాలను కలుపుకొని పోయి ఉద్యమం చేస్తుందన్నారు. హోదా సాధనే లక్ష్యమన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన చంద్రబాబు ఇప్పుడు హోదా అంటూ డ్రామాలాడుతున్నారని బాలినేని విమర్శించారు. హోదా ఉద్యమంలో పాల్గొనడంతో పాటు సహకరిస్తున్న అందరికీ బాలినేని కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా ప్రజలు కరువుతో అల్లాడిపోతున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 55 మండలాలు కరువు కింద ప్రకటించినా రైతులకు పైసా పరిహారమివ్వడం లేదన్నారు. తక్షణం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు. ఒక వైపు కరువుతో అరకొర పంటలు పండినా ఆ సరుకును కూడా గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం కొనే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. జిల్లాలో రైతుల వద్ద ఉన్న శనగలు, కందులను తక్షణం ఎంఎస్‌పీ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని బాలినేని డిమాండ్ చేశారు.
వేసవి నేపథ్యంలో పశ్చిమ ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ తాగునీటి ఇబ్బందుల్లేకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బాలినేని కోరారు. కరువు నేపథ్యంలో పశువులకు సబ్సిడీ గ్రాసాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సాగర్ నుంచి జలాలను తెప్పించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నింపాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment