న్యూఢిల్లీ : భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెరుపు దాడులు జరిపిన ఉగ్ర స్థావరాల ఫోటోలను ఇంటిలిజెన్స్ వర్గాలు రిలీజ్ చేశాయి.
ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రచురించిన ఈ ఫోటో బాలాకోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాల ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించినది. ట్రైనింగ్ సెంటర్ మెట్ల మీద అమెరికా, ఆస్ట్రేలియా, యూకే జాతీయ పతాకాలను చిత్రించారు. ఈ విషయం గురించి ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘శత్రువుల పట్ల ద్వేషాన్ని మరువకుండా ఉండేందుకు.. అను నిత్యం శత్రువును గుర్తు చేసుకునేందుకు గాను మెట్లపై ఇలా ఆయా దేశాల జెండాలను చిత్రించి ఉంటార’ని అధికారి తెలిపారు.
మంగళవారం సర్జికల్ స్ట్రైక్ జరిగిన బాలాకోట్ మన్‌షెహరా జిల్లాలో ఓ పట్టణం. ఇది నియంత్రణ రేఖకు దూరంగా ఉంటుంది. అంతేకాక జైషే ఉగ్ర సంస్థకు బాలాకోట్ కీలక స్థావరం. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు బావమరిది అయిన యూసుఫ్ అజర్ బాలాకోట్‌లో ఈ ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఇక్కడ ట్రైనింగ్ అవుతున్న వారిలో ఎక్కువ మంది మసూద్ అజర్ బంధువులే ఉన్నట్లు సమాచారం. దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణాన్ని 2003-04లో ప్రారంభించారు. ఇక్కడ ఒకేసారి దాదాపు 600 మందికి వసతి కల్పించవచ్చని తెలిసింది.
అయితే 2011లో అమెరికా.. ఆల్‌ఖయిదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన అబోటాబాద్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనే బాలాకోట్ ఉండటం గమనార్హం. వాస్తవానికి 2005లో వచ్చిన భూకంపంలో ఈ నగరం కొంత శిథిలమైంది. కానీ అక్కడ ఉగ్రకార్యకలాపాలు మాత్రం తగ్గడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment