
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలు, టెర్రర్ లాంఛ్ ప్యాడ్‌ల లక్ష్యంగా భారత సైన్యం ఆదివారం దాడులు చేపట్టింది. తాంగ్ధర్ సెక్టార్‌కు ఎదురుగా పీఓకేలోని నీలం ఘాట్ ప్రాంతంలో ఆర్మీ చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్ వైపు భారీ నష్టం జరిగినట్టు సమాచారం. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని తెలిసింది. కుప్వారాలోని తాంగ్ధర్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల విరమణకు పాల్పడటంతో ఇద్దరు భారత సైనికులు, ఓ పౌరుడు మరణించిన కొద్ది గంటల్లోనే భారత సైన్యం ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నందుకు ప్రతీకారంగా భారత సేనలు పీఓకేలో ఉగ్రశిబిరాలే లక్ష్యంగా దాడులు చేపట్టాయని భారత సైన్యం ప్రతినిధి వెల్లడించారు. నీలం ఘాట్‌లోని ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ఫిరంగులతో టార్గెట్ చేసింది. ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు ఈ ఆపరేషన్‌లో పది, పదిహేను మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం. ఉగ్ర శిబిరాలపై దాడి, ఆపరేషన్ వివరాలను ఆర్మీ అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment