ఎన్‌కౌంటర్‌లో దెబ్బతిన్న ఇల్లు.. పేలుడులో గాయపడిన వ్యక్తిని ఆసపత్రికి తరలిస్తున్న దృశ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ మిలిటెంట్లు హతమయ్యారు. ఆ వెంటనే సంఘటనా స్థలంలో మిలిటెంట్లు పెట్టిన బాంబులు పేలడంతో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లారూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో ఆదివారం భద్రతా బలగాలు అక్కడ తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీస్ అధికారులు వెల్లడించారు.
ఎన్‌కౌంటర్ ముగిశాక భద్రతాదళాలు పాక్షికంగా అక్కడి నుంచి వెనుదిరగ్గా, పౌరులు సంఘటనాస్థలంలో గుమిగూడారు. అప్పటికే అక్కడ మిలిటెంట్లు పెట్టిన బాంబులు పేలడంతో ఏడుగురు మృత్యువాతపడగా, పలువురు గాయాలపాలయ్యారని అధికారులు చెప్పారు. అనంతరం, భద్రతా బలగాలు, స్థానిక యువకుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అల్లర్లను అదుపుచేసేందుకు పోలీసులు బలప్రయోగానికి దిగడంతో పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. మరోవైపు, రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు పాకిస్తాన్ చొరబాటుదారులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు కూడా మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment