ఇస్లామాబాద్: ఉగ్ర శిబిరాలున్నాయంటూ భారత్ చెబుతున్న 22 ప్రాంతాల్లో అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పాకిస్తాన్ తెలిపింది. పుల్వామా ఆత్మాహుతి దాడితో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధం ఉందనే విషయం భారత్ అందించిన నోటీసులో లేదంది. తాము నిర్బంధంలోకి తీసుకున్న వారిలో 54 మందికి పుల్వామా ఘటనతో సంబంధం లేదని పాక్ చెప్పింది. అంతర్జాతీయంగా వచ్చిన తీవ్ర ఒత్తిడులకు తలొగ్గిన పాకిస్తాన్.. భారత్ అందజేసిన వివరాల మేరకు దర్యాప్తు చేపట్టడంతో పాటు వివిధ నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన 120 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. అయితే, తమ దర్యాప్తులో భారత్ ఆరోపణలకు తగిన రుజువులు లభించలేదనీ, మరిన్ని వివరాలు అందించాలని బుధవారం కోరింది.
ఆ దేశ అంతరంగిక శాఖ కార్యదర్శి ఆజం సులేమాన్ ఖాన్, విదేశాంగ శాఖ ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ గురువారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ‘జైషే మొహమ్మద్ అధినేత అజార్ కొడుకు హమ్మద్, సోదరుడుసహా 120 మందిని నిర్బంధంలోకి తీసుకున్నాం. వీరిలో 54 మందికి పుల్వామా దాడితో సంబంధం ఉన్నట్లుగా ఆధారాలు లేవు. ఉగ్ర శిబిరాలున్నట్లుగా పేర్కొన్న 22 ప్రాంతాల్లో సోదాలు జరపగా అటువంటివేమీ లేనట్లు తేలింది. కావాలంటే భారత్ తనిఖీ చేసుకోవచ్చు’ అని అన్నారు. ‘పుల్వామా ఘటన మా పనే’ అంటూ జైషే మొహమ్మద్ నేత ఆదిల్ దార్ ప్రకటిస్తున్నట్లుగా ఉన్న వీడియోల వంటి వాటిపైనా దర్యాప్తు చేపట్టాం’ అని వివరించారు. పాక్‌లో ఉగ్ర స్థావరాలున్నాయని చూపేందుకు మరిన్ని సాక్ష్యాలు కావాలంటూ పాక్ ఇచ్చిన సమాధానంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పుల్వామా దాడిని ఉగ్ర ఘటనగా గుర్తించేందుకు కూడా పాక్ సిద్ధంగా లేకపోవడాన్ని ఆయన ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment