ఇస్లామాబాద్ : బాలాకోట్ దాడుల భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. ప్రతీకార దాడులపై ఆందోళనతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్ పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై ఉక్కుపాదం మోపింది. భారత్ చెబుతున్న వివరాల ప్రకారం పీఓకేలో ముజఫరాబాద్, కోట్లి ప్రాంతాల్లో ఐదేసి చొప్పున, బర్నాలాలో ఒక క్లస్టర్ సహా 11 ఉగ్రవాద శిబిరాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కోట్లీ, నికైల్ ప్రాంతంలో లష్కరే తోయిబా నిర్వహిస్తున్న కొన్ని శిబిరాలు మూతపడ్డాయి.
పాలా, బాగ్ ప్రాంతంలో జైషే మహ్మద్ నిర్వహిస్తున్న ఉగ్ర శిబిరాలు కూడా మూతపడగా, కోట్లి ప్రాంతంలో హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్ర శిబిరం షట్‌డౌన్ అయింది. మరోవైపు ముజఫరాబాద్, మిర్పూర్ ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలు కూడా మూతపడ్డాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే టెర్రర్ లాంచ్‌ప్యాడ్స్ కూడా చురుకుగా లేవని సమాచారం. బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం భారత్‌లోకి పీఓకే నుంచి చొరబాట్ల ప్రయత్నాలు పెద్దగా సాగడం లేదని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment