భారత బలగాలు భారీగా కాల్పులతో విరుచుకుపడటంతో ధ్వంసమైన పాక్ ఆర్మీ పోస్టులు, ఉగ్ర శిబిరాల నుంచి వెలువడుతున్న పొగ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ ప్రతీకార కాల్పులు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ను మరోసారి భారత్ చావుదెబ్బ తీసింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడుల అనంతరం.. ఆ స్థాయిలో ఆదివారం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పీఓకేలోని నీలం లోయలో ఉన్న నాలుగు ఉగ్ర స్థావరాల్లో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. పక్కా ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని భారత జవాన్లు కాల్పులు జరిపారు.
మూడు స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి, మరో స్థావరాన్ని భారీగా నష్టపరిచిన భారత జవాన్లు.. ఆ స్థావరాల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు వీలుగా భారత పోస్ట్‌లపై కాల్పులు జరపడం కోసం అదే ప్రాంతంలో ఉన్న పాక్ జవాన్ల స్థావరాలను సైతం నేలకూల్చారు. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు వీలుగా శనివారం తంగధర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు పదమ్ బహదూర్ శ్రేష్ఠ, గమిల్ కుమార్ శ్రేష్ఠ, ఒక పౌరుడు మృతి చెందారు.
ప్రతిగా ఆదివారం పీఓకే లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ తీవ్రస్థాయిలో దాడులు ప్రారంభించింది. భారత్ కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 35 వరకు ఉండొచ్చని, వారు జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలకు చెందినవారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాక్ జవాన్లు కూడా భారీగానే హతమయ్యారని పేర్కొన్నాయి. ఆదివారం సాయంత్రం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు భారత్ కాల్పుల్లో 6 నుంచి 10 మంది పాక్ జవాన్లు, అంతే సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు’ అని అన్నారు.
వీరమరణం పొందిన భారత జవాన్లు పదమ్ బహదూర్, గమిల్ కుమార్
పీఓకేలోని ఉగ్రస్థావరాల నెట్‌వర్క్ చాలావరకు ధ్వంసమైందన్నారు. ‘మూడు ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయి. నాలుగోది దాదాపు ధ్వంసమైంది. పక్కా సమాచారంతోనే దాడులు చేశాం’ అన్నారు. ‘దీపావళి పండుగ సమీపిస్తోంది. భారత్‌లో దాడులు చేసేందుకు కొందరు ఉగ్రవాదులు పీఓకేలోని నీలం లోయలో ఉన్న కొన్ని ఉగ్రస్థావరాల్లో సిద్ధంగా ఉన్నట్లు మాకు సమాచారమందింది. వారు చొరబాటుకు ప్రయత్నించే వరకు ఎదురుచూడకుండా.. ముందే పక్కా ప్రణాళికతో దాడులు చేశాం’ అని వివరించారు.
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన ఆగస్ట్ 5వ తేదీ నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మాకు వస్తూనే ఉందని ఆర్మీ చీఫ్ రావత్ వ్యాఖ్యానించారు. నెల రోజులుగా గురెజ్, మచిల్, కేరన్ సెక్టార్ల ద్వారా పలు చొరబాటు ప్రయత్నాలు జరిగాయన్నారు. ‘భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించే ప్రయత్నాలను పాక్ నిలిపేయకపోతే.. మా స్పందన మరింత తీవ్రంగా ఉంటుంది’ అని రావత్ స్పష్టం చేశారు. ‘కశ్మీర్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు.
ఒక్కో స్థావరంలో 10 నుంచి 15 మంది
జమ్మూకశ్మీర్లోని తంగధర్ సెక్టార్‌కు ఆవలివైపు పీఓకేలో ఉన్న నీలం లోయలోని ఒక్కో ఉగ్రస్థావరంలో భారత్ దాడులు చేసిన సమయంలో 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు భారత్‌లోని కశ్మీర్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు, తదనంతర పరిస్థితులను వివరించారు. మరోవైపు, దాడుల్లో ఉగ్రవాదులు, పాక్ జవాన్లు చనిపోయారన్న భారత్ వాదనను పాకిస్తాన్ తోసిపుచ్చింది.
భారత్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులను ఉగ్రస్థావరాలున్నాయని భారత్ చెబుతున్న నీలం లోయ ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారే నిజానిజాలను నిర్ధారిస్తారని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ సవాలు చేశారు. పాకిస్తాన్‌లో భారత రాయబారి గౌరవ్ అహ్లూవాలియాను పాక్ ప్రభుత్వం పిలిపించి భారత్ కాల్పులకు నిరసన తెలిపింది.
భారత్ కాల్పుల్లో ఐదుగురు పౌరులు చనిపోయారని పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు. పాక్ ఆర్మీ కాల్పుల్లో 9 మంది భారత జవాన్లు చనిపోగా, రెండు భారత బంకర్లు ధ్వంసమయ్యాయన్నారు. పాక్ వాదనను భారత ఆర్మీ తోసిపుచ్చింది. ‘ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు వీలుగా శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అందుకు ప్రతిగా భారత్ జరిపిన కాల్పుల్లో పీఓకేలోని పలు ఉగ్రస్థావరాలు, ఆ స్థావరాలకు రక్షణ కల్పిస్తున్న పాక్ ఆర్మీ పోస్ట్‌లు ధ్వంసమయ్యాయి’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ పేరును వాడుకోవడం బీజేపీ నేతలు ఇకనైనా ఆపేయాలి’ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కోరింది.
పఠాన్‌కోట్.. ఉడి. పుల్వామా!
2016 జనవరి 2:
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న వైమానిక స్థావరంపై 2016 జనవరి 2వ తేదీ వేకువజామున ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది నేలకొరగగా నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. రాత్రి సమయంలో వైమానిక స్థావరంలోకి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ప్రవేశించిన ఉగ్రవాదులు పేలుళ్లు, కాల్పులతో విధ్వంసం సృష్టించారు. ఉగ్ర మూకలను ఏరిపారేసేందుకు సైన్యానికి 17 గంటలకుపైగా సమయం పట్టింది.
2016 సెప్టెంబర్ 28
ఉడి సైనిక స్థావరంపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రగిలిపోయిన భారత్.. సరిగ్గా పది రోజుల తర్వాత పగ తీర్చుకుంది. 2016 సెప్టెంబర్ 28వ తేదీన అర్థరాత్రి 12 గంటలకు కమాండోలతో కూడిన వైమానిక దళం విమానాలు ఎల్‌వోసీలోకి ప్రవేశించాయి. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం లోపలికి చొచ్చుకుని వెళ్లి భింబేర్, కేల్, హాట్ స్ప్రింగ్, లిపా సెక్టార్లలోని 7 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా 38 మంది ఉగ్రవాదులతోపాటు ఇద్దరు పాక్ సైనికులను హతం చేశాయి. నాలుగు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ లక్ష్యాలను సాధించి, పూర్తిగా విజయవంతమైందని సైన్యం ప్రకటించింది.
2019 ఫిబ్రవరి 14
2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వస్తున్న భద్రతా బలగాల కాన్వాయ్‌ని ఆత్మాహుతి దళ సభ్యుడు వాహనంతో ఢీకొట్టాడు. భారీ విస్ఫోటం సంభవించి 40 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ ఘటన అనంతరం భారత్ మరోసారి ఎల్‌వోసీలోకి వైమానికదళాన్ని పంపింది. బాలాకోట్‌లో నడుస్తున్న ఉగ్ర శిక్షణ శిబిరంపై భీకర దాడులు జరిపి, తీవ్ర నష్టం కలిగించింది. అనంతరం సరిహద్దుల్లో పాక్ ఎఫ్–16 కూల్చివేత, తదనంతర పరిణామాల్లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పట్టుబడటం, పాక్ అతడిని సురక్షితంగా విడిచి పెట్టడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment