భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ : తాజా వీడియో | Surgical Strikes Fresh Video Released On Thursday | Sakshi
Sakshi News home page

భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ : తాజా వీడియో

Published Thu, Sep 27 2018 5:29 PM | Last Updated on Thu, Sep 27 2018 6:13 PM

Surgical Strikes Fresh Video Released On Thursday - Sakshi

సరిగ్గా రెండేళ్ల క్రితం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు(సర్జికల్‌ స్ట్రైక్స్‌) జరిపింది. తోటి సైనికుల బలిదానాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన నాలుగు ‘టెర్రర్‌ లాంచ్‌ పాడ్‌’లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను నరేంద్ర మోదీ ప్రభుత్వం గత జూన్‌లో బహిర్గతం చేసింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగి శుక్రవారం(సెప్టెంబరు 29)కి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా గురువారం మరో వీడియోను విడుదల చేసింది.

సత్తా చాటిన భారత సైన్యం..
కశ్మీర్‌ బారాముల్లాలోని ఉడి సైనికస్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను హతమార్చారు. దీనికి ప్రతీకారంగా సరిగ్గా 11 రోజుల తర్వాత భారత సైనికులు మెరుపుదాడుల ద్వారా సత్తా చాటారు. 2016 సెప్టెంబర్‌ 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారు జాములోగా ముగించిన ఈ దాడులకు సంబంధించిన నాలుగు వీడియోలున్నాయి.

ప్రణాళికలో ఆయనదే కీలక పాత్ర..
జమ్మూ రీజియన్‌లో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి భద్రతను పర్యవేక్షించే 15 దళాలకు అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) రాజేంద్ర నింబోర్కర్‌ వ్యవహరించారు. సర్జికల్‌ దాడులకు ప్రణాళిక రచించడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన నింబోర్కర్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించే క్రమంలో పాటించిన జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చారు.

చిరుతలు చేసిన పరోక్ష సాయం!
‘దాడులకు సంబంధించిన ప్రణాళిక రచించే విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాం. ప్రణాళిక అమలు పరిచేందుకు.. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ మాకు ఒక వారం సమయం ఇచ్చారు. దాడులు చేయడానికి ఒకరోజు ముందు మాత్రమే మా దళంతో లక్ష్యిత ప్రాంతం గురించి చెప్పాను. ప్రణాళిక అమలుపరిచే క్రమంలో నియంత్రణ రేఖ అవతలి గ్రామాల్లోని కుక్కలు సైన్యాన్ని చూసి మొరిగే అవకాశం ఉంది. అదే జరిగితే వాటి అరుపులకు శత్రు దళాలు అప్రమత్తమవుతాయి. ఇందుకు పరిష్కార మార్గం కనుగొనటానికి నా పాత అనుభవం పనికివచ్చింది. చిరుతలకు కుక్కలు భయపడుతాయనే విషయాన్ని నౌషేరా సెక్టార్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌గా ఉన్న సమయంలో నేను గమనించాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మా సైనికులు చిరుత మల, మూత్రాలను చల్లుకుంటూ వెళ్లారు. అలా శత్రు మూకలు అప్రమత్తం కాకుండా జాగ్రత్తపడ్డాం’  అంటూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement