
న్యూఢిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం దాడులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పేందుకు బీజేపీ యానిమేటెడ్ వీడియోలను రూపొందించింది. రాహుల్, ఇతర ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా ప్రధాని మోదీని హీరోగా చూపుతూ క్రీడా నేపథ్యంలో తయారుచేసిన వీడియోలను ఆదివారం బీజేపీ విడుదల చేసింది. క్రికెట్, కబడ్డీ, చెస్ ఆటల క్లిప్పింగ్‌లను ఈ వీడియోలకోసం తీసుకున్నామని, పార్టీ అధికారిక ట్విట్టర్ సైట్‌లో ప్రకటించారు.
దాదాపు అన్ని వీడియోలలోనూ మోదీ హీరోగా, ప్రతిపక్షాలపై ఒంటరిగా, అజేయంగా పోరాడుతున్నట్టుగా రూపొందించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఒక వీడియోలో మోదీ సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించినట్టుగా, ప్రతిపక్షాలు అంపైర్‌ను ఆ విజయానికి సాక్ష్యం చూపమని అడుగుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోను ట్యాగ్‌చేస్తూ అరుణ్ జైట్లీ ‘భారత్ విజయానికి ఎవరు సాక్ష్యాలు అడుగుతారు, అపజయానికి కారణాలు వెతుక్కునే వారే ఈ విజయానికి రుజువులు కావాలని అడుగుతారు’అని చెప్పారు. కబడ్డీ వీడియోలో ప్రతిపక్షాలన్నింటినీ మోదీ ఒక్కడే మట్టి కరిపించినట్టుగా ఉంది. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఓటర్లకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే లక్ష్యంగా వీటిని తయారుచేసినట్లు బీజేపీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment