‘బాలకోట్‌’లో భారత్‌ గురి తప్పిందా?! | Surgical Strike In Pakistan A Botched Operation? | Sakshi
Sakshi News home page

‘బాలకోట్‌’లో భారత్‌ గురి తప్పిందా?!

Published Fri, Mar 1 2019 5:49 PM | Last Updated on Fri, Mar 1 2019 6:13 PM

Surgical Strike In Pakistan A Botched Operation? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారు జామున మూడున్నర గంటలకు పాకిస్థాన్‌ భూభాగంలోకి దూసుకుపోయి బాలకోట్‌లోని జైషే మొహమ్మద్‌ స్థావరంపై బాంబుల వర్షం కురిపించిందని, ఈ దాడిలో దాదాపు 350 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని ఆ రోజే భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. దాంతోని ఒక్కసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం, ఆ మరుసటి రోజు భారత సైనిక స్థావరాలపైకి పాక్‌ యుద్ధ విమానాలు దూసుకురావడం, వాటిని భారత యుద్ధ విమానాలు తరమి కొట్టడం, అందులో ఓ యుద్ధ విమానం కూలిపోవడం, భారత పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ పాక్‌ సైనికులకు చిక్కడం, ఆ తర్వాత ఆయన్ని పాక్‌ అధికారులు వదిలేయడం తదితర పరిణామాలు చకచకా జరిగిపోయిన విషయం తెల్సిందే. (‘బాలకోట్‌’లో జరిగిన నష్టం ఎంత?)

ఇంతకు ఇన్ని పరిణామాలకు దారి తీసిన బాలకోట్‌పై భారత యుద్ధ విమానాలు చేసిన దాడిలో ఏ మేరకు నష్టం సంభవించింది? నిజంగా అక్కడ ఉగ్ర స్థావరం ధ్వంసం అయిందా? ఎంత మంది ఉగ్రవాదులు మరణించారు? భారత వైమానిక దళానికి చెందిన పన్నెండు మిరేజ్‌–2000 యుద్ధ విమానాలు ఉగ్ర స్థావరంపైకి దాడికి వెళ్లాయని, వెయ్యి కిలోల బాంబులను కురిపించి వచ్చాయని, ఉగ్ర స్థావరం ధ్వంసం అయిందని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. భారత యుద్ధ విమానాలు తొందరపాటులో ఖాళీ ప్రదేశంలో బాంబులు కురిపించి వెళ్లాయని, ఎవరికి, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ అదే రోజు పాకిస్థాన్‌ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ కొన్ని ఫొటోలను ట్వీట్‌ చేశారు. వాటిల్లో ఇజ్రాయెల్‌ తయారు చేసిన ‘స్పైస్‌–2000’ క్షిపణి తాలూకు రెక్క ముక్కలు కనిపించాయి. ఇతర ఫొటొల్లో ఓ చెట్టు కూలిన దృశ్యం, చిన్న మట్టిదిబ్బలో గుంత పడిన దృశ్యాలు ఉన్నాయి. పాక్‌ అధికార ప్రతినిధి అక్కడి వీడియో దృశ్యాలను కూడా పోస్ట్‌ చేశారు. వాటిలో బాంబు దాడుల గురించి స్థానికులు మాట్లాడుకోవడం, బాంబు పేలుడు వల్ల ఓ శకలం వచ్చి దురంద్‌ షా అనే ఓ పౌరుడు గాయపడినట్లు తెలిసింది. (‘అష్ట’దిగ్బంధనం..)

అంతర్జాతీయ జల సహకారానికి సంబంధించి యునెస్కో చెయిర్‌గా నియమితులైన స్వీడన్‌ యుప్ప్సాలా యూనివర్శిటీలో ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ రీసర్చ్‌’ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అశోక్‌ స్వేన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన దృశ్యాలు కూడా పాక్‌ సైనిక అధికార ప్రతినిధి పోస్ట్‌ చేసిన ఫొటోలకు దగ్గరగా ఉన్నాయి. వీటిలో వాస్తవాలను తెలుసుకునేందుకు అట్లాంట కౌన్సిల్‌కు చెందిన డీఎఫ్‌ఆర్‌ల్యాబ్‌ (డిజిటల్‌ ఫోరెన్సిక్‌ రీసర్చ్‌ ల్యాబ్‌) శాటిలైట్‌ చిత్రాల ద్వారా పరిశోధించి బాంబులు పడిన చోటును గుర్తించింది. శాటిలైట్‌ ఫిబ్రవరి 25–27 తేదీల మధ్య రికార్డు చేసిన ఆ ప్రాంతం చిత్రాలను కూడా పోల్చి చూసింది. తద్వారా పాక్‌ సైనికాధికారి, అశోక్‌ స్వేన్‌ పోస్ట్‌ చేసిన చిత్రాలన్ని బాంబులు పడిన చోటునే చూపిస్తున్నాయని డీఎఫ్‌ఆర్‌ల్యాబ్‌ ధ్రువీకరించింది. (ఇంటిగుట్టు పాక్‌కు చేటు)

బాంబులు పడిన చోటు బాలకోట్‌ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతాన్ని స్థానికులు ‘జాబా టాప్‌’ అని పిలుస్తారు. ఇది జాబా గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడ ఇజ్రాయిల్‌ తయారీ ‘స్పైస్‌–2000’ క్షిపణులు ప్రయోగించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, వెయ్యి కిలోల బాంబులు కురిపించిన దాఖలాలు లేవని డీఎఫ్‌ఆర్‌లాబ్‌ స్పష్టం చేసింది. మొత్తానికి బాంబు దాడుల్లో ఒక్కరు కూడా మరణించలేదన్న విషయం స్పష్టం అవుతోంది. ‘స్పైస్‌–2000’ క్షిపణలు ‘ప్రిసిషన్‌ గైడెడ్‌ మునిషన్స్‌ (పీజీఎం) వ్యవస్థ ఉంటుందని, అవి ఎప్పుడు గురితప్పవని, అలాంటిది బాలకోట్‌ లక్ష్యాన్ని ఎలా గురి తప్పిందో అర్థం కావడం లేదని డీఎఫ్‌ఆర్‌ల్యాబ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (పాక్‌ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement