Terror Camp
-
పాక్‌కు భారీ షాక్ : ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన ఆర్మీ
-
పాక్‌కు భారీ షాక్ : ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన ఆర్మీ
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలు, టెర్రర్ లాంఛ్ ప్యాడ్ల లక్ష్యంగా భారత సైన్యం ఆదివారం దాడులు చేపట్టింది. తాంగ్ధర్ సెక్టార్‌కు ఎదురుగా పీఓకేలోని నీలం ఘాట్ ప్రాంతంలో ఆర్మీ చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్ వైపు భారీ నష్టం జరిగినట్టు సమాచారం. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని తెలిసింది. కుప్వారాలోని తాంగ్ధర్ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల విరమణకు పాల్పడటంతో ఇద్దరు భారత సైనికులు, ఓ పౌరుడు మరణించిన కొద్ది గంటల్లోనే భారత సైన్యం ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నందుకు ప్రతీకారంగా భారత సేనలు పీఓకేలో ఉగ్రశిబిరాలే లక్ష్యంగా దాడులు చేపట్టాయని భారత సైన్యం ప్రతినిధి వెల్లడించారు. నీలం ఘాట్‌లోని ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ఫిరంగులతో టార్గెట్ చేసింది. ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు ఈ ఆపరేషన్‌లో పది, పదిహేను మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం. ఉగ్ర శిబిరాలపై దాడి, ఆపరేషన్ వివరాలను ఆర్మీ అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. -
‘బాలాకోట్’ దాడులపై మళ్లీ అనుమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదట్లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి భారత వైమానికి దళం చొచ్చుకుపోయి ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాన్ని ఉగ్రవాదులు ఇటీవల పునుద్ధరించుకున్నారని భారత సైనిక చీఫ్ బిపిన్ రావత్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు రేగుతున్నాయి. అసలు ఆ రోజున ఉగ్రవాదుల శిబిరం ఏ మేరకు ధ్వంసమయింది? అన్న అనుమానం నేడే కాదు, దాడులు జరిగిన రోజే కలిగాయి. అంతకుముందు, ఆ తర్వాత అంతర్జాతీయ శాటిలైట్లు తీసిన చిత్రాలను కూడా కొన్ని ఆంగ్ల వెబ్సైట్లు ఉదహరిస్తూ భారత వైమానిక దళం దాడులు గురితప్పాయని ఆరోపించాయి. ఆ ఆరోపణలను, ఆ విమర్శలను భారత ప్రభుత్వ వర్గాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. తాజాగా చెన్నైలోని సైనిక అధికారుల శిక్షణా అకాడమీలో బిపిన్ రావత్ మాట్లాడుతూ నాడు భారత ధ్వంసం చేసిన ఉగ్రవాదుల శిబిరాన్ని వారు మళ్లి పునరుద్ధరించుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పడం ఎంత మేరకు నిజం? పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులకు కోలుకోని దెబ్బపడిందని, బాలాకోట్‌లోని వారి శిబిరాన్ని సమూలంగా నాశనం చేశామంటూ నాడు ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంలో నిజం లేదా? ఈ రెండు నిజం అవడానికి ఆస్కారం లేదు. అలాంటప్పుడు ఒక్కటే నిజం కావాలి? 2016లో భారత సైనికులు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా టెర్రరిస్టు లాంఛింగ్ పాడ్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అప్పుడు కూడా సైనిక వర్గాలుగానీ, ప్రభుత్వ వర్గాలుగానీ అందుకు సరైన సాక్ష్యాలు చూపించలేక పోయాయి. మళ్లీ ఈసారి కూడా బాలాకోట్ లాంటి దాడులు జరిపి భారత సైనిక వర్గాలు నెగ్గుకు రావాలంటే చాలా కష్టం. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్ సరిహద్దుల్లో పాక్ సైనిక భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోపక్క కశ్మీర్ మిలిటెంట్లు ఉగ్రదాడులకు అవకాశాలు వెతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భారత్ సర్జికల్ దాడులు నిర్వహించలేదు. (చదవండి: బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది) -
పాక్‌ను వెంటాడుతున్న బాలాకోట్
ఇస్లామాబాద్ : బాలాకోట్ దాడుల భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. ప్రతీకార దాడులపై ఆందోళనతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్ పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై ఉక్కుపాదం మోపింది. భారత్ చెబుతున్న వివరాల ప్రకారం పీఓకేలో ముజఫరాబాద్, కోట్లి ప్రాంతాల్లో ఐదేసి చొప్పున, బర్నాలాలో ఒక క్లస్టర్ సహా 11 ఉగ్రవాద శిబిరాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కోట్లీ, నికైల్ ప్రాంతంలో లష్కరే తోయిబా నిర్వహిస్తున్న కొన్ని శిబిరాలు మూతపడ్డాయి. పాలా, బాగ్ ప్రాంతంలో జైషే మహ్మద్ నిర్వహిస్తున్న ఉగ్ర శిబిరాలు కూడా మూతపడగా, కోట్లి ప్రాంతంలో హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్ర శిబిరం షట్‌డౌన్ అయింది. మరోవైపు ముజఫరాబాద్, మిర్పూర్ ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలు కూడా మూతపడ్డాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే టెర్రర్ లాంచ్‌ప్యాడ్స్ కూడా చురుకుగా లేవని సమాచారం. బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం భారత్‌లోకి పీఓకే నుంచి చొరబాట్ల ప్రయత్నాలు పెద్దగా సాగడం లేదని అధికారులు చెబుతున్నారు. -
రూటు మార్చుకోనంటున్న పాక్
న్యూఢిల్లీ : ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే... పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. ఇప్పటికే భారత్ చేతిలో అనేకసార్లు దెబ్బ తిన్న పాక్.. తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత సైన్యాలు ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేయడం, ప్రపంచ వేదిక మీద పాక్‌ను ఒంటరి చేయడం వంటి చర్యలు ఎన్ని తీసుకున్నప్పటికి దాయాది దేశంలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు మరింత తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటికే 16 ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ‘పీఓకేలో 16 టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్‌లను ఏర్పాటు చేసినట్లు సమాచారం అందింది. వేసవి ముగిసేలోపలే భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ క్యాంప్‌లకు చెందిన ఉగ్రవాదులు కొందరు ఎల్ఓసీ సమీపంలో పాడ్స్‌ను లాంచ్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. అయితే వారి చర్యలను చాలా నిశితంగా గమనిస్తున్నాం. ఏ మాత్రం అవకాశం చిక్కినా మరో సారి గట్టిగానే బుద్ధి చెప్తాం’ అన్నారు. జాకీర్ ముసాను చంపడం మూలానే ఇంత భారీ ఎత్తున ఉగ్ర చర్యలకు పాల్పడుతుండవచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం జైషే మహ్మద్ నాయకత్వం మొత్తం అంతరించి పోయిందని.. ఉన్న వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని అధికారులు తెలిపారు. భారత సైన్యం, ఇతర బలగాలు చేస్తున్న దాడులకు జడిసి.. కొత్త వారు ఎవరూ ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్‌ల్లో చేరేందుకు ముందుకు రావడం లేదన్నారు. -
ఆ 22 చోట్ల ఉగ్ర శిబిరాలే లేవు!
ఇస్లామాబాద్: ఉగ్ర శిబిరాలున్నాయంటూ భారత్ చెబుతున్న 22 ప్రాంతాల్లో అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పాకిస్తాన్ తెలిపింది. పుల్వామా ఆత్మాహుతి దాడితో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధం ఉందనే విషయం భారత్ అందించిన నోటీసులో లేదంది. తాము నిర్బంధంలోకి తీసుకున్న వారిలో 54 మందికి పుల్వామా ఘటనతో సంబంధం లేదని పాక్ చెప్పింది. అంతర్జాతీయంగా వచ్చిన తీవ్ర ఒత్తిడులకు తలొగ్గిన పాకిస్తాన్.. భారత్ అందజేసిన వివరాల మేరకు దర్యాప్తు చేపట్టడంతో పాటు వివిధ నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన 120 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. అయితే, తమ దర్యాప్తులో భారత్ ఆరోపణలకు తగిన రుజువులు లభించలేదనీ, మరిన్ని వివరాలు అందించాలని బుధవారం కోరింది. ఆ దేశ అంతరంగిక శాఖ కార్యదర్శి ఆజం సులేమాన్ ఖాన్, విదేశాంగ శాఖ ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ గురువారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ‘జైషే మొహమ్మద్ అధినేత అజార్ కొడుకు హమ్మద్, సోదరుడుసహా 120 మందిని నిర్బంధంలోకి తీసుకున్నాం. వీరిలో 54 మందికి పుల్వామా దాడితో సంబంధం ఉన్నట్లుగా ఆధారాలు లేవు. ఉగ్ర శిబిరాలున్నట్లుగా పేర్కొన్న 22 ప్రాంతాల్లో సోదాలు జరపగా అటువంటివేమీ లేనట్లు తేలింది. కావాలంటే భారత్ తనిఖీ చేసుకోవచ్చు’ అని అన్నారు. ‘పుల్వామా ఘటన మా పనే’ అంటూ జైషే మొహమ్మద్ నేత ఆదిల్ దార్ ప్రకటిస్తున్నట్లుగా ఉన్న వీడియోల వంటి వాటిపైనా దర్యాప్తు చేపట్టాం’ అని వివరించారు. పాక్‌లో ఉగ్ర స్థావరాలున్నాయని చూపేందుకు మరిన్ని సాక్ష్యాలు కావాలంటూ పాక్ ఇచ్చిన సమాధానంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పుల్వామా దాడిని ఉగ్ర ఘటనగా గుర్తించేందుకు కూడా పాక్ సిద్ధంగా లేకపోవడాన్ని ఆయన ఖండించారు. -
సర్జికల్ స్ట్రైక్ 2 : ఉగ్రస్థావరాల ఫోటో రిలీజ్
న్యూఢిల్లీ : భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెరుపు దాడులు జరిపిన ఉగ్ర స్థావరాల ఫోటోలను ఇంటిలిజెన్స్ వర్గాలు రిలీజ్ చేశాయి. ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రచురించిన ఈ ఫోటో బాలాకోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాల ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించినది. ట్రైనింగ్ సెంటర్ మెట్ల మీద అమెరికా, ఆస్ట్రేలియా, యూకే జాతీయ పతాకాలను చిత్రించారు. ఈ విషయం గురించి ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘శత్రువుల పట్ల ద్వేషాన్ని మరువకుండా ఉండేందుకు.. అను నిత్యం శత్రువును గుర్తు చేసుకునేందుకు గాను మెట్లపై ఇలా ఆయా దేశాల జెండాలను చిత్రించి ఉంటార’ని అధికారి తెలిపారు. మంగళవారం సర్జికల్ స్ట్రైక్ జరిగిన బాలాకోట్ మన్షెహరా జిల్లాలో ఓ పట్టణం. ఇది నియంత్రణ రేఖకు దూరంగా ఉంటుంది. అంతేకాక జైషే ఉగ్ర సంస్థకు బాలాకోట్ కీలక స్థావరం. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు బావమరిది అయిన యూసుఫ్ అజర్ బాలాకోట్‌లో ఈ ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఇక్కడ ట్రైనింగ్ అవుతున్న వారిలో ఎక్కువ మంది మసూద్ అజర్ బంధువులే ఉన్నట్లు సమాచారం. దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణాన్ని 2003-04లో ప్రారంభించారు. ఇక్కడ ఒకేసారి దాదాపు 600 మందికి వసతి కల్పించవచ్చని తెలిసింది. అయితే 2011లో అమెరికా.. ఆల్‌ఖయిదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన అబోటాబాద్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనే బాలాకోట్ ఉండటం గమనార్హం. వాస్తవానికి 2005లో వచ్చిన భూకంపంలో ఈ నగరం కొంత శిథిలమైంది. కానీ అక్కడ ఉగ్రకార్యకలాపాలు మాత్రం తగ్గడం లేదు. -
అనంతగిరిలో టెర్రర్ క్యాంప్!
ఉగ్ర శిబిరం ఏర్పాటుకు కుట్ర ► సిమీ చీఫ్ సఫ్దార్ నగోరీపై సిట్‌లోనూ కేసు ► 2008లో నగరానికి వచ్చి వెళ్లిన సఫ్దార్ ► జీవితఖైదు విధించిన ఇండోర్ కోర్టు సాక్షి, హైదరాబాద్: నిషేధిత ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’(సిమీ) చీఫ్ సఫ్దార్హుసేన్ నగోరీ... దేశద్రోహం కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం సఫ్దార్కు సోమవారం జీవిత ఖైదు విధించింది. గతంలో ఈ నగోరీ నగరయువతనూ ఉగ్రవాదం వైపు మళ్లించడానికి యత్నించాడు. నగర శివారులోని అనంతగిరిలో ఉగ్రవాద శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. ఈ మేరకు నగోరీపై సిటీలోనూ ఓ కేసు ఉంది. ఇలా చేయడం ద్వారా దేశంపై యుద్ధానికి యత్నించారనే ఆరోపణలపై నగర నేర పరిశోధన విభాగం అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 2008లో ఈ కేసును నమోదు చేసింది. కోర్టు జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో సిటీ పోలీసులు 2008 నాటి కేసు పూర్వాపరాలను పరిశీలించారు. సిమీకి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించిన సఫ్దార్పై దేశవ్యాప్తంగా అనేక కేసులున్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడడం, ప్రేరేపించడం, దేశద్రోహం తదితర ఆరోపణలపై ఇవి నమోదయ్యాయి. నగరంలో అనువైన ప్రాంతం కోసం గాలింపు... సిమీ ముసుగులో ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిన నగోరీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాడు. మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో ఈ శిబిరాలు పూర్తి చేసిన నగోరీ తదితరులు అనేక మందిని ఉగ్రవాదులుగా తయారు చేశారు. అనంతరం 2007లో ఇతడి కన్ను హైదరాబాద్‌పై పడింది. స్థాని కంగా ఉన్న కొందరి సహకారంతో నగర యువతనూ ఉగ్రవాదం వైపు మళ్లించడానికి కుట్ర పన్నాడు. ఆ ఏడాది మేలో హైదరాబాద్ వచ్చి వెళ్లిన నగోరీ... ఉగ్ర శిబిరం ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం గాలించాడు. నగర శివార్లలో ఉన్న అనంతగిరి అడవుల్ని సందర్శించిన ఇతగాడు అక్కడే శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. 2008 మార్చి 27న నగోరీ సహా అతడి అనుచరుల్ని మధ్యప్రదేశ్ పోలీసులు ఇండోర్‌లో అరెస్టు చేశారు. అతడిని విచారించిన ఇండోర్ పోలీసులు హైదరాబాద్‌నూ టార్గెట్ చేసినట్లు గుర్తించారు. అనుమానితుడి అరెస్టుతో వెలుగులోకి... 2008 సెప్టెంబర్‌లో నగర పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారించిన తరువాత గానీ... సఫ్దార్ ఇక్కడకు వచ్చి వెళ్లిన విషయం వెలుగులోకి రాలేదు. సఫ్దార్తో పాటు అతడి సోదరుడు, అనుచరుల రాకపోకలు, అనంతగిరి ‘టూర్’విషయాలు బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు ఆ కేసులో నగోరీతో పాటు మిగిలిన వారినీ నిందితులుగా చేర్చారు. అప్పట్లో ఇండోర్ జైల్లో ఉన్న నగోరీ తదితరుల్ని పీటీ వారంట్‌పై సిటీకి తీసుకువచ్చి అరెస్టు చేయాలని సిట్ అధికారులు భావించారు. అయితే అరెస్టయిన నిందితుడు చెప్పిన వివరాలు మినహా ఇతర ఆధారాలు లభించకపోవడంతో ఇది కార్యరూపంలోకి రాలేదు. ఇండోర్ కోర్టు సోమవారం నగోరీతో సహా 10 మందికి జీవితఖైదు విధించడంతో సిటీ పోలీసులు నాటి కేసు పూర్వాపరాలను పరిశీలించారు.